- తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర
- ఆరు నెలల ఉద్యమ ప్రస్థానం పేరుతో’ ప్రజాతంత్ర’ సంపాదకీయాలు
- సంతాపం తెలిపిన ముఖ్య మంత్రి కేసీఆర్
- ‘ప్రజాతంత్ర’ కుటుంబం ప్రగాఢ సంతాపం
ప్రజాతంత్ర , హైదరాబాద్ : ప్రముఖ రచయిత, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర అధికార భాషా సంఘం దేవులపల్లి ప్రభాకరరావు (83) గురువారం కన్నుమూశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జన్మించిన ప్రభాకరరావు ప్రజాతంత్ర దినపత్రిక వ్యవస్థాపకులలో వొకరు. ప్రస్తుతం ఆయన తెలంగాణ రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తెలంగాణ వాదాన్ని నరనరానా జీర్ణించుకున్న ప్రభాకరరావు 1969తో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. రాష్ట్ర సాధన లక్ష్యంగా డా.మర్రి చెన్నారెడ్డి స్థాపించిన తెలంగాణ ప్రజా సమితిలో కీలక భూమిక పోషించారు. సహజంగా కవి, రచయిత అయిన ప్రభాకరరావు ప్రజాతంత్ర దినపత్రికలో దాదాపు 10 ఏళ్ల పాటు గాంధీ శకం శీర్షికన గాంధీజీ జీవిత విశేషాలపై 500కు పైగా వ్యాసాలను రచించి ఆయన జీవిత చరిత్రను పాఠకుల కళ్లకు కట్టారు. సుదీర్ఘకాలం ప్రజాతంత్ర దినపత్రికతో మమేకమైన ప్రభాకరరావు వివిధ శీర్షికలతో పాఠకుల మన్ననలు పొందారు. ప్రభాకర్‌రావు రచనా వ్యాసాంగానికి గుర్తింపుగా యునెస్కో అవార్డు కూడా లభించింది.
2001లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రారంభమైన మలిదశ ఉద్యమంలో సైతం దేవులపల్లి ప్రభాకరరావు తన వంతు కీలక పాత్ర పోషించారు. శక్తివంతమైన తన వ్యాసాలతో తెలంగాణ ఉద్యమాన్ని ఉరకలెత్తించారు. ఈ సందర్భంగా ఉస్మానియా నుంచి మానుకోట వరకు ఆరు నెలల ఉద్యమ ప్రస్థానం పేరుతో ఆయన రాసిన వ్యాసాల సంపుటి తెలంగాణ ఉద్యమ చరిత్ర, ప్రస్థానాన్ని కళ్లకు కట్టింది. ముఖ్యంగా మలిదశ తెలంగాణ ఉద్యమ పోరాటంలో తెలంగాణను అడ్డుకునేందుకు సమైక్య పాలకులు చేసిన కుట్రలు, కాంగ్రెస్, టిడిపి నేతలు పన్నిన పన్నాగాలను ఉన్నది ఉన్నట్లుగా గ్రంథస్తం చేశారు. దేవులపల్లి ప్రభాకరరావు రాసిన గ్రంథాలలో వెలుగులోకి వెళదాం, గురజాడ మహాకవి, పారిజాతాలు కవితా సంకలనం ఆయన వ్యక్తిత్వానికి, వృత్తిపట్ల, రచానా వ్యాసంగం పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనమని ప్రసిద్ధ పాత్రికేయులు స్వర్గీయ పొత్తూరి వెంకటేశ్వరరావు ప్రశంసించడం విశేషం.రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగాఢ సంతాపం తెలిపారు. కాగా, దేవులపల్లి ప్రభాకరరావు మృతి పట్ల ప్రజాతంత్ర కుటుంబ సభ్యులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ సంతాపం
ప్రముఖ రచయిత, తెలంగాణ ఉద్యమకారుడు, రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకరరావు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర అధికార భాషా సంఘం మొట్టమొదటి అధ్యక్షునిగా ప్రభాకరరావు అందించిన సేవలు మరువలేనివన్నారు. ఈ సందర్భంగా సీఎం ప్రభాకరరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.