మధిరలో చరిత్ర సృష్టించిన ‘భట్టి’…అందరివాడు..!

తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ నేత, మధిర నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క సరికొత్త చరిత్ర సృష్టించారు.  ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో నాలుగో పర్యాయం విజయం సాధించి రికార్డు నెలకొల్పారు భట్టి విక్రమార్క. మధిరలో నాలుగోసారి విజయం సాధించిన మధిర నియోజకవర్గ చరిత్రను ఒక్కసారి పరిగణలోకి తీసుకుంటే ఒకే అభ్యర్థి మూడుసార్లుకు మించి గెలిచిన దాఖలాలు లేనేలేవు. సీఎల్పీ నేతగా పోటీ చేసిన ఆయన గెలుపుపై నీలినీడలు అలుముకోగా..నాలుగోసారి సైతం విజయం సాధించి ఔరా..! అనిపించారు. అది కూడా ప్రస్తుత ఎన్నికల్లో పోటీ పడిన లింగాల కమల్‌ రాజుపై కావడం విశేషం.

మధిర నియోజకవర్గ చరిత్ర ను అధ్యయనం చేస్తే 1952లో తొలిసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టుల ఉమ్మడి పార్టీ అయిన పిడిఎఫ్‌ అభ్యర్థి వెంకయ్య   కమ్యూనిస్టు నాయకుడు కొండబోలు విజయం సాధించారు. 1957లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన బొమ్మకంటి సత్యనారాయణ గెలుపొందారు. తర్వాత 1962లో 1967లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా దుగ్గినేని వెంకయ్య విజయం సాధించారు. 1972లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిని దుగ్గినేని వెంకట రావమ్మ జయ కేతనం ఎగురవేశారు. 1978లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున బండారు ప్రసాదరావు, 1983 ఎన్నికల్లో అదే కాంగ్రెస్‌ కి చెందిన శీలం సిద్ధారెడ్డి గెలుపొందారు. ఆరు పర్యాయాలు జరిగిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తూ వచ్చినా అభ్యర్థులు మారుతూ వచ్చారు. అనంతరం 1985, 1989, 1994లో ఎన్నికల్లో సీపీఎం సీనియర్‌ నాయకుడు బోడేపూడి వెంకటేశ్వరరావు వరుసగా మూడుసార్లు విజయం సాధించారు. తర్వాత 1998లో జరిగిన ఎన్నికల్లో  సిపిఎం పార్టీ గెలుపొందినప్పటికీ అభ్యర్థి మాత్రం మారారు. ఆ ఎన్నికల్లో సిపిఎం ఎమ్మెల్యేగా కట్టా వెంకట నరసయ్య విజయం సాధించారు. 1999లో టిడిపికి చెందిన కొండబాల కోటేశ్వరరావు గెలుపొందారు. 2004లో జరిగిన ఎన్నికల్లో సిపిఎం తరఫున కట్టా వెంకట నరసయ్య మరోసారి విజయం సాధించారు.

రాజకీయ రంగ ప్రస్థానం ..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైరా మండలం స్నానాల లక్ష్మీపురానికి చెందిన మల్లు అఖిలాండ, మాణిక్యమ్మ దంపతులకు 1961 జూన్‌ 15న భట్టి విక్రమార్క జన్మించారు. హైదరాబాద్‌ నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. సెంట్రల్‌ యూనివర్శిటీ నుంచి 1986లో ఎంఏ (చరిత్ర) పూర్తి చేశాడు. మల్లు భట్టి విక్రమార్కకు నందినితో వివాహం జరగ్గా.. సూర్య విక్రమాదిత్య, సహేంద్ర విక్రమాదిత్య ఇద్దరు కుమారులున్నారు. భట్టి విక్రమార్కది ముందు నుంచే రాజకీయ కుటుంబం. మల్లు కుటుంబంలో భట్టి విక్రమార్క కంటే ముందే.. అనంత రాములు, మల్లు రవి రాజకీయంలో ఉన్నారు.
మల్లు అనంత రాములు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా పని చేశారు. ఆయన ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని నాగర్‌ కర్నూల్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఆయన ఆకస్మిక మరణంతో మల్లు రవి నాగర్‌ కర్నూల్‌ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అనంతరం, జడ్చర్ల నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. మల్లు అనంతరాములు మరణం తర్వాతే భట్టి విక్రమార్క కూడా రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1990-92 వరకు ఆంధ్రా బ్యాంక్‌ డైరెక్టర్‌గా మల్లు భట్టి విక్రమార్క పనిచేశారు. 1990-92 లో పిసిసి కార్యనిర్వాహక సభ్యుడుగా, తర్వాత 2000-03 కాలంలో పిసిసి కార్యదర్శి బాధ్యతలు చేపట్టారు. 2009 సాధారణ ఎన్నికల్లో ఆ స్థానం ఎస్సీ కేటగిరీకి కేటాయించడంతో మధిర నుంచి భట్టి విక్రమార్క కాంగ్రెస్‌ తరపున పోటీచేసి  సిపిఎం కి చెందిన ప్రత్యర్థి లింగాల కమల్‌ రాజ్‌ ను ఓడిరచి తొలిసారి మధిర ఎమ్మెల్యేగా గెలుపొందారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ సీఎంగా ఉన్న సమయంలో పార్టీలో భట్టి చురుకుగా వ్యవహరించారు. 2007లో జరిగిన ఖమ్మం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా భట్టి గెలుపొందారు.

ఎమ్మెల్యేగా నాలుగుసార్లు…
ఎమ్మెల్సీగా కొనసాగిన భట్టి, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో మధిర నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి వరకు సీపీఐ(ఎం) కంచుకోటగా ఉన్న మధిరలో ఆయన గెలిచి రికార్డు సృష్టించారు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో 2009 నుంచి 2011 వరకు చీఫ్‌ విప్‌గా, 2011 నుంచి 2014 వరకు డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరించారు. 2014, 2018లో ఎన్నికల్లో కూడ వరసగా కమల్‌ రాజుపై భట్టి గెలుపొందుతూ వచ్చారు. 2018 సార్వత్రిక ఎన్నికల్లో మధిర నియోజక వర్గం నుంచి మూడోసారి కూడా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బోడేపూడి వెంకటేశ్వరరావు తర్వాత మధిర నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్‌ సాధించిన రెండో వ్యక్తిగా నిలిచారు.  2018లో తెలంగాణ అసెంబ్లీలో సీఎల్పీ నేతగా భట్టి ఎన్నికయ్యారు. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో.. ప్రజాగొంతుకగా ప్రశ్నలు సంధిస్తూ  ప్రభుత్వాన్ని బాగా ఇరుకున పెట్టారు. 2019 జనవరి 18న కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ నాయకుడిగా భట్టి విక్రమార్కను నియమించారు.

సీఎల్పీ నేతగా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి బాటలో నడిచి తనదైన పాత్ర పోషించారు. పీపుల్స్‌ మార్చ్‌ పేరుతో సుదీర్ఘ పాదయాత్ర చేసి.. ప్రజల కష్టాలు తెలుసుకుంటూ తామున్నామన్న అభయహస్తం ఇచ్చారు. ఆయన పాదయాత్రతో అటు ప్రజల్లో కాంగ్రెస్‌ పార్టీపై నమ్మకాన్ని పెంచటంతో  పాటు ఇటు పార్టీ శ్రేణుల్లో కూడా ఉత్సాహాన్ని నింపారు భట్టి విక్రమార్క. తెలంగాణలో చావు బతుకుల్లో ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి ఊపిరిలూదేందుకు మల్లు భట్టి విక్రమార్క తనదైన కృషి చేశారు. పీపుల్స్‌ మార్చ్‌ పేరుతో 2023 మార్చి 16న ఆదిలాబాద్‌ జిల్లాలోని బోథ్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మధిర వరకు 1360 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఈ యాత్ర 17 జిల్లాలు, 36 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా సాగింది. యాత్రలో అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతూ.. కష్టసుఖాలు తెలుసుకుంటూ.. కాంగ్రెస్‌ పార్టీని జనాల్లోకి తీసుకెళ్లారు భట్టి. ఈరోజు కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టడంలో  భట్టి పాదయాత్ర కూడా ఓ కారణంగా చెప్పకుండా ఉండలేం.

1364 కిలో మీటర్లు..109 రోజులు పాదయాత్ర
మండుటెండలు, దట్టమైన గుట్టలు, పొగలు కక్కేరోడ్లు, వేల అడ్డంకులు ఆయన సంకల్పానికి అడ్డు రాలేదు. పాదయాత్ర చేసిన దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ గెలిచిందన్న కీర్తి దక్కించుకున్నారు.  ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం వరుస భేటీలు జరుపుతున్న కీలక సమయంలో మధిర నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున గెలిచిన మల్లు భట్టి విక్రమార్క పేరు ప్రచారంలోకి వచ్చింది. ‘ప్రతి పేదవాడి గుండె తాకిన క్షణాలు… గుండె నిండా ఆత్మ స్థైర్యం, కుంగిపోతున్న జీవితాలకు ఈ అరాచక పాలన నుండి విముక్తి ఇవ్వాలన్న లక్ష్యం, నైరాశ్యంలో ఉన్న క్షేత్రస్థాయి కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాలన్న ఆశ.. ఇవే నా పాదయాత్రకు ఆయువు పోసి నడిపించాయన్నారు భట్టి.
దట్టమైన గుట్టలు, పొగలు కక్కే రోడ్డులు, వేల అడ్డంకులు.. మండుటెండలు, వడగళ్ల వానలు, ఎముకలు వొణికించే చలి…  ఏవి  సంకల్పానికి అడ్డు కాలేదు.   అంతేకాదు.. 1364 కిలో మీటర్లు, 109 రోజులు పాదయాత్ర చేసిన ఘనత సాధించారు. ఆయన అడుగుపెట్టిన అన్ని నియోజకవర్గాల్లో దాదాపు కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించిందని చెప్పవచ్చు.  కాంగ్రెస్‌ పార్టీకి  అఖండ విజయాన్ని అందించినందుకు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరేలా గ్యారెంటీ పథకాలను, మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం ముచ్చటగా మూడో సారి నవంబర్‌ 30న జరిగిన ఎన్నికల్లో  మధిర నుంచి గెలిచిన భట్టి..

భట్టి అందరివాడు…
పార్టీలకు అతీతంగా కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరికీ  సహాయం చేస్తానని, నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, ప్రతి వ్యక్తికి తాను అందుబాటులో ఉంటాని, సహాయం కోసం తన దగ్గరకు వచ్చే వ్యక్తి.. ఏ పార్టీ, ఏ వర్గం, ఏ గ్రామం, అనేవి తనకు అవసరం లేదని స్పష్టం చేశారు. తన దగ్గరకు వచ్చే వారందరికీ తాను చేయగలిగిన సహాయం చేస్తానని, తాను  ఏ ఒక్కరి వాడో కాదని.. అందరివాడినని చెప్పారు. భట్టి పుట్టు కాంగ్రెస్‌ వాది. సౌమ్యుడు, దూకుడు వ్యక్తి కాదు, దళిత వర్గానికి చెందిన విద్యావంతుడు, ఆలోచనా పరుడు. నిగర్వి, అందర్నీ  కలుపుకునిపోయే వ్యక్తి. పార్టీ నాయకత్వం పట్ల విశ్వాసం..  వై ఎస్‌ రాజశేఖర రెడ్డి, రోశయ్య, కిరణ్‌ కుమార్‌ రెడ్డికి అభిమాన పాత్రుడే. కాంగ్రెస్‌ కీలక నేత, సీఎల్పీ లీడర్‌ భట్టి విక్రమార్క మధిర నుండి మరో సారి విజయం సాధించారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి లింగాల కమల్‌ రాజ్‌పై 35,190 వోట్ల తేడాతో భట్టి గెలుపొందారు. సీఎం పదవి ఇస్తే భాద్యతతో పని చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ సత్తా చాటింది.
పాదయాత్రతో పార్టీలో నూతనోత్సాహంతో విజయం సాధించి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. కొత్త సర్కారు కూడా కొలువుదీరనుంది. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు టీపీసీసీగా రేవంత్‌ రెడ్డి చేసిన కృషితో పాటు సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క కృషి విస్మరించలేం. ఆయన చేసిన పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర పార్టీలో నూతనోత్సాహం నింపటంతో  గెలుపు సాధించి కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువు దీరనుంది. తెలంగాణకు రెండో సీఎంగా రేవంత్‌ రెడ్డి డిసెంబర్‌ 7న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భవిష్యత్‌ ముఖ్యమంత్రి భట్టి అని విశ్లేషకుల అంచనాలు మారి.. మాజీ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కకు అధిష్ఠానం డిప్యూటీ సీఎంతో పాటు కీలక శాఖను అప్పగిస్తున్నట్లు ఖరారయింది.

ప్రియాంక, రాహుల్‌ ప్రశంశలందుకున్న భట్టి..
రాహుల్‌, ప్రియాంక, ఖర్గే, డి కె ఎక్కువగా పర్యటించింది రేవంత్‌, భట్టి తోనే కావడం ప్రత్యేకత సంతరించుకుంది.  ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకోవాలని.. మధిరకు వరదలా నిధులు తెస్తానని హామీ ఇచ్చారు. 78-84 స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలవబోతోందని భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. ‘‘నా సోదరుడు రాహుల్‌ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ వరకు ‘భారత్‌ జోడో యాత్ర’ చేశారు. తెలంగాణలో మల్లు భట్టి విక్రమార్క  పాదయాత్ర చేశారు. వారు ఇద్దరు  మీ మధ్యకు వచ్చి, మీ గొంతు విని, మీ సమస్యలను పరిష్కరించుకోవడమే వారి పాదయాత్ర ఉద్దేశం’’, అని స్వయంగా ప్రియాంక ప్రశంసించడం విశేషం. మధిర పోరాటాల పురిటిగడ్డ అని.. సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరిలూదిన గడ్డ ఇది అని చెప్పారు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద వాడికి ఇల్లు, ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం, ప్రతి రైతులకు గిట్టుబాటు ధర భట్టి వాగ్దానం చేసారు. జలగం వెంగళరావు ముఖ్యమంత్రి అయిన జిల్లా నుంచీ మొదటి సారి ఉపముఖ్య మంత్రి హోదా లభిస్తున్న మొదటి కాంగ్రెస్‌ నేత భట్టి విక్రమార్కనే.

నందిరాజు రాధాకృష్ణ,
వెటరన్‌ జర్నలిస్ట్‌, 98481 28215 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *