Take a fresh look at your lifestyle.

భూమిని గుంజుకోవడం..లాఠీ దెబ్బలు తగిలించడం

  • ఇదేనా నీ దృష్టిలో అభివృద్ది అంటే..
  • కెటిఆర్‌కు రేవంత్‌ ‌సూటి ప్రశ్న
  • పిజెఆర్‌ ‌పేదల గుండెచప్పుడు అన్న పిసిసి చీఫ్‌
  • ‌విజయారెడ్డికి కండువా కప్పి పార్టీలోకి స్వాగతించిన రేవంత్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 23 : ‌బలవంతంగా భూమిని గుంజుకోవడం.. బక్క రైతుపై లాఠీ ఝుళిపించడం..కేటీఆర్‌ ‌దీనిని అభివృద్ధి అంటారా.. అరాచకం అంటారా..అని టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ప్రశ్నించారు. ఇటీవల సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో పరిహారం ఇవ్వకుండా, తమ సమస్యలు పరిష్కరించకుండా భూములు లాక్కున్నారంటూ నిమ్జ్ ‌భూ నిర్వాసితులను నిరసనకు దిగిన సంగతి తెలిసిందే. నిమ్జ్‌లో తొలి పరిశ్రమ వెమ్‌ ‌ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో, తమ సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు  భూ నిర్వాసితులు ఆందోళన చేపట్టారు.

ఈ క్రమంలోనే ర్యాలీగా వచ్చిన భూ నిర్వాసితుల ను అడ్డుకున్న పోలీసులు…. వారిని అదుపుచేసే క్రమంలో లాఠీ ఛార్జ్ ‌చేశారు. ఈ దాడుల నేపథ్యంలో వొచ్చిన వార్తాకథనాలు జోడిస్తూ రేవంత్‌ ‌రెడ్డి ట్విట్టర్‌ ‌వేదికగా ఈ రకమైన కామెంట్స్ ‌చేశారు. భూమిని త్యాగం చేసే రైతుకు లాఠీదెబ్బలు? లాభార్జనే ధ్యేయమైన వ్యాపారులకు రెడ్‌ ‌కార్పెట్లా??! అని ఈ సందర్భంగా రేవంత్‌ ‌దుయ్యబట్టారు.

విజయారెడ్డికి కండువా కప్పి పార్టీలోకి స్వాగతించిన రేవంత్‌
అధికార టిఆర్‌ఎస్‌కు షాక్‌ ‌తగిలింది. కార్పోరేటర్‌, ‌మాజీమంత్రి దివంగత పీజేఆర్‌ ‌తనయ, ఖైరతాబాద్‌ ‌కార్పొరేటర్‌ ‌విజయారెడ్డి గురువారం పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఆమెకు రేవంత్‌ ‌రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆమె గతంలో మేయర్‌ ‌పదవి కోసం పోటీ పడ్డారు. ఈ సందర్బంగా రేవంత్‌ ‌మాట్లాడుతూ…పిజెఆర్‌ ‌పేరు తెలియని వారు ఎవరూ ఉండరని, పేదలకు పెద్దన్న పీజేఆర్‌ అని అన్నారు. నగరంలో ఎన్నో బస్తీలు పీజేఆర్‌తో వెలిశాయన్నారు. ప్రజల కోసం సొంత పార్టీని కూడా నిలదీయడానికి పీజేఆర్‌ ‌వెనుకాడలేదని, చివరి శ్వాసవరకు పీజేఆర్‌ ‌పేదల కోసం పని చేశారని కొనియాడారు. పీజేఆర్‌ ‌పోరాటం వల్లనే కృష్ణాలో వాటా దక్కిందన్నారు.

- Advertisement -

జంట నగరాలకు కృష్ణా వాటర్‌ ‌కోసం ఆయన పోరాటం చేశారని, కొందరు తమ ఘనతగా ఇప్పుడు గొప్పలు చెప్పు కొంటున్నారని అన్నారు. నగరంలో పేదోళ్లకు ఇళ్లు, ఇళ్ల పట్టాలు ఇప్పించారన్నారు. పీజేఆర్‌ ‌లేని లోటు తెలంగాణలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కాంగ్రెస్‌ ‌బహిష్కరించినా ఆయన కాంగ్రెస్‌ ‌జెండా వీడలేదన్నారు. పీజేఆర్‌ ‌పెంచి పోషించిన వారే ఇప్పుడు నగరంలో ఎమ్మెల్యేలు అయ్యారన్నారు. నగరంలో నేడు మహిళలకు, పేదలకు రక్షణ లేదని, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. బస్తీ ప్రజల పక్షాన పోరాడటం కోసం నాయకత్వం అవసరమ న్నారు. అందుకోసమే విజయారెడ్డి కాంగ్రెస్‌లో చేరారన్నారు. హైదరాబాద్‌ ‌పేద ప్రజల పక్షాన పోరాడే దళపతి దొరికిందని, విజయారెడ్డికి మంచి గౌరవం దక్కుతుందని రేవంత్‌ ‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రతీ పేదవాడి గుండెలో ఉండే నేత పీజేఆర్‌  అని కాంగ్రెస్‌ ఎం‌పీ కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి  అన్నారు.

కాంగ్రెస్‌ ‌కొంత వీక్‌గా ఉన్న సమయంలో ఆయన కూతురు విజయారెడ్డి పార్టీలోకి రావడం సంతోషంగాఉందన్నారు. ఎంతోమంది పేదలకు పీజేఆర్‌ ‌పట్టాలు ఇప్పించారన్నారు. ఆయన కుమార్తె విజయారెడ్డికి మంచి భవిష్యత్‌ ఉం‌దన్నారు. ఖైరతాబాద్‌ ‌సహా ఎక్కడ పోటీ చేసినా ఆమె గెలుస్తుందన్నారు. కాంగ్రెస్‌ను గెలిపించుకుంటేనే పీజేఆర్‌కు నిజమైన నివాళి అని అన్నారు. కాంగ్రెస్‌ ‌డిమాండ్‌తో రైతుబంధు ఇస్తానని ప్రభుత్వం హావి• ఇచ్చిందన్నారు. వరి కొని రెండు నెలలు దాటినా ఇంకా రైతులకు డబ్బులు రాలేదన్నారు. మెట్రో, ఎయిర్‌ ‌పోర్ట్ ‌కాంగ్రెస్‌ ‌కృషితోనే వచ్చాయని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి చిన్నారెడ్డి, మాజీ ఎంపి అంజన్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply