ప్రశ్నించడమే పాపమా?

ఉత్తరప్రదేశ్‌లో మతాంతర వివాహం చేసుకున్న జంటకు పాస్‌పోర్ట్ ‌లు జారీ చేసినందుకుగాను నాటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ ‌సైతం ట్రోలింగ్‌ ‌బారినపడ్డారు. ఇక్కడ తమ భావజాలానికి వ్యతిరేకంగా పనిచేస్తే సొంత మనుషులను సైతం పోకిరీలు వదలరు అనడానికి ఉదంతాలివి.

సహజంగా భారత ప్రధాని ఎప్పుడూ జర్నలిస్టులకు లైవ్‌ ఇం‌టర్వ్యూ ఇవ్వరు. ఆయన మీడియాతో మాట్లాడే పద్దతి పూర్తిస్థాయి వన్‌ ‌వే ట్రాఫిక్‌ ‌ను కలిగి ఉంటుంది. ఆయన ముందుగానే సిద్దం చేసుకున్న ప్రసంగాన్ని మాట్లాడడమో, లేదా ఎంపిక చేయబడిన పాత్రికేయులచే ఎన్నిక చేయబడిన ప్రశ్నలకే సమాధానాలిచ్చే పద్దతి ఉంటుంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ‌తో పాటు నరేంద్రమోదీ సంయుక్తంగా పత్రికా సమావేశంలో పాల్గొన్నప్పుడు కొన్ని ప్రశ్నలు ఆయనను ఇబ్బంది పెట్టాయి. వాస్తవానికి ఈ పత్రిక సమావేశానికి ప్రధాని హాజరు కాలేరని ప్రధానమంత్రి కార్యాలయం ముందుగానే ప్రకటించినప్పటికినీ, పలుమార్లు జరిగిన సంప్రదింపుల అనంతరం ఆయన ఈ సమావేశానికి హాజరయినట్లు తెలుస్తోంది. 2014లో అధికారం చేపట్టిన తర్వాత తొలిసారిగా జర్నలిస్టులు ఈ సమయంలో  ఆయనకు ప్రశ్నలు సంధించారు. ఈ సందర్భంగా వాల్‌ ‌స్ట్రీట్‌ ‌జర్నల్‌ ‌జర్నలిస్ట్ ‌సబ్రీనా సిద్ధిఖీ భారతదేశంలో ముస్లింలు, ఇతర మైనారిటీల హక్కులు ముప్పులో ఉన్నాయని, తత్ఫలితంగా ప్రజాస్వామ్య విలువలను సూచిస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు. భాజపా ప్రభుత్వం అసమ్మతిని, పత్రికా స్వేచ్ఛను అణిచివేస్తోందని, అలాగే మతపరమైన మైనారిటీలపై, ముఖ్యంగా ముస్లింలపై వివక్ష చూపుతుందని విమర్శించిన మానవ హక్కుల సంస్థలు వ్యక్తం చేసిన ఆందోళనలను ఆమె ఉదహరించారు. ‘‘మీ దేశంలోని ముస్లింలు, ఇతర మైనారిటీల హక్కులను మెరుగుపరచడానికి మీరు ఏ చర్యలు తీసుకుంటున్నారు? వాక్‌స్వేచ్ఛను సమర్థించేందుకు మీ ప్రభుత్వం సిద్ధంగా ఉందా?’’ అని ఆమే ప్రశ్నించారు.

వెంటనే స్పందించిన మోదీ  తన పరిపాలన  ప్రాథమిక సూత్రమైన ‘‘సబ్కా సాత్‌, ‌సబ్కా వికాస్‌, ‌సబ్కా విశ్వాస్‌ ‌మరియు సబ్కా ప్రయాస్‌’’ అనే అంశాన్ని నొక్కిచెప్పారు. ఇది సమ్మిళిత వృద్ధికి, వ్యక్తులందరిలో నమ్మకాన్ని పెంపొందించడానికి సమిష్టి కృషిని సూచిస్తుందని స్పష్టం చేశారు. భారత, అమెరికా దేశాలు ప్రజాస్వామ్య స్పూర్తితో జీవిస్తున్నాయి కాబట్టి ఇక్కడ కులం, మతం ఆధారంగా వివక్ష లేదని ప్రకటించాడు.

అప్పటి నుండి సబ్రీనా సిద్ధిఖీ మీద ఆన్‌లైన్‌ ‌ట్రోలింగ్లు, వేదింపులు పెరిగిపోయాయి. సోషల్‌ ‌మీడియా వేదికగా చాలా మంది ఆమెను ‘‘పాకిస్తానీ తల్లిదండ్రుల’’ కుమార్తె అని లేబుల్‌ ‌చేశారు. ఈ ఉదంతంపై స్పందించిన వైట్‌ ‌హౌస్‌, ‌భారత ప్రభుత్వ మానవ హక్కుల రికార్డుపై ప్రధాని నరేంద్ర మోదీ ని ప్రశ్న అడిగినందుకు ఒక అమెరికా జర్నలిస్ట్‌ను వేధించడం ‘‘ఆమోదయోగ్యం కాదు’’ అని పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ‌తో పాటు, మాజీ అధ్యక్షుడు బారక్‌ ఒబామా, మరో డెబ్బై ఐదు మంది అమెరికా కాంగ్రెస్‌ ‌సభ్యులు ఈ అంశంలో సబ్రినాకు మద్దతు తెలిపారు. సబ్రినా సిద్ధిఖీ ఆషామాషి పాత్రికేయురాలు కాదు, వాల్‌ ‌స్ట్రీట్‌ ‌జర్నల్‌ ‌లో పనిచేస్తున్న సీనియర్‌ ‌రిపోర్టర్‌ ఆమె..వైట్‌ ‌హౌస్‌ ‌రిపోర్టర్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ ‌కలిగి ఉన్న ఆమే అమెరికా అధ్యక్షుడి వ్యవహారాలు, జాతీయ రాజకీయ వ్యవహారాలను కవర్‌ ‌చేస్తుంది. అంతకుముందు గార్డియన్‌ ‌సంస్థలో పనిచేసిన ఆమె సిఎన్‌ ఎన్‌ ‌లో రాజకీయ విశ్లేషకురాలిగా కూడా పనిచేస్తోంది.   ‘‘భారతదేశంలో అణచి వేయబడుతున్న మానవ హక్కులు, భావప్రకటన స్వేచ్చ, మత స్వేచ్చ, తదితర అంశాల గురించి భారత ప్రధానిని అమెరికా అధ్యక్షుడు ప్రశ్నించాడా’’ అని వైట్‌ ‌హౌస్‌ ‌ప్రతినిధులను అడగగా.., ‘‘విదేశీ నేతలు తమ దేశాన్ని సందర్శించినప్పుడు ఇలాంటి ప్రశ్నలు అడగడానికి అమెరికా అధ్యక్షుడు సంకోచించడని’’ స్పష్టం చేశారు.

భారత, అమెరికా దేశాల డిఎన్‌ ఏలోనే ప్రజాస్వామ్యముందని, వాస్తవానికి భారతదేశంలో ప్రాచీనకాలం నుంచే ప్రజాస్వామ్యం ఫరిఢవిల్లుతోందని ప్రకటించిన భారత ప్రధానిని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారిపై మోదీ  అభిమానులు ఆన్లైన్‌ ‌హరాస్మెంట్‌ ‌కు పాలుపడుతున్నారు. ఈ వ్యవస్థీకృత వేధింపులు, ట్రోలింగులు ఇండియాలో రోజురోజుకు ఎక్కువైపోయాయి. ప్రశ్నించేవారు మహిళల అయితే ఆమె  మీద మరింత వేధింపులు జరుగుతున్నాయి. ఆమె   క్యారెక్టర్‌ అసాసిన్‌ ‌చేయడం, ఫోటోలు మార్ఫింగ్‌ ‌చేసి శునకానందం పొందటం ఈ చర్యలలో మరో అంకం. ఈ చర్యలన్ని పాశ్చాత్య దేశాలు భారతదేశంపై చేసే ఆరోపణలకు బలాన్ని చేకూర్చేలా ఉన్నాయి. గతంలో బర్కాదత్‌, ‌రాజ్‌ ‌దీప్‌ ‌సర్దేశాయ్‌, ‌స్వాతి చతుర్వేది, నిధి రజ్ధాన్‌, ‌జైనబ్‌ ‌సికందర్‌, ‌రోహిణి సింగ్‌ ‌వంటి జర్నలిస్టులు ఈ ట్రోలింగులకు బలైనవారే. ఈ అంతర్జాల వేధింపులు ఒక ప్రణాళికబద్దంగా ప్రారంభించబడిన నిర్వాహక చర్య. తమ నాయకుడిని, ప్రభుత్వాన్ని విమర్శించే ఏ ఒక్కరిని ఈ ట్రోలర్లు విడిచిపెట్టరు. అనేకమంది జర్నలిస్టులు, ఉద్యమకారులు వారి నాయకుడిని ప్రశ్నించి ఇబ్బందులు కొని తెచ్చుకున్నవారే.

ఇటీవలీ కాలంలో జర్నలిస్టు తులసి చందు మీద జరిగిన/ జరుగుతున్న ట్రోలింగులు దేశంలో భావప్రకటన స్వేచ్చ అస్థిత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. తాను బిజేపి చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను సమాజానికి తెలియజేస్తుతున్నందుకు బూతులు తిడుతూ, తన ఫోటొలను మార్ఫింగ్‌ ‌చేస్తున్నారని చెప్పడం ఒక్కసారిగా తెలుగు మీడియాని ఉలిక్కిపడేలా చేసింది. తనకు ప్రాణానికి ముప్పు ఉందని ఆమె ప్రకటించినప్పుడు అనేకమంది ఆమెకు సంఘీభావం ప్రకటించడం ముదావాహం.

నిజానికి ఈ అంతర్జాల వేదింపుల వెనుక పనిచేస్తున్న చోదకశక్తులు మతోన్మాద భావజాలం మరియు అతిజాతీయవాదాలే. ఈ భావజాలల వెనక ఉండి నడిపిస్తున్న నాయకత్వాన్ని ప్రశ్నిస్తే సుశిక్షితులైన అంతర్జాల అరాచకవాదులు మూకుమ్మడిగా దాడిచేయటం పరిపాటైంది. మేనకగాంధి స్త్రీ శిశు సంక్షేమ మంత్రిగా ఉన్న సమయంలో మహిళలపై ఇంటర్‌ ‌నెట్‌ ‌వేదికగా జరుగుతున్న వేధింపులు అధికం కావడంతో ‘‘అయాం ట్రోల్డ్’’ అనే హెల్ప్ ‌లైన్‌ ‌సెంటర్‌ ‌ను ఏర్పాటు చేశారు. మేనకగాంధి తమ వాక్‌ ‌స్వాతంత్రాన్ని అడ్డుకుంటోందని పలువురు ట్రోలర్లు బాహటంగానే ఈ చర్యను వ్యతిరేకించారు. ఉత్తరప్రదేశ్‌లో మతాంతర వివాహం చేసుకున్న జంటకు పాస్‌పోర్ట్ ‌లు జారీ చేసినందుకుగాను నాటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ ‌సైతం ట్రోలింగ్‌ ‌బారినపడ్డారు. ఇక్కడ తమ భావజాలానికి వ్యతిరేకంగా పనిచేస్తే సొంత మనుషులను సైతం పోకిరీలు వదలరు అనడానికి ఉదంతాలివి.

ఈ మానసిక వైచిత్రి అంతా మతం ను ఆనుకుని ఉన్నదే. ఈ మానసిక వైచిత్రికి లోనైంది కేవలం పురుషులే కాదు, అనేకమంది మహిళలు కూడా ఉన్నారు. చాలామంది సోషల్‌ ‌మీడియాలో అశ్లీల వ్యాఖ్యలతో దుర్భాషలాడడం కనిపిస్తోంది. సీనియర్‌ ‌జర్నలిస్ట్ ‌స్వాతి చతుర్వేది ‘‘ఐయాం ఎ ట్రోల్‌’’ ‌పుస్తకం రాస్తున్న సమయంలో అనేకమంది ట్రోలర్లతో ముఖాముఖిగా మాట్లాడింది. మీరు మహిళలను, జర్నలిస్టులను రేపులు చేస్తామని ఇంత దారుణంగా ఎలా బెదిరించగలుగుతున్నారని అడిగినప్పుడు.., ఇది మాకు అత్యంత మామూలు విషయమని వారు తేల్చి చెప్పారని తెలిపింది. దీని వెనకాల ఒక వ్యవస్థీకృత పథకం ఉన్నదని సదరు బాధితులకు తెలియదని వారు కుండబద్దలు కొట్టి మరీ చెప్పారట. ఇక్కడ వీరందరి లక్షం ఒక్కటే, తమ భావజాలానికి వ్యతిరేకంగా మాట్లాడే ఏ గొంతునైనా మూయించడమే అనేది సుస్పష్టం. ఫ్రీ సెక్స్ ‌గురించి మాట్లాడిన సిపిఐ(ఎంఎల్‌) ‌పొలిట్‌బ్యూరో సభ్యురాలు కవితా కృష్ణన్‌ ‌మీద జరిగిన ట్రోలింగులకు అంతులేదు. సిఏఏ, ఎన్‌ ఆర్‌ ‌సి లకు వ్యతిరేకంగా గళం విప్పిన ప్రముఖ నటి దీపిక పదుకొనే కూడ ఈ ట్రోలర్ల బారినపడ్డారు. ప్రజావ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న గళాలను చూస్తే గర్వంగా ఉందని జేఎన్‌ ‌యూ విద్యార్థులను ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించినప్పుడు ప్రభుత్వ అనుకూలురు అనేకులు సోషల్‌ ‌మీడియా వేదికగా గగ్గోలు పెట్టారు.   సిఏఏకు వ్యతిరేకంగా ముస్లిం లకు మద్దతు ప్రకటించినందుకు గాను మహారాష్ట్రకు చెందిన హక్కుల కార్యకర్త దియావిగ్నేష్‌ అనేక ఇబ్బందులకు గురయ్యారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తోందనే ఒకేఒక కారణంతో తాను పనిచేస్తున్న కాలేజి నుంచి ఆమెను అర్ధాంతరంగా లెక్చరర్‌ ఉద్యోగం నుంచి తొలగించారు. దీనికి కారణం ఆ కళాశాల యాజమాన్యం బీజేపి సంబంధీకులు కావడమే.

ఈ మధ్యకాలంలో కొందరు తమ మీద జరుగుతున్న ట్రోలింగులకు వ్యతిరేకంగా ధైర్యంగా ముందుకు వస్తున్నారు. కాని అనేక మంది సామాజిక మాధ్యమాల వేదికగా తమ మీద జరిగే విద్వేషాలను భరించలేక, ఎవరికీ చెప్పుకోలేక తమ సోషల్‌ ‌మీడియా ఖాతాలను వదిలేసిపొతున్నారు.  యూరోపియన్‌  ‌దేశాల అతిజాతీయవాదమే రెండు ప్రపంచ యుద్ధాలకు కారణమయ్యాయి. ఈ జాడ్యం ఇప్పుడు దేశంలో విస్తరిస్తూ ప్రశ్నించే వారి భావప్రకటన స్వేచ్చకు ప్రతిబంధకంగా మారింది. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం పరిపాటి. ప్రశ్నకు సమాదానం చెప్పాలి కాని, పరిహసించడం, బెదిరించడం అప్రజాస్వామికమవుతుంది. ఇప్పుడు దేశంలో జరుగుతున్న ఆన్లైన్‌ ‌విద్వేషాలు ఆఫ్‌ ‌లైన్‌ అరాచాకాలకు దారితీస్తాయి. ఇవన్ని ప్రభుత్వ ప్రతిష్ఠను మసకబార్చేవే. ఈ ట్రోలర్లను, వారి దురాఘాతాలను ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.

image.png

    జయప్రకాశ్‌ అం‌కం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *