Take a fresh look at your lifestyle.

భదాద్రికి రామయ్య పెళ్ళి కళ

భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 28 : యావత్‌ ‌భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం భద్రాచలం. అదిగో అదిగో భద్రగిరి…ఆంధ్రజాతికది అయోధ్యపురి…అలాంటి పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ సీతారాములు కొలువైన స్థలం భద్రిగిరి. నూతనంగా వివాహమైన జంటను పెద్దలు సీతారాముల్లాంటి దాంపత్య జీవితం కలిగి ఉండాలని మనసారా దీవిస్తారు. నిజమైన దాంపత్యానికి నిదర్శనమైన శ్రీ సీతారాముల పెళ్లి వేడుక ఆంధ్రుల అయోధ్యాపురి అయిన భద్రాచలంలో కన్నులపండువగా ప్రతీ ఏటా పునర్వసు నక్షత్రంలో అభిజిత్‌లగ్నమందు చైత్రశుద్ద నవమి నాడు జరుగుతుంది.

నయనానందకరంగా సాగే జగధభిరాముని కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు తెలంగాణ,ఆంధ్రా రాష్ట్రాల నుండే కాకుండా సరిహద్దున ఉన్న ఛత్తీస్‌ఘడ్‌,ఒరిస్సా, రాస్ట్రాల నుండి లక్షలాదిగా భక్తులు భద్రాచలం చేరుకుంటారు. ఆ దేవదేవుని కల్యాణ మహోత్సవం మధ్యాహ్నం 12 గంటలు దాటిన తరువాత నిర్వహించడం ఆనవాయితీ. సూర్యుడు ఉన్న రాశి నుండి నాల్గవ లగ్నం ఏ లగ్నమందువుటుందో ఆ లగ్నాన్ని అభిజిత్‌లగ్నమని పిలుస్తారు. దేశమంతటా శుభకార్యాలు ఈ లగ్నంలోనే జరగడం విశేషం. శుభపద్రమైన అభిజిన్ముహూర్తం అనేక దోషాలను పోగొడుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ ముహూర్తం మంగళకరమైనదిగా భావిస్తారు. అందుకే ఆనాది కాలం నుండి అభిజిత్‌లగ్నంలో భద్రాచలంనందు సీతారాముల కల్యాణం నిర్వహించడం జరుగుతుంది.

కన్నుల పండుగగా జరుగనున్న కళ్యాణం :
ప్రత్యక్షంగా దేవదేవుని పెళ్లి వేడుకను కన్నుల్లారా వీక్షిస్తే అంతకుమించిన మహాత్భాగ్యమేనని అందుకే  కన్నుల పండుగగా సాగే సీతారాముల కల్యాణ వేడుకను చూసేందుకు భక్తులు తరలివస్తుంటారు. ఆ రోజుల్లో రాష్ట్రాలలోని దారులన్ని రామనామంతో రామనవమి వైపుకే నడిపిస్తాయంటే అతిశయోక్తి కాదు. ఆ నాడు సాగే కల్యాణతంతు భక్తుల జీవితాల్లో పదిలంగా ఉండిపోతుంది. తొలుత భదాద్రి రామునికి దేవాలయంలో ధృవమూర్తుల కల్యాణం నిర్వహిస్తారు. అనంతరం మంగళవాయిద్యాల నడుమ భక్తుల జయజయ ధ్వానాలు, రామనామ స్వరాల మధ్య ఉత్సవమూర్తులను అత్యంత వైభవంగా పల్లకిలో మిథిలాస్టేడియంలో ప్రత్యేకంగా అలంకరించిన కల్యాణ మండపానికి తోడుకుని వొస్తారు. ముందుగా తిరుకల్యాణానికి సంకల్పం నిర్వహించి సర్వశాంతికై విశ్వక్సేన పూజలు నిర్వహిస్తారు. సృష్టిలయ కారకుడైన విష్ణు సంబంధమైన పూజాకార్యక్రమాలు, శుభకార్యాలను పూజించడం ఆనవాయితీ. అనంతరం వేదపండితులు పుణ్యాహవచనం నిర్వహిస్తారు.

మంత్రబలంతో కల్యాణానికి వినియోగించే సకల సామాగ్రిని సంప్రోక్షణ చేస్తారు. రక్షాబంధనం, మోక్షాబంధనం నిర్వహిస్తారు. ఆనాడు 24 అంగుళాల పొడవు గల 12 దర్బాలతో అల్లిన ఒక దర్భతాడును సీతమ్మవారి నడుముకు మంత్రోచ్చరణాల నడుమ బిగిస్తారు. అనంతరం శ్రీరాముని కుడిచేతికి, సీతమ్మ తల్లి ఎడమ చేతికి రక్షాసూత్రాలను ధరింపజేస్తారు. ఆ తరువాత సువర్ణయజ్ఞోపవితాన్ని ధరింపజేస్తారు. ఈ తంతులో 8 మంది వైష్ణవులకు తాంబులాది సత్కారాలు నిర్వహించి కన్యావరణం చేస్తారు. అటు తరువాత వధూవరుల గోత్రాలను పఠిస్తారు. స్వామివారి పాదపక్ష్రాళన అనంతరం పుష్పోదకస్నానం చేయిస్తారు. మహాసంకల్పం పఠిస్తారు. పఠించే ఈ సంకల్పం భారతీయ భౌగోళిక పరిజ్ఞానానికి అద్దం పడుతూ జాతీయభావాన్ని మనలో పటిష్టపరుస్తుంది. ఆ తరువాత కన్యాదానం జరిపిస్తారు. మంత్రధార పూర్వకంగా కన్యాదానం జరుగుతుంది. మంగళాష్టాకాలు పఠిస్తారు. మంగళవాయిద్యాలు మారుమ్రోగుతుండగా  వేద పండితుల మంత్రోచ్చరణాల మధ్య అభిజిత్‌లగ్నం సమీపిస్తుండగానే శ్రీ సీతారాముల శిరస్సులపై జీలకర్ర బెల్లం ఉంచుతారు. ఈ జీలకర్ర బెల్లం శిరస్సులపై ఉంచితే మనలో సత్యం, సత్‌భావాన్ని పెంచుతాయని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అటు తరువాత జరిగే మాంగళ్యపూజలో మంగళసూత్రంతో ముగ్గురు అమ్మవార్లను అవాహం చేస్తారు.

తొమ్మిది పోగులతో, మూడు సూత్రాలతో తయారయ్యే మంగళసూత్రం ఎన్నో వేదాంత రహస్యాలను చాటిచెబుతోంది. తొమ్మిది పోగులు వివిధ సంబంధాలకు ప్రతీకలు. మూడు సూత్రాలు కర్మ, జ్ఞాన, భక్తి మార్గాలకు దారులు. సూత్రమూలములు గౌరిదేవిని, సూత్రమధ్యలో సరస్వతీని, సూతాగ్రంలో మహాలక్ష్మీని అవాహం చేస్తారు. ఈ ముగ్గురమ్మల అనుగ్రహంతోనే లోకంలోని సౌశిల్యం, సౌందర్యం, సౌకుమార్యం వంటి గుణాలు  వర్థిలుతుంటాయని చెబుతారు. భక్తరామదాసు చేయించిన మంగళసూత్రాల్లో భక్తరామదాసు చేయించిన మంగళపతకాన్ని కలిపి ధరింపచేయడం ఈ భదాద్రి క్షేత్రంలో ఆచారం. అనంతరం శుభదాయకమైన తలంబ్రాల కార్యక్రమం పూర్తి చేస్తారు. తొలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ప్రతీ ఏటా ముత్యాల తలంబ్రాలు స్వామివారి పెళ్లికి సమర్పిస్తారు. బంతులాట తరువాత సీతారాములకు కర్పూర నీరాజనాలు సమర్పించి ఆశీర్వచనం ఇవ్వడంతో ఈ కల్యాణక్రతువు పూర్తవుతుంది.

రామదాసు ఆభరణాలతోనే కల్యాణ తంతు  :
భక్తరామదాసుగా ప్రసిద్ధికెక్కిన కంచర్ల గోపన్న రామాలయం నిర్మించిన కాలంలో సీతారాములకు బంగారు ఆభరణాలు చేయించారు. ఆనాడు సీతమ్మ తల్లికి రామదాసు చేయించిన మంగళసూత్రాన్నే ఇప్పటికి కూడా ధరింప జేస్తారు. అదే విధంగా పచ్చల పతకాన్ని రామదాసు రామయ్య తండ్రికి చేయించారు. భరతాగ్రజుడైన శ్రీరామునికి శ్రీరామనవమి, ఇతర ప్రత్యేక ఉత్సవాల్లో ఈ ఆభరణంతో అలకరిస్తారు.  సీతమ్మకు చేయిస్తీ చింతాకు పతకాము రామచంద్రా…. అంటూ వాగ్గేయ కారుడు రామదాసు కీర్తించిన పతకం ఇదే. ఈ పతకం చక్కగా, ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. పతకంలో ఎర్రని రాళ్ళు పొదిగి అందంగా తయారు చేయించారు. రామదాసును చెరనుంచి విడిపించడానికి రామలక్ష్మణులు ఇద్దరు గోల్గొండ నవాబైన తానీషా వద్దకు రామోజీ, లక్ష్మోజి అనే సిపాయిల రూపంలో వెళ్లి ఆలయం నిర్మించడానికి ఖర్చు చేసిన  6 లక్షల వెండి నాణెలుకు బదులుగా 6 లక్షల బంగారు నాణెలు చెల్లిస్తారు. ఆ నాణెలపై ఒకవైపు శ్రీరామ పట్టాభిషేకం, మరోవైపు ఆంజనేయ స్వామి రూపం ఉంటాయి. ఆ నాణెనికే రామమాడ అని పేరు. బంగారు గొలుసుతో కలిసిన ఈ రామ మాడను శ్రీరామ నవమి, ఇతర ప్రత్యేక ఉత్సవాల్లో లక్ష్మణ స్వామికి అలంకరిస్తారు.

ముత్యాల తలంబ్రాలు ఎంతో పవిత్రం :
ముత్యం అంటేనే అతి పవిత్రమైనది. అందునా….సాక్ష్యాత్తు దేవదేవుని శిరస్సులపై నుంచి జాలువారిని ముత్యాలంటే మరింత పవిత్రమైనవి. అందుకే సీతారాముల పెళ్లిలో వాడిన తలంబ్రాలు, ముత్యాల తలంబ్రాలను సొంతం చేసుకునేందుకు భక్తులు ఎక్కువ మక్కువ చూపుతారు. తానీషా ప్రభువుల కాలం నుంచి సీతారాముల పెళ్లి వేడుకకు ప్రభుత్వం తరఫు నుంచి ముత్యాల తలంబ్రాలు, పట్టుపీతాంబరాలు సమర్పించే ఆనవాయితీ ఉంది. అదే ఆనవాయతీ నేటికి కూడా శుభప్రదంగా కొనసాగడం ఆనందదాయకం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ప్రతీ ఏటా ముఖ్యమంత్రి లేదా ప్రభుత్వ ప్రతినిధులు స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు తీసుకొస్తారు.

Leave a Reply