- ఉష్ణోగ్రతల పెరుగుదలకు తోడు వడగాలులు
- రానున్న 2 రోజుల్లో 2-4 డీగ్రీలు పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిక
- జాగ్రత్తగా ఉండాలని వైద్యుల సూచన
హైదరాబాద్,ప్రజాతంత్ర, మార్చి 31 : రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యధికంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరిలో 43.9 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా చేప్రాలలో 43.8, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో 43.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురువారం నుంచి 2-4 డిగ్రీలు అదనంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్ర, శనివారాల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయని పేర్కొన్నది. ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ ఏడాది పగటి ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉంటుందని తెలిపింది. బంగాళాఖాతం నుంచి రాష్ట్రంలోకి గాలులు వీస్తాయని, ఉత్తర, దక్షిణ ద్రోణి తెలంగాణపై ఏర్పడుతుందని, దీంతో వొచ్చే వారం వర్షాలు వొస్తాయని వెల్లడించింది. మొత్తంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వారం, పది రోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. ఎండవేడిమికి మధ్యాహ్నం ఇండ్ల నుంచి బయటకు వెళ్లేందుకు జనాలు జంకుతున్నారు. దీంతో వ్యవసాయ, ఉపాధి హావి• కూలీలు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఉదయం 7గంటల నుంచే ఎండ చురుకుమంటుంది. 11 గంటలు దాటితే ఇంట్లో నుంచి బయటకు వెళ్లే పరిస్థితిలేదు. మధ్యాహ్నం మూడు గంటల వరకు రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఇంట్లో ఉన్నా తీవ్ర ఉక్కపోతతో జనం ఉక్కిరి బిక్కిరవుతున్నారు. పగటి ఉష్ణోగ్రత పదిరోజులు గా 39 నుంచి 43 డిగ్రీల మధ్య నమోదుకావడంతో నిప్పుల కొలిమిగా మారింది. ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య ఉష్ణోగ్రతలు 39 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ నమోదవుతుంది. మధ్యాహ్నం 12నుంచి మూడు గంటల వరకు 41 డిగ్రీలు పైగా నమోదవుతుంది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు శీతలపానియాల వైపు మొగ్గు చూపుతున్నారు.
ఆదిలాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి తీసుకు వొచ్చిన రంజన్లను విక్రయిస్తుండడంతో ప్రజలు కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కూలర్లకు గిరాకీ పెరిగింది. వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. పగటిపూట అవసరమైతే తప్ప బయట తిరగొద్దని, శారీరక శ్రమతో కూడిన పనులు చేయవద్దని, డీహైడ్రేషన్‌కు గురవకుండా మంచినీటిని అధికంగా తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. కాటన్ దుస్తులనే ధరించాలని, ఎండలో ప్రయాణించాల్సి వొస్తే ముఖానికి రుమాలు కట్టుకోవాలని, టోపీలు, చలువ అద్దాలు, గొడుగు, హెల్మెట్ ధరించాలని, పంచదార, మజ్జిగ, నిమ్మరసం, ఉప్పుకలిపిన నీటిని తరుచూ తాగాలని, ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించాలని అన్నారు.