‌ప్రభుత్వ దవాఖానాల్లో నాణ్యమైన వైద్యం

మరో 13 దవాఖానాలకు ఎన్‌క్వాష్‌ ‌సర్టిఫికెట్లు
నిర్మల్‌ ఏరియా హాస్పిటల్‌కు ‘‘లక్ష్య’’ గుర్తింపు
స్వరాష్ట్రంలో ప్రభుత్వ వైద్య రంగం బలోపేతం
గణనీయంగా పెరిగిన నాణ్యతా ప్రమాణాలు
హర్షం వ్యక్తం చేసిన ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 25 : ‌స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌నాయకత్వంలో ప్రభుత్వ వైద్య సేవల్లో నాణ్యత ప్రమాణాలు గణనీయంగా పెరిగాయని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ జాతీయ స్థాయి గుర్తింపు నిదర్శనమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. రాష్ట్రంలో పీహెచ్‌సీ స్థాయి నుంచి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. రాష్ట్ర వైద్యారోగ్య రంగం దేశానికే ఆదర్శంగా మారుతున్నదని పేర్కొన్నారు. స్వరాష్ట్రంలో, సీఎం కేసీఆర్‌ ‌మార్గనిర్దేశనంలో ప్రభుత్వ వైద్య రంగం బలోపేతం అయిందని, పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని మరోసారి నిరూపితం అయిందని కేంద్ర వైద్యారోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. రాష్ట్రంలోని మరో 13 ప్రభుత్వ డవాఖానాలు ఎన్‌క్వాష్‌ (‌నేషనల్‌ ‌క్వాలిటీ అష్యురెన్స్ ‌స్టాండర్డస్-ఎన్‌క్యూఏఎస్‌) ‌సర్టిఫికేట్లు సాధించగా, మరో మూడు హాస్పిటల్స్‌కు రీ సర్టిఫికేషన్‌ ‌వొచ్చింది.

లేబర్‌ ‌రూమ్‌, ఆపరేషన్‌ ‌ధియేటర్‌ ‌నిర్వహణలో అత్యున్నత నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నందుకు నిర్మల్‌ ఏరియా హాస్పిటల్‌ ‌కు ‘‘లక్ష్య’’ గుర్తింపు లభించింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖకు శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ దవాఖానాలకు జాతీయ స్థాయి గుర్తింపు రావడం పట్ల ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌హర్షం వ్యక్తం చేశారు. కార్పొరేట్‌ ‌హాస్పిటల్స్‌కే పరిమితమైన జాతీయ స్థాయి నాణ్యత ప్రమాణాల గుర్తింపును తెలంగాణలోని జిల్లా, ప్రాంతీయ, సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సాధిస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేస్తున్న వైద్యారోగ్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. తాజాగా వొచ్చినవి కలుపుకుంటే రాష్ట్రంలో మొత్తం 143 దవాఖానాలకు ఎన్‌క్వాష్‌ ‌గుర్తింపు వొచ్చిందని, ఈ గుర్తింపు కలిగిన డవాఖానాలు అత్యధికంగా ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచిందని మంత్రి తెలిపారు.

అన్ని ప్రభుత్వ దవాఖానాలకు ఈ గుర్తింపు కోసం ప్రభుత్వం కృష్టి చేస్తున్నదనీ, ఆ దిశగా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. దేశంలో మొదటి స్థానంలో నిలవడం లక్ష్యంగా పని చేస్తున్నట్లు చెప్పారు. ‘స్వరాష్ట్రంలో ప్రభుత్వం వైద్యారోగ్య రంగాన్ని పటిష్టం చేస్తున్నది. దీంతో ప్రభుత్వ దవాఖానాల్లో మౌలిక వసతులు పెరిగాయి. విలువైన వైద్య పరికరాలు అందుబాటులోకి వొచ్చాయి. ఓపీ, ఐపీ, సర్జికల్‌ ఇలా అన్ని విభాగాల్లో నాణ్యత పెరిగింది. దీంతో రాష్ట్ర ప్రజలకు ఉచితంగా, నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయి.’ అని మంత్రి హరీష్‌ ‌రావు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page