- డబ్బులు తీసుకొని వ్యాక్సిన్ ఇవ్వడం సరికాదు
- కేంద్రానికి లేక రాశానని వెల్లడించిన మంత్రి హరీష్ రావు
- కోఠి మెటర్నిటీ హాస్పిటల్‌లో ఐసీయూ, లేబర్ రూం ప్రారంభం
హైదరాబాద్,ప్రజాతంత్ర, మే6: దేశ, రాష్ట్ర ప్రజలకు బూస్టర్ డోస్‌ను కేంద్రం ఉచితంగా ఇవ్వాల్సిందేనని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. కోఠి మెటర్నిటీ హాస్పిటల్‌లో కొత్త బ్లాక్‌ను, ఐసీయూను, లేబర్ రూంను ప్రారంభి ంచారు. కోఠి మెటర్నిటీ హాస్పిటల్‌లో నూతన బ్లాక్‌లో ఏర్పాటు చేసిన ఐసీయూ, లేబర్ రూమ్స్, బెడ్స్‌ను వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు మంత్రులు మహముద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి ప్రారంభిం చారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ..డబ్బులు తీసుకొని వ్యాక్సిన్ ఇవ్వడం సరికాదని హరీశ్‌రావు స్పష్టం చేశారు. బూస్టర్ డోస్‌ను ఉచితంగా ఇవ్వాలని కేంద్ర మంత్రికి స్వయంగా తానే లేఖ రాశానని హరీశ్‌రావు గుర్తు చేశారు. 18 నుంచి 59 ఏండ్ల వయసు మధ్య వారందరికీ ప్రభుత్వమే ఉచితంగా బూస్టర్ డోస్ ఇవ్వాలన్నారు. దీనికి అనుమతి ఇవ్వాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు. కానీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ విషయంలో మరోసారి కేంద్రానికి లేఖ రాసి, సంప్రదింపులు జరుపుతామన్నారు. గతంలో ఇచ్చిన మాదిరిగానే ఈ దేశ, రాష్ట్ర ప్రజలకు ఉచితంగా బూస్టర్ ఇవ్వాలని మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఇదిలావుంటే హైదరాబాద్‌లోని బస్తీవాసులకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు శుభవార్త వినిపించారు.
టీ డయాగ్నోస్టిక్స్, బస్తీ దవాఖానాలకు అనుబంధంగా హైదరాబాద్‌లో రేడియోలజీ ల్యాబ్స్ ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ నెల 11వ తేదీన హైదరాబాద్‌లో 10 రేడియోలజీ ల్యాబ్స్ ప్రారంభించబోతున్నామని స్పష్టం చేశారు. రేడియోలజీ ల్యాబ్‌ల్లో అల్టా సౌండ్ పరీక్షలు, 2డీ ఎకో, ఎక్స్ రే, మెమోగ్రఫీ లాంటి పరీక్షలను బస్తీవాసులకు ఉచితంగా నిర్వహిస్తామన్నారు. మొత్తం 12 పెట్టాలని నిర్ణయించాం.. కానీ 10 పూర్తయ్యాయి. మరో 2 ల్యాబ్‌లను పదిహేను రోజుల్లో అందుబాటులోకి తెస్తామన్నారు. టీ డయాగ్నోస్టిక్స్, బస్తీ దవాఖానాల ద్వారా నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నామని తెలిపారు. ఈ రెండు కార్యక్రమాలను ఇతర రాష్టాల్రు ఆదర్శంగా తీసుకుని అమలు చేస్తున్నాయని హరీశ్‌రావు గుర్తు చేశారు. ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్‌లో రూ. 2 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్‌ను ఇవాళ ప్రారంభించుకున్నామని తెలిపారు. కోఠిలోని ఈఎన్టీ హాస్పిటల్‌లో అవసరాలకు అనుగుణంగా రూ. 35 కోట్లతో అధునాతన భవనం కట్టేందుకు శంకుస్థాపన చేశామని చెప్పారు. ఈ భవనంలో 110 పడకలు, 8 ఆపరేషన్ థియేటర్లు, అధునాతన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఈఎన్టీ హాస్పిటల్‌లో రూ. 2 కోట్ల 20 లక్షలతో సిటీ స్కాన్‌ను కూడా ప్రారంభించామని హరీశ్‌రావు తెలిపారు. హైదరాబాద్‌లోని 18 ప్రభుత్వ హాస్పిటల్‌ల్లో మూడు పూటలా నాణ్యమైన ఉచిత భోజనం పెట్టేందుకు చర్యలు చేపట్టామని హరీశ్‌రావు తెలిపారు. ఈ నెల 12వ తేదీన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నామని స్పష్టం చేశారు. పేషెంట్స్ కు హాస్పిటల్ లోపలా భోజనం పెడుతారు. వారి అటెండెన్స్‌కు హాస్పిటల్ వెలుపల భోజన సౌకర్యం కల్పిస్తామన్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.
రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల నుంచి రోగులను, వారి సహాయలను దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. పేషెంట్స్‌తో పాటు వారి అటెండెన్స్‌కు షెల్టర్ హోమ్స్ కడుతున్నామని చెప్పారు. వెటర్నీరికి సంబంధించి.. నిలోఫర్‌లో 8 యూనిట్స్, పేట్ల బురుజులో 8 యూనిట్స్ ఉన్నాయి. కోఠిలో కేవలం 2 యూనిట్స్ ఉన్నాయని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. పేట్లబురుజు, నిలోఫర్ నుంచి మరికొన్ని యూనిట్లను కోఠి హాస్పిటల్‌కు తరలిస్తామన్నారు. శానిటేషన్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ఒక్కో బెడ్‌కు శానిటేషన్ కోసం ప్రతి నెలకు రూ. 5 వేల నుంచి రూ. 7500లకు పెంచామన్నారు. శానిటేషన్ కోసం ప్రతి సంవత్సరం రూ. 150 కోట్ల నుంచి 200 కోట్లు ఖర్చు పెడుతున్నామని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతామని చెప్పారు. డైట్ కాంట్రాక్ట్ కూడా డబుల్ చేశామన్నారు. వీటికి సంబంధించిన టెండర్ల పక్రియ కొనసాగుతోందన్నారు. రాబోయే 20 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవు తుందని హరీశ్‌రావు స్పష్టం చేశారు. హైదరాబాద్‌కు నలువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. జంట నగరాల ప్రజలతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజలకు ఈ హాస్పిటల్స్ ఎంతో ఉపయోగపడుతాయన్నారు. అతి త్వరలోనే హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. కొరోనా సమయంలో తాత్కాలిక ప్రతిపాదికన పని చేసిన సిబ్బందికి ఈ భర్తీలో వెయిటేజీ ఇవ్వాలని నిర్ణయించామని హరీశ్‌రావు గుర్తు చేశారు.
ఏం తల్లి ఎలా ఉన్నావ్…
దవాఖానాకు ఎప్పుడు వచ్చావు..
వైద్య సేవలు ఎలా ఉన్నాయి..
దవాఖానాకు ఎప్పుడు వచ్చావు..
వైద్య సేవలు ఎలా ఉన్నాయి..
అంటూ కోఠి ఈఎన్టీ లో పేషెంట్లకు వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ఆప్యాయంగా పలకరింస్తూ హాస్పిటల్ లోని వార్డులు తిరుగుతూ వసతులు, అందుతున్న చికిత్సను మంత్రి హరీష్ రావు స్వయంగా అడిగి తెలుసుకున్నారు.. కోఠి ఈఎన్టి హాస్పిటల్ లో ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ కాంప్లెక్స్ కి మంత్రి హరీష్ రావు శంఖుస్టాపన చేసారు .