మణిపూర్ తగలబడుతుంటే మోదీ, షా వోట్ల వేట

గిరిజనులు అంటే మోదీకి చులకన
విభజించు పాలించు అనే విధానాన్ని బీజేపీ అవలంభిస్తోంది
లోక్ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
న్యూ దిల్లీ,ప్రజాతంత్ర, ఆగస్ట్ 9:
గడిచిన తొమ్మిదేళ్లుగా ఈ దేశంలో విభజించు పాలించు అనే విధానాన్ని బీజేపీ అవలంభిస్తోందని, మణిపూర్‌తో సహా దేశంలోని పలు చోట్ల జాతుల మధ్య వైరాన్ని పెంచిపోషిస్తూ బీజేపీ పార్టీ తన అధికారాన్ని పదిలం చేసుకోవాలని చూస్తోందని మల్కాజ్ గిరి ఎంపీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం లోక్ సభలో ఇండియా కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు.
 ప్రధానికి ఆదివాసీలు, గిరిజనుల పట్ల చులకనభావం ఉందని, ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజైనా పార్లమెంట్‌కు వచ్చి దేశంలో ఆదివాసీలు, గిరిజనులపై జరుగుతున్న దాడులపై స్పందిస్తారని అంతా భావించామని కానీ ఆయన రాలేదన్నారు.  ఆదివాసీలు, గిరిజనులపై ప్రధానికి చులకనభావమన్నారు. మణిపూర్‌లో జరిగిన దాడులపై ప్రధాని జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మణిపూర్‌లో ఆడబిడ్డలు కాలిపోయి, అక్కడి ప్రజల తలలు తెగిపడుతుంటే బాధ్యత వహించాల్సిన ప్రధాని మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలు కర్నాటకలో ఓట్ల వేటలో ఉన్నారని ఆరోపించారు. మణిపూర్‌లో గిరిజనులపై జరుగుతున్న దాడులను దృష్టిలో పెట్టుకుని రాముడిని, భజరంగ్ దళ్‌ను రాజకీయాలకు వాడుకుందామని చేసిన ప్రయత్నాలను కర్నాటక ప్రజలు తిప్పికొట్టారన్నారు. బీజేపీకి ఎన్నికలు, రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం అన్నారు. ఎన్డీయే అంటే నేషన్ డివైడ్ అలయెన్స్ అని ఎద్దేవా చేశారు. ప్రధాని సభకు వచ్చి మణిపూర్ ప్రజలకు విశ్వాసం, నమ్మకం కలిగించేలా ఆదేశించాలని 140 కోట్ల తరపున తాను స్పీకర్‌ను విజ్ఞప్తి చేస్తున్నాన్నారు రేవంత్ రెడ్డి.
ప్రపంచంలోనే అత్యధిక అబద్దాలు ఉన్న పుస్తకాలు బీజేపీ మేనిఫెస్టోలు అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. మోదీ నినాదం వన్ నేషన్ వన్ ఎలక్షన్, వన్ ట్యాక్స్ కాదు. ఆయన నినాదం వన్ నేషన్ వన్ పర్సన్..ఇది శోచనీయం.. దేశానికి అవమానం..అని బీజేపీ తీరును రేవంత్ దుయ్యబట్టారు. గత తొమ్మిదేళ్లుగా మోదీ నేతృత్వంలో ప్రజలకు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదు. ప్రతీ ఏటా 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న హామీ నెరవేరలేదు. నల్లధనం వెనక్కు తెచ్చి పేదవాడి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్న హామీ ఏమైందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అందుకే గొగోయ్ గారు ఇండియా కూటమి తరపున  ఇచ్చిన అవిశ్వాసాన్ని సమర్దిస్తున్నా అన్నారు. తెలంగాణను భవిష్యత్ ను నాశనం చేయడానికి లిక్కర్ పార్టీ, నిక్కర్ పార్టీ ఒక్కటయ్యాయి అని రేవంత్ రెడ్డి బీఆర్ఎస్, బీజేపీ పార్టీల తీరును ఎండగట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *