మతపర రిజర్వేషన్లకు బిజెపి వ్యతిరేకం

  • అధికారంలోకి రాగానే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఎత్తేస్తాం
  • తెలంగాణ అభివృద్ధికి బిజెపి కట్టుబడి వుంది
  • ఎస్సీ వర్గీకరణను సాధించి చూపుతాం
  • బిఆర్‌ఎస్‌ పాలనలో అన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తి
  • అవినీతి కెసిఆర్‌ను ఇంటికి పంపించడం ఖాయం
  • విూడియా సమావేశంలో కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌ షా

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 25 : మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తామని ప్రకటించారు. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన విూడియా సమావేశంలో ఆయన తెలంగాణపై వరాల జల్లు కురిపించారు. ఈ సందర్భంగా అమిత్‌ షా మాట్లాడుతూ…బీజేపీ అధికారంలోకి రాగానే 4 శాతం ముస్లిం రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కేటాయిస్తామని స్పష్టం చేశారు. బీజేపీకి అవకాశమిస్తే వరి పంటకు వెయ్యి రూపాయల బోనస్‌ ఇస్తామన్నారు. సీఎం కేసీఆర్‌ను ఇంటికి పంపించాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారన్నారు. మిగులు రాష్ట్రాన్ని కేసీఆర్‌ అప్పుల రాష్ట్రంగా మార్చారని అమిత్‌ షా అన్నారు. గెలిచిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లో చేరటం ఖాయమని అమిత్‌ షా అన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ రేట్లను తగ్గిస్తూ..మొదట కేబినెట్‌ సమావేశంలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. కేసీఆర్‌ హాయాంలో యువత సహా..అన్ని వర్గాలు నిరాశలో ఉన్నాయని అమిత్‌ షా పేర్కొన్నారు. పాస్‌పోర్ట్‌, మియాపూర్‌ భూములు, ఔటర్‌ రింగ్‌ రోడ్‌, గ్రానైట్‌, మనీ లాండరింగ్‌.. కేసీఆర్‌ సర్కార్‌ అవినీతి మయమయ్యాయన్నారు. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు మాత్రమే డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లు, దళితబంధు పథకాలు వొస్తున్నాయని అమిత్‌షా తెలిపారు. లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని కేసీఆర్‌ మాట తప్పారన్నారు. రూ.3,116 నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదని అమిత్‌ షా ప్రశ్నించారు.

రైతు రుణమాఫీ చేయడంలో కేసీఆర్‌ సర్కార్‌ విఫలమైందన్నారు. ఫార్మా సిటీ, విద్యా సిటీ, టెక్స్‌ టైల్స్‌ పార్క్‌..ఎక్కడని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ వలనే తెలంగాణ రాష్ట్రం ఆలస్యమవుతుందన్నారు. కాంగ్రెస్‌, ఎంఐఎంకు వోటు వేస్తే..బీఆర్‌ఎస్‌కు వోటు వేసినట్లేనని అమిత్‌ షా పేర్కొన్నారు.  తెలంగాణ భూముల వేలంలో రూ. 4 వేల కోట్లు అవినీతి జరిగిందని అమిత్‌ షా ఆరోపించారు. ఓఆర్‌ఆర్‌ లీజు వేలంలోనూ, కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా కుంభకోణం జరిగిందన్నారు. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందని అమిత్‌ షా పేర్కొన్నారు. లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు..అదీ జరగలేదన్నారు. ఉద్యోగ పరీక్షల పేపర్లు చేసి కుంభకోణానికి పాల్పడ్డారని మండిపడ్డారు. రైతులకు రూ. లక్ష రూణమాఫీ చేస్తామని పూర్తి చేయలేదని తెలిపారు. రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని మరిచిపోయారు.

హైదరాబాద్‌లో 4 మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్ల నిర్మాణం ఏమైందని ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని షా తెలిపారు. రెండు దశాబ్దాలుగా మాదిగ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందని అమిత్‌ షా పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణను వేగవంతం చేయటం కోసం కేంద్ర కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఇంట్లో కూర్చుని ప్రభుత్వాన్ని నడిపేవారికి పరిపాలన ఏం తెలుసని ప్రశ్నించారు. ఫామ్‌ హౌస్‌లో కాదు .. ముఖ్యమంత్రి సచివాలయంలో ఉండాలన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే విచారణ జరిపి అవినీతి పరులను జైలుకు పంపుతామని అమిత్‌ షా పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వొచ్చాక..ప్రస్తుత పథకాలను కొనసాగిస్తామన్నారు. ఎంఐఎం వలనే కేసీఆర్‌ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించటం లేదన్నారు. కేంద్ర నిధులపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ అవాస్తవాలు మాట్లాడుతున్నారన్నారు. దక్షిణాదిలో అన్ని రాష్టాల్రపై బీజేపీ ఫోకస్‌ చేసిందని అమిత్‌ షా పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *