మంగ్లీ ఎఫ్‌ఐఆర్ కాపీలో కీలక విషయాలను ప్రస్తావించిన పోలీసులు
హైదరాబాద్, జూన్ 11: అనుమతి లేకుండా బర్త్‌డే పార్టీ నిర్వహించిన కారణంగా ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగ్లీ ఎఫ్‌ఐఆర్ కాపీలో పోలీసులు పలు కీలక విషయాలను ప్రస్తావించారు. ఈనెల 10వ తేదీ అర్థరాత్రి ఒంటి గంట సమయంలో చేవెళ్ల మండలం ఈర్లపల్లి శివారులోని త్రిపుర రిసార్ట్‌పై తమకు ఫిర్యాదు వచ్చిందని పోలీసులు వెల్లడచారు. రిసార్ట్‌లో పెద్ద ఎత్తున డీజే పెట్టారంటూ కంట్రోల్ రూమ్‌కి స్థానికులు ఫిర్యాదు చేయడంతో రిసార్ట్‌కు మహిళా ఎస్సై వెళ్లారని చెప్పారు. అక్కడ పదిమంది మహిళలతోపాటు 12మంది పురుషులు కలిసి డీజే పెట్టి మద్యం మత్తులో డాన్సులు చేస్తున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. మంగ్లీ బర్త్ డే పార్టీ జరుగుతోన్నట్లు అక్కడే ఉన్న మేనేజర్ తెలిపారని, అయితే ఆమె పార్టీకి ఎలాంటి అనుమతి తీసుకోలేదని చెప్పారన్నారు. ఈ పార్టీలో పెద్ద ఎత్తున విదేశీ మద్యం ఉన్నట్లు, ఎక్సైజ్ అధికారుల నుంచి లిక్కర్ పర్మిషన్ తీసుకున్నట్లు లేదని కూడా గుర్తించామన్నారు. ఆ క్రమంలో మంగ్లీని విచారించగా బర్త్‌డే పార్టీకి, లిక్కర్ వినియోగానికి, డీజేకి అనుమతి లేదని స్పష్టం చేశారని పోలీసులు వివరించారు. ఈ కార్యక్రమాన్ని ఈవెంట్ మేనేజర్ మేఘరాజు చేస్తున్నట్లు గుర్తిం చామన్నారు.