సంగారెడ్డి, ప్రజాతంత్ర,డిసెంబర్ 7: దేశ రక్షణ కోసం, భారత ప్రజల సుఖశాంతుల కోసం తమ జీవితాలను త్యాగం చేస్తున్న భారత త్రివిధ దళాల సేవలు మరువలేనివని, వారి సంక్షేమానికి ప్రతి ఒక్కరూ చేయూతనందించాలని జిల్లా కలెక్టర్ శరత్ పిలుపునిచ్చారు. గురువారం సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శరత్ తన వంతు విరాళాన్ని అందజేసారు.
దేశభద్రత లో భాగంగా శత్రువుల దాడులలో అమరులైన మాజీ సైనికులకు,మాజీ సైనిక వితంతువులకు, సైనికులకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
దేశభద్రతలో భాగంగా తమ ప్రాణాలను సైతం ఖాతరు చేయకుండా, ప్రజలకు రక్షణ కవచంగా ఉంటున్నారని, వారి సేవలు మరువరానివని కొనియాడారు.
మరణించిన సైనిక కుటుంబాల సంక్షేమానికి మన వంతు బాధ్యతగా తోచిన సాయం అందించి ఆదుకోవాలన్నారు.
విరాళాలు సేకరిస్తున్న ఎన్ సి సి విద్యార్థులను బాగా చదువుకొని ఉన్నతంగా ఎదగాలని ఉద్బోధించారు. అన్ని చేతులు కలిస్తే చిన్న సాయమే పెద్దదవుతుందని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో సైనిక సంక్షేమ శాఖ సిబ్బంది సరస్వతి, నాగేశ్వరరావు, సయ్యద్ సాయం,ఎన్ సి సి అధికారి కృష్ణ ప్రియ, మంజిత్ సింగ్ ,ఎన్ సి సి విద్యార్థులు,
మాజీ సైనికులు దశరథ్, చంద్రసేనుడు, ఎన్సిసి విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
భారత త్రివిధ దళాల సంక్షేమానికి చేయూత నందించాలి
