- ఈసారి ఎన్నికల్లో మేం తిరుగులేని మెజార్టీ సాధిస్తాం..
- కాంగ్రస్ అగ్రనేత రాహుల్ గాంధీ..
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17 : రాబోయే ఎన్నికల్లో ఎన్‌డిఎ నేతృత్వంలోని బిజెపి 150 సీట్ల మార్కును దాటబోదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ , సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తేల్చి చెప్పారు. లోక్‌సభ ఎన్నికల తొలి విడత ప్రచారం బుధవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో బుధవారం ఉత్తర్ ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో వారు విలేఖరుల సమావేశాలో మాట్లాడారు.
15-20 రోజుల క్రితం బీజేపీ దాదాపు 180 సీట్లు గెలుస్తుందని అనుకున్నానని, ఇప్పుడు కేవలం 150 సీట్లు వస్తాయని భావిస్తున్నానని, ప్రతి రాష్ట్రం నుంచి మేం మెరుగుపడుతున్నామని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో మాకు చాలా బలమైన కూటమి ఉంది. ఈ సారి ఎన్నికల్లో మేము తిరుగులేని మెజార్టీ సాధిస్తామని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో అమేథీ లేదా రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తారా అని అడిగిన ప్రశ్నకు కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ, “ఇది బీజేపీ ప్రశ్న, చాలా బాగుంది. పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని నేను శిరసావహిస్తాను. మా పార్టీలో అభ్యర్థుల ఎంపికలపై సీఈసీ నిర్ణయిస్తుందని తెలిపారు.
ఇదే సమావేశంలో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ, “రామ నవమి సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, సమాజ్ వాదీ పార్టీ కలిసి విలేకరుల సమావేశం నిర్వహించడం సంతోషంగా ఉంది. .ఈసారి భారత కూటమి ఘజియాబాద్ నుండి ఘాజీపూర్ వరకు బిజెపిని క్లీన్ స్వీప్ చేస్తుంది. ఈ రోజు బిజెపి వాగ్దానాలన్నీ బూటకమని తేలింది అని అన్నారు. అవినీతిపరులను బీజేపీలోకి తీసుకోవడమే కాకుండా అవినీతిపరులు సంపాదించిన సొమ్మును కూడా వారి వద్దే ఉంచుకుంటోందని అఖిలేష్ యాదవ్ విమర్శించారు.