బానిసత్వమే కానరాని భారత నిర్మాణం సాధ్యపడదా..!

25 మార్చి ‘అంతర్జాతీయ బానిస వ్యాపార బాధితుల జ్ఞాపకార్థ దినం’ సందర్భంగా..

ప్రపంచ మానవాళి చరిత్రలో 16వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు ఆఫ్రికా నుంచి కేంద్ర, దక్షిణ అమెరికాకు బలవంతంగా మిలియన్ల అమాయక ఆఫ్రికన్‌ ‌ప్రజలను బానిసలుగా మార్చి రవాణా చేయడం జరిగింది. ఈ దుర్ఘటన ‘ట్రాన్స్అట్లాంటిక్‌ ‌బానిసత్వ వ్యాపారం’గా చరిత్ర పుటల్లో నిలిచింది. ఈ మానవ హక్కుల అమానవీయ ఉల్లంఘనలో లక్షల ఆఫ్రికన్లు ప్రాణాలను సైతం కోల్పోయారు. ఈ విషాద ఘటన ప్రభావం నేటికీ ఆఫ్రికన్‌ ఆర్థిక వ్యవస్థ మీద దుష్ప్రభాన్ని చూపిస్తూనే ఉన్నది. యూయస్‌లో 01 ఫిబ్రవరి 1865 రోజుననే బానిసత్వాన్ని నిషేధించడం జరిగినా, బానిసత్వం, జాతి వివక్షలు అనంతరం కూడా తీవ్రంగా కొనసాగడం విచారకరం. 2007లో ఐరాస తీసుకున్న తీర్మానం ప్రకారం 2008 నుంచి ప్రతి ఏటా 25 మార్చిన ‘అంతర్జాతీయ ట్రాన్స్అట్లాంటిక్‌ ‌బానిస వ్యాపార బాధితుల జ్ఞాపకార్థ దినం (ఇంటర్నేషనల్‌ ‌డే ఆఫ్‌ ‌రిమెబరెన్స్ ఆఫ్‌ ‌ది విక్టిమ్స్ ఆఫ్‌ ‌ది స్లేవరీ అండ్‌ ‌ట్రాన్స్అట్లాంటిక్‌ ‌ట్రేడ్‌)’ ‌పాటించడం ఆనవాయితీగా వస్తున్నది.

బానిసత్వం సర్వవ్యాప్తం, నేరసమానం:
బానిసత్వం నేరమని, మానవ హక్కుల ఉల్లంఘనలు, జాతి వర్ణ వర్గ వివక్షలు అమానవీయమని, మనిషిని మనిషిగా చూడడం కనీస బాధ్యత అని అవగాహన కల్పించే కార్యక్రమాలను ఈ రోజున చర్చించడం జరుగుతుంది. అగ్రదేశాల్లో సెలున్లు, రెస్టారెంట్లు, సంగీత వేడుకలు, వ్యవసాయ క్షేత్రాలు లాంటి రంగాల్లో బానిసత్వ బాధితులు ఉన్నారు. ప్రపంచ దేశాలన్నింటిలో బానిసత్వ దురాచారం అమలులో ఉన్నది. ప్రపంచంలోనే అత్యధికంగా 39 శాతం ఆధునిక బానిసలు ఇండియాలో ఉండడం విచారకరం. ప్రపంచ దేశాల్లో ఉత్తర కొరియా, ఎరిట్రియా, బురుండీ, అఫ్ఘానిస్థాన్‌, ‌పాకిస్థాన్‌, ‌సూడాన్‌, ‌కాంబోడియా, ఇరాన్‌ ‌లాంటి దేశాల్లో బానిసత్వ ఆచారం అత్యధికంగా కనిపిస్తున్నట్లు గ్లోబల్‌ ‌స్లేవరీ ఇండెక్స్-2022 ‌వివరిస్తున్నది.

భారతంలో ఆధునిక బానిసత్వం:
ఇండియాలో బానిసత్వం లేదా దాస్య దురాచారం అనాదిగా అమలు అవుతూనే ఉన్నది. ముస్లిమ్‌ ‌పాలన ఆదిపత్య కాలంలో బానిసత్వం పెరగడం, 19వ శతాబ్దం వరకు పెద్ద ఎత్తున కొనసాగడం జరిగింది. 1843లో భారత బానిసత్వ చట్టం-1843 (ఇండియన్‌ ‌స్లేవరీ ఆక్ట్-1843) అమలులోకి వచ్చింది. 2018 నివేదిక ప్రకారం నేటికీ ప్రపంచవ్యాప్తంగా 46 మిలియన్లకు పైగా ప్రజలు, అందులో 18.3 మిలియన్ల భారతీయులు ఆధునిక బానిసత్వంలో మగ్గుతున్నారు. భారత్‌లో ఆధునిక బానిసత్వంగా వెట్టిచాకిరి, మానవ అక్రమ రవాణ, బలవంతపు బిక్షాటన, బాల్యవివాహాలు, బలవంతపు వ్యభిచారాలు, బాల కార్మిక వ్యవస్థలు నేడు కూడా కనిపించడం విచారకరం. భారత్‌లో ప్రతి వెయ్యి మందిలో ఆరుగురు బానిసత్వ చీకట్లలో మగ్గుతున్నారని అంచనా. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం దేశ జనాభాలో 1.4 శాతం అభాగ్య జీవులు బానిసత్వ ఉచ్చులో మగ్గుతున్నారని తెలుస్తున్నది. భారత్‌లో 2016 గణాంకాల ప్రకారం 15,379 మానవ అక్రమ రవాణ కేసులు నమోదుకాగా అందులో 9,034 బాధితులు 18 ఏండ్ల లోపు వారు ఉండడం జరిగింది. ప్రపంచ బానిసత్వ సూచిక-2023 (గ్లోబల్‌ ‌స్లేవరీ ఇండెక్స్) అం‌చనాల ప్రకారం 167 దేశాల్లో భారత్‌ 53‌వ స్థానంలో నిలవడం గమనించవచ్చు.

బానిసత్వ ఆచారానికి కారణాలు:
పెరుగుతున్న దేశ జనాభాకు అనుగుణంగా పని కల్పించక పోవడం, మహిళలు/పిల్లల్ని వివిధ రూపాల్లో బానిస ఉచ్చులో బిగించడం, బానిసత్వ నివారణ చట్టాలు కాగితాలతో పరిమితం కావడం, పని కోసం వలసల దారి పట్టడం, రానున్న 35 ఏండ్లలో దేశవ్యాప్తంగా శ్రామిక వర్గం తగ్గడం లాంటి కారణాలు బానిసత్వ బతుకులకు శరాఘాతంగా నిలుస్తున్నాయి. ఇటుక బట్టీలు, చిన్న పరిశ్రమలు, వ్యవసాయ రంగాలు, అసంఘటిత రంగాలు, బాల్య వివాహాలు, బాల కార్మికులు, వెట్టిచాకిరి, బలవంతపు యాచకత్వం, మానవ అక్రమ రవాణా, గృహ పనులు లాంటి రంగాల్లో ఆధునిక బాల్య బానిసత్వ దురాచారం కనిపిస్తున్నది.
ఆధునిక బానిసత్వానికి అడ్డుకట్ట వేసేందుకు చట్టాల కఠిన అమలుతో పాటు ప్రతి ఒక్క పౌరుడు తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలని కోరుకుందాం. బానిసత్వ రహిత భారత కలలను సాకారం చేసుకుందాం.

image.png

  -డా. బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
కరీంనగర్‌, 9949700037

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *