- కొడంగల్, కోస్గి హాస్పిటళ్ల అభివృద్ధిపై మంత్రి కెటిఆర్ ప్రశంస
- ఆ విమర్శలపై ఎందుకు స్పందించరు : ట్విట్టర్ వేదికగా ప్రధానికి కెటిఆర్ ప్రశ్న
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 15 : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కొడంగల్, కోస్గి ప్రభుత్వ హాస్పిటళ్ల అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆరు దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో హాస్పిటళ్లు అభివృద్ధి చెందలేదంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత అన్ని ప్రభుత్వ హాస్పిటళ్లు అభివృద్ధి చేస్తున్నామని, కొడంగల్, కోస్గి హాస్పిటళ్లలో మెడికల్ సదుపాయాలు అభివృద్ధి చేశామని తెలిపారు. ప్రభుత్వ హాస్పిటళ్ల అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కేటీఆర్. ఈ సందర్భంగా హరీశ్‌రావు చేసిన ట్వీట్‌ను కేటీఆర్ రీట్వీట్ చేశారు. కొడంగల్ సివిల్ హాస్పిటల్ 50 బెడ్లకు అప్‌గ్రేడ్ చేశామని హరీశ్‌రావు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, ఎక్స్ రే, అల్టా సౌండ్‌తో పాటు ఇతర సదుపాయాలు కల్పించామన్నారు. రూ. 5 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన సీహెచ్‌సీని ప్రారంభించబోతున్నట్లు హరీష్ రావు ప్రకటించారు.
ఆ విమర్శలపై ఎందుకు స్పందించరు : ట్విట్టర్ వేదికగా ప్రధానికి కెటిఆర్ ప్రశ్న
ప్రధాని నరేంద్ర మోదీ, పారిశ్రామికవేత్త అదానీని విమర్శిస్తూ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. సీబీఐ, ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్ష నేతలను కేంద్రం టార్గెట్ చేయడం సాధారణమే అని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. మరి శ్రీలంక పవన విద్యుత్ కాంట్రాక్టుల్లో ప్రధాని మోదీ జోక్యం ఉందని ఆ దేశ సీనియర్ అధికారులే ఆరోపిస్తున్నారు. మరి దీనిపై ప్రధాని మోదీ, అదానీ ఎందుకు స్పందించడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు.