- ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుంది
- నవజాత శిశువుల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ అవసరం
- నీలోఫర్, గాంధీ వైద్యులతో మంత్రి హరీష్ రావు వీడియో కాన్ఫరెన్స్
ప్రజాతంత్ర , హైదరాబాద్ : నాణ్యమైన, అధునాతన వైద్య సేవలను పేదలకు అందించేందుకు సీఎం కేసీఆర్ ఈ ఏడాది బడ్జెట్‌లో వైద్యారోగ్య శాఖకు రూ.11,237 కోట్ల నిధులు కేటాయించారనీ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీష్ రావు అన్నారు. సోమవారం గాంధీ, నీలోఫర్ హాస్పిటల్స్ సూపరింటెండెంట్లు , అన్ని విభాగాధిపతులతో మంత్రి హరీష్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి విభాగాల వారీగా పనితీరును సమీక్షించారు. గత సమీక్షలో తీసుకున్న నిర్ణయాల అమలు, పురోగతిపైనా ఆరా తీశారు. ఈ ఏడాని కేటాయించిన బడ్జెట్‌లో దవాఖానాల నిర్వహణకురూ.1100 కోట్లు, మందుల కోసం రూ.500 కోట్లు, వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం రూ.300 కోట్లు, వైద్య పరికరాల కోసం రూ.500 కోట్లు, సర్జికల్ కోసం రూ.200 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు.
ప్రభుత్వ హాస్పిటల్స్‌లో పారిశుధ్య నిర్వహణకు చెల్లింపులకు బెడ్‌కు రూ.5016 నుంచి రూ.7500కు పెంచడం జరిగిందన్నారు. అలాగే, మెడికల్, నర్సింగ్, పారా మెడికల్ సహా అన్ని విభాగాలలో సిబ్బందిని వంద శాతం నియమించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. అందరం కలసి కట్టుగా పనిచేసి తెలంగాణ వైద్యారోగ్య శాఖను దేశానికి ఆదర్శంగా నిలపాలని మంత్రి హరీష్ రావు ఈసందర్భంగా సూచించారు. నీలోఫర్ హాస్పిటల్‌లో ప్రజల నుంచి ఫిర్యాదులు, సలహాలు, సూచలను తీసుకునేందుకు వీలుగా ఫిర్యాదు బాక్స్‌లు ఏర్పాటు చేయాలనీ, త్వరితగతిన సమస్యలు పరిష్కరించేందుకు వీలుగా చర్యలు చేపట్టాలన్నారు. బాగా పనిచేసే వైద్యులకు ఈనెల 7న వరల్డ్ హెల్త్ డే సందర్భంగా నగదు పురస్కారం, సన్మానం చేయనున్నట్లు ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు వెల్లడించారు.