- కొత్త నియామకాల్లో కఠిన నిబంధన
- కచ్చితంగా అమలు చేయనున్న వైద్యారోగ్య శాఖ
హైదరాబాద్, ప్రజాతంత్ర : ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు ప్రాక్టీసు నిర్వహించకుండా ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలు చేయనుంది. ఇకపై కొత్తగా నియమించబడే వైద్యులంతా ఈ నిబంధనను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.
ప్రభుత్వ వైద్యులు దవాఖానాలలో విధి నిర్వహణ అనంతరం సొంతంగా ప్రాక్టీసు నిర్వహించుకునే వెసులుబాటు ప్రస్తుతం ఉంది. దీంతో వైద్యులు విధి నిర్వహణ సమయంలోనూ విధులకు హాజరు కాకుండా ప్రైవేటుకు ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ వైద్యులుగా నెలనెలా రూ.వేలల్లో వేతనం తీసుకుంటున్నప్పటికీ ప్రజలకు వైద్య సేవలు అందించడం లేదనీ, దీంతో ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గతంలో ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు ప్రాక్టీసుకు దూరంగా ఉండాలనే నిబంధన విధించినప్పటికీ ఆ నిబంధన ఎక్కడా అమలు కాలేదు. ప్రభుత్వ వైద్యులు సైతం ఈ నిబంధనను తీవ్రంగా వ్యతిరేకించారు.
విధి నిర్వహణ సమయం అనంతరం తాము ప్రైవేటు ప్రాక్టీసు పెట్టుకుంటే అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. దీనికి తోడు వైద్యుల సంఘాలు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో ఈ నిబంధన అమలు మూలకు పడింది. కాగా, పిహెచ్‌సి స్థాయి నుంచి టీచింగ్ హాస్పిటల్ వరకూ ఉన్న ఖాళీలు అన్నింటినీ భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ వైద్యఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఇకపై చేపట్టబోయే నియామకాలలో ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు ప్రాక్టీసుకు దూరంగా ఉండాలనే నిబంధనను వైద్యుల నియామక పత్రాలలోనే విధించనున్నారు. ఆమేరకు వైద్యుల నుంచి రాతపూర్వక అంగీకారం తీసుకున్న తరువాతనే పోస్టింగులు ఇవ్వనున్నారు. ఈ నిబంధనలు కఠినంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆ శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.