బండి సంజయ్‌పై కెటిఆర్‌ ‌పరువునష్టం దావా

ఇంటర్‌ ‌విద్చార్థుల ఆత్మహత్యల అంశంలో తన ప్రతిష్టకు భంగం కలిగించారంటూ ఆరోపణ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 13 : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై టీఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మంత్రి కేటీఆర్‌ ‌పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు తన న్యాయవాది చేత సంజయ్‌కు కేటీఆర్‌ ‌నోటీసులు పంపించారు. ఈ నెల 11న ట్విట్టర్‌లో తనపై బండి సంజయ్‌ ‌నిరాధారమైన ఆరోపణలు చేశారని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. ఆరోపణలపై ఆధారాలు ఉంటే బయట పెట్టాలని, లేదంటే బహిరంగ క్షమాపణ చెప్పాలని కేటీఆర్‌ ‌ట్విట్టర్‌ ‌వేదికగా డిమాండ్‌ ‌చేశారు. లేని పక్షంలో పరువు నష్టం దావా వేస్తానని కేటీఆర్‌ ‌హెచ్చరించారు. మంత్రి కేటీఆర్‌ ‌పాపులారిటీని దృష్టిలో ఉంచుకొని, ఆయనపై నిరాధారమైన ఆరోపణలు చేసి ప్రచారం పొందాలనే దురుద్దేశంతోనే బండి సంజయ్‌ అబద్దాలు చెప్పారని నోటీసుల్లో న్యాయవాది పేర్కొన్నారు.

ఒక జాతీయ స్థాయి పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్‌ ‌ప్రజా జీవితంలో కనీస ప్రమాణాలు పాటించకుండా కేవలం ప్రచారం పొందాలన్న యావతో ఇంటర్‌ ‌విద్యార్థుల ఆత్మహత్యల అంశాన్ని కేటీఆర్‌కు ఆపాదించే దురుద్దేశ పూర్వకమైన ప్రయత్నం చేశారని న్యాయవాది పేర్కొన్నారు. కేటీఆర్‌ ‌పరువుకు భంగం కలిగించేలా, అసత్యపూరిత వ్యాఖ్యలు చేసిన సంజయ్‌.. ‌సివిల్‌, ‌క్రిమినల్‌ ‌చట్టాల ప్రకారం కేటీఆర్‌కు పరిహారం చెల్లించాలని పేర్కొన్నారు. వీటితో పాటు చట్ట ప్రకారం తగిన చర్యలకు అర్హులవుతారని నోటీసుల్లో న్యాయవాది తెలిపారు. 48 గంటల్లో తన క్లైంట్‌ ‌కేటీఆర్‌కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని న్యాయవాది డిమాండ్‌ ‌చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page