బిఆర్‌ఎస్‌కు కామ్రేడ్‌లు దూరమవుతున్నారా ?

అధికార బిఆర్‌ఎస్‌ ‌పార్టీకి కామ్రేడ్‌లకు మధ్య పొత్తు పొసగటంలేదా అన్న అనుమానాలకు తావేర్పడుతోంది. రాష్ట్రంలో రానున్న శాసనసభ ఎన్నికల్లో తాము బిఆర్‌ఎస్‌తోనే కలిసి పోటీచేస్తామని సిపీఐ, సిపీఎం పార్టీలు సంయుక్తంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఒక పక్క బిఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్నప్పటికీ అ రెండు పార్టీలుకూడా ఒకదానితో ఒకటి కలిసి ఎన్నికలకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాయి. ఈ రెండు పార్టీలకు రాష్ట్రంలో ఎక్కడ బలం ఉంటే అక్కడ ఆ పార్టీ రంగంలో ఉంటుంది.రెండవ పార్టీ రంగంలో ఉన్న పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు పలుకాలన్న అంగీకారానికి వొచ్చాయి. ఇకపోతే వొచ్చిన చిక్కల్లా ఆ రెండు పార్టీలు కోరుకునే స్థానాలను బిఆర్‌ఎస్‌ ‌కేటాయించాల్సి ఉంటుంది. అయిదూళ్ళయినా చాలు అన్నట్లు.. తమకు బలం  ఉన్న నియోజకవర్గాలను ఇప్పటికే ఆ పార్టీలు ప్రకటిస్తూ వొస్తున్నాయి. అయితే బిఆర్‌ఎస్‌ అధినేత అధికారికంగా ఆయా నియోజకవర్గాలను ప్రకటించడమే తరువాయి. అక్కడే చిక్కుముడి ఉంది.

ఈ రెండు పార్టీలు కూడా మతోన్మాద పార్టీగా చెబుతున్న బిజెపిని ఎట్టి పరిస్థితిలో ఓడించాలని కంకణం కట్టుకున్నాయి. తాజాగా పాట్నా, దిల్లీలో  బిజెపి వ్యతిరేక కూటమి సమావేశాలకు వామపక్ష పార్టీలు హాజరైన విషయం తెలియందికాదు. కేంద్రంలోని బిజెపి పార్టీ చాలా ప్రమాదమైన పార్టీ అని, దానినుండి దేశాన్ని రక్షించేందుకు ఏ సెక్యులర్‌ ‌పార్టీతోనైనా కలువడానికి తాము సిద్ధమేనంటున్నారు కామ్రేడ్‌లు. బిజెపిని ఓడించి అధికారంలోకి వొచ్చే ఏ పార్టీతోనైనా తాము కలిసి పనిచేస్తామని చెబుతున్న ఈ పార్టీలు, స్వార్థపూరిత అధికారాన్ని మాత్రం తాము కోరుకోవడంలేదని స్పష్టంచేస్తున్నాయి. అయితే పాట్నా, దిల్లీలో జరిగిన సమావేశానికి బిఆర్‌ఎస్‌ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును మాత్రం ఆహ్వానించని విషయం బహిరంగ రహస్యమే. బిజెపితోపాటు కాంగ్రెస్‌ను కూడా వ్యతిరేకిస్తున్న పార్టీ బిఆర్‌ఎస్‌. అలాంటి బిఆర్‌ఎస్‌తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడానికి మాత్రం కామ్రేడ్‌లు వెనుకాడటంలేదు. బిజెపికి వ్యతిరేకంగా ఏర్పడిన ఇండియా పార్టీలో భాగస్వామ్యం కావడం ద్వారా జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో స్నేహపూర్వకంగా పనిచేయనున్న కామ్రేడ్స్, ‌రాష్ట్రానికి• వొచ్చేసరికి కాంగ్రెస్‌ను దూరం పెట్టడమేంటన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి పరిస్థితిలో బిఆర్‌ఎస్‌ ఎలా ప్రవర్తిస్తుందన్నది ప్రశ్న. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ ‌కూటమిలో ఉండే ఈ రెండు పార్టీలు ఆఖరి  వరకు తమతోనే ఉంటాయన్న నమ్మకమేంటన్న అనుమానం బిఆర్‌ఎస్‌ అధినేతకు కలుగకపోదు.

రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తమ పార్టీ అభ్యర్ధుల మొదటి జాబితాను అన్ని పార్టీలకన్నా ముందుగానే ప్రకటిస్తామని బిఆర్‌ఎస్‌ అధినేత ఇటీవల చేసిన ప్రకటన నేపథ్యంలో కామ్రేడ్స్ ‌కోరుకుంటున్న నియోజకవర్గాలు ఉంటాయా, ఉండవా అన్న మీమాంస ఇప్పుడు కామ్రేడ్స్‌లో ఉంది. సీట్ల కేటాయింపు విషయంలో తాము ఎవరినీ దేబురించమని చెబుతున్నవీరు తమ ఇష్టానికి వ్యతిరేకంగా కేటాయింపు జరిగితే మాత్రం ఒంటరిగానైనా పోటీలో నిలబడేందుకు సిద్ధ్దమంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా బిఆర్‌ఎస్‌పైన కామ్రేడ్స్ ‌విరుచుకు పడుతున్నతీరు భవిష్యత్‌ ‌పొత్తుల విషయంలో ఎటు దారితీస్తుందోనన్న అనుమానానికి తావేర్పడుతోంది. గత ఆదివారం కమ్యూనిస్టు పార్టీలపైన మంత్రి హరీష్‌రావు చేసిన కామెంట్‌తో వారు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కమ్యూనిస్టులను అవకాశవాదులుగా ఆయన పేర్కొనడాన్ని ఆ పార్టీలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. అధికార పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మునుగోడు ఉప ఎన్నికలో తాము సహకరించినందుగా తామకీ కితాబంటున్నారు. మునుగోడు నియోజకవర్గంలో కమ్యూనిస్టులను అభిమానించే వోటర్లున్నారు.

ఆ స్థానం గెలిచే విషయంలో బిఆర్‌ఎస్‌ ‌వామపక్షపార్టీలతో పొత్తు పెట్టుకోవడంతో సులభంగా నెగ్గింది. దాన్ని మరిచిపోయి ఎవరి కృషిలేకుండానే నెగ్గినట్లు హరీష్‌రావు మాట్లాడుతున్నారని వారు తీవ్రంగా విమర్శిస్తున్నారు. కమ్యూనిస్టు పార్టీలకు మనుష్యులు లేరు, కార్యకర్తలు లేరని వ్యాఖ్యానించిన హరీష్‌రావు ఒకసారి తన గుండెపైన చెయ్యివేసుకుని కమ్యూనిస్టుల సహకారం లేకుండానే గెలిచామని చెప్పగలరా అని వారు ప్రశ్నిస్తున్నారు. మునుగోడు ఫలితాలు వెలువడగానే కమ్యూనిస్టుల సహకారంతోనే గెలిచామని చేసిన ప్రకటన అప్పుడు మరిచిపోయినట్లుందని వారు గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలో, దేశంలో ప్రతీ కార్మికుడికి అండ దండ ఎర్రజెండానేనని, ఇల్లులేని పేదవాడి దగ్గరనుండి భూమిలేని నిరుపేదలవరకు, విద్యార్థులు, యువజనులు, మహిళలు, రైతులు, దళితులు, గిరిజనులు, మైనార్టీలవరకు దుర్భర  జీవితం గడిపే ప్రతీ మనిషీ వెనుక ఉండి నడిపించేది కమ్యూనిస్టు పార్టీలేనన్న విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. అలాగే అంగన్వాడి, ఆశ వర్కర్లతో పాటు అన్ని వర్గాల కార్మిక సంఘాల అవసరాలపై స్పందించేది కమ్యూనిస్టుపార్టీలే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలంటున్నారు. రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌ ‌పార్టీ అవిర్భావానికి ముందునుండే తాము ఈ వర్గాల కోసం పోరాటం చేస్తున్న చరిత్ర ఉందంటున్నాయి ఆ పార్టీలు. కామ్రేడ్స్, అధికార పార్టీలమధ్య జరుగుతున్న ఈ మాటల యుద్ధం తాత్కాలికమేనా లేక విభే•దించడానికి కదుపుతున్న పావులా అన్నది తేలాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *