Take a fresh look at your lifestyle.

బిజెపిలో చేరుమని ఒత్తిడి తెచ్చిన మాట వాస్తవమే

బిజెపిలో చేరుమని ఒత్తిడి తెచ్చిన మాట వాస్తవమే
నా బతుకంతా తెలంగాణ..టిఆర్‌ఎస్‌ ‌మాత్రమే
నిజామాబాద్‌ ‌చౌరస్తాలో చెప్పుతో కొడతా బిడ్డా
నోరు అదుపులో పెట్టుకోకుంటే కొట్టి చంపుతాం
రాజస్థాన్‌ ‌నుంచి ఫేక్‌ ‌సర్టిఫికెట్‌ ‌తెచ్చారు…దీనిపై ఇసికి ఫిర్యాదు చేస్తాం
అర్వింద్‌ ‌వ్యాఖ్యలపై భగ్గుమన్న ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర: ‌నిజామాబాద్‌ ‌చౌరస్తాలో చెప్పుతో కొడతా బిడ్డా అని బిజెపి ఎంపి ధర్మపురి అర్వింద్‌ను ఉద్దేశించి టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఘాటుగా హెచ్చరించారు. అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో ఎక్కడ నిలబిడ్డా వెంటపడి ఓడిస్తామని కూడా హెచ్చరించారు. మంచీ, మర్యాద, మనన్న లేకుండా మాట్లాడుతున్న ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ‌తన పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తనపై అర్వింద్‌ ‌చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున మండిపడ్డారు. కుక్కకాటుకు చెప్పుదెబ్బ అన్న చందంగా బుద్ధి చెబుతామని అన్నారు. నిజామాబాద్‌కే అవమానకరంగా ఎంపీ అర్వింద్‌ ‌ప్రవర్తన ఉందన్నారు. కాంగ్రెస్‌ ‌మద్దతుతో యాక్సిడెంటల్‌గా అర్వింద్‌ ‌గెలిచారని అన్నారు. అసెంబ్లీలోని శాసనసభా పక్ష కార్యాలయంలో మీడియాతో కవిత మాట్లాడారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్థన్‌, ‌జీవన్‌ ‌రెడ్డి, మాగంటి గోపీనాథ్‌ ‌కూడా పాల్గొన్నారు. తాను బాధతో మాట్లాడుతున్నానని, అందుకు తెలంగాణ ప్రజలు క్షమించాలని, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు నీతి, నిజాయితీ, ఒక పద్ధతి ఉంటుందని, సీఎం కేసీఆర్‌ని అనరాని మాటలు అంటున్నారని ఆమె మండిపడ్డారు. ‘నేను కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు ఖర్గేతో మాట్లాడినట్టు అరవింద్‌ ‌చెబుతున్నారు. కాంగ్రెస్‌తో కలిసి గెలిచింది నువ్వు. ఇంత వరకూ నేను ఏ ఒక్కరినీ వ్యక్తిగతంగా విమర్శించలేదు. నా గురించి వ్యక్తిగతంగా మాట్లాడితే ఊరుకోను. నా పుట్టుక, నా భవిష్యత్తు తెలంగాణ, టీఆర్‌ఎస్‌. ‌బిడ్డా చెప్తున్నా.. గుర్తుపెట్టుకో. వొచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తావో చెయ్‌ ‌వెంటపడి ఓడిస్తాం’ అని అన్నారు. పార్లమెంట్‌లో ఎంపీ అరవింద్‌ ‌పెర్ఫార్మెన్స్ ‌జీరో అని కవిత అన్నారు.

తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ఏనాడు ప్రశ్నించలేదని చెప్పారు. పసుపు బోర్డు తెస్తానని బాండ్‌ ‌పేపర్‌ ‌రాసిచ్చి రైతులను మోసం చేశాడని మండిపడ్డారు. ఎంపీ అరవింద్‌ ‌ఫేక్‌ ‌సర్టిఫికెట్లపై ఎలక్షన్‌ ‌కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. మరోవైపు ఎమ్మెల్సీ కవితపై ఎంపీ అరవింద్‌ ‌చేసిన వ్యాఖ్యలకు నిరసనగా.. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే కాలనీలో గల అరవింద్‌ ఇం‌టిని జాగృతి, టీఆర్‌ఎస్‌, ‌టీఆర్‌ఎస్వీ కార్యకర్తలు ముట్టడించారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ..పనితీరు, ప్రవర్తన ఈ రెండూ అర్వింద్‌కు లేవన్నారు. మూడున్నరేళ్లలో కేవలం 60 ప్రశ్నలు మాత్రమే అడిగారన్నారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత భావోద్వేగానికి లోనయ్యారు. గద్గద స్వరంతో మాట్లాడారు. బాండ్‌ ‌పేపర్‌ ‌రాసిచ్చి మోసం చేశాడని రైతులు ఆరోపిస్తున్నారన్నారు. బాండ్‌పేపర్‌ ‌రాసిచ్చిన అర్వింద్‌పై.. ఫిర్యాదు చేస్తామని రైతులు అంటున్నారన్నారు. ఇంకా కవిత మాట్లాడుతూ.. ‘ఇంకోసారి పిచ్చిపిచ్చిగా మాట్లాడితే.. నిజామాబాద్‌ ‌చౌరస్తాలో చెప్పుతో కొడతా. నోటికొచ్చినట్లు మాట్లాడితే మెత్తగా తంతాం. నోరు అదుపులో పెట్టుకోకుంటే అర్వింద్‌ను తరిమికొడతాం. కొట్టి చంపుతం బిడ్డ.. రాజకీయం చెయ్‌.. ఇష్టం వొచ్చినట్లు మాట్లాడవద్దు. అర్వింద్‌ ఎక్కడ పోటీ చేసినా..వెంటబడి ఓడిస్తా. పసుపుబోర్డ్ ‌తేలేని అర్వింద్‌… ‌రైతుల కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పాలి.

బాధతో మాట్లాడుతున్నాను.. ప్రజలు తప్పుగా భావిస్తే క్షమించాలి‘ అని పేర్కొన్నారు. బీజేపీలో చేరాలంటూ తనకు చాలా ప్రపోజల్స్ ‌వొచ్చాయని.. అయితే తాను రానని స్పష్టం చేశానని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు. బీజేపీ, దాని అనుబంధ సంఘాలు, సైద్ధాంతిక సంస్థల నుంచి తనకు ఈమేరకు ఆహ్వానాలు అందాయన్నారు. తెలంగాణలోనూ షిండే మోడల్‌లో తిరుగుబాటు చేయాలని తనకు చెప్పారని వివరించారు. వాటన్నింటిని తాను నిర్ద్వంద్వంగా తిరస్కరించానని కవిత స్పష్టం చేశారు. నేను కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నానని కాంగ్రెస్‌ ‌సెక్రటరీ చెప్పాడంట..మరి అరవింద్‌ ఎం‌దుకు కాంగ్రెస్‌కు టచ్‌లో ఉన్నట్టని కవిత ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ‌చీఫ్‌ ‌మల్లికార్జున ఖర్గేతో అందరికీ ఫ్రెండ్‌ ‌షిప్‌ ఉం‌టది..అందరూ మాట్లాడుతరు అని వ్యాఖ్యానించారు. బీజేపీ ఎంపీ అర్వింద్‌ ‌లైన్‌ ‌దాటి మాట్లాడితే ఊరుకోమని ఆమె హెచ్చరించారు. కాంగ్రెస్‌ ‌మద్దతు అనుకోకుండా అర్వింద్‌ ఎం‌పీ అయ్యారని చెప్పారు. అర్వింద్‌ ‌మాట్లాడే భాష వల్ల నిజామాబాద్‌ ‌పరువు పోతుందన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ ఎంపీలు యావరేజ్‌ ‌గా 20 డిబేట్లలో పాల్గొంటే.. ఎంపీ అర్వింద్‌ ‌కేవలం 5 చర్చల్లోనే పాల్గొన్నారని తెలిపారు. పార్లమెంట్‌లో రాష్ట్రానికి చెందిన ఏ ఒక్క అంశంపై అర్వింద్‌ ‌గొంతెత్తి మాట్లాడలేదని మండిపడ్డారు. ఇంకోసారి తాను అర్వింద్‌పై ప్రెస్‌ ‌మీట్‌ ‌పెట్టనని కవిత తేల్చి చెప్పారు.

Leave a Reply