మహేశ్వరం, ప్రజాతంత్ర ఆగస్ట్ 16: ప్రతి దళితునికి దళిత బంధు పథకం ఇవ్వాలని రంగా రెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు చల్లా నర్సింహ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాని డిమాండ్ చేశారు. బుధవారం చల్లా నర్సింహ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి మహేశ్వరం నియోజకవర్గం మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ జిలెల్ల గూడ అంబేద్కర్ నగర్ లో పర్యటిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని ప్రతి దళితుడికి ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, ఇచ్చే పథకాల గురించి ప్లే కార్డులు ప్రదర్శిస్తూ.. ప్రచారం చేశారు. అంతకు ముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చల్లా నర్సింహ రెడ్డి మాట్లాడుతూ.. దళిత బంధు పథకాన్ని ప్రతి ఒక్కరి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గానికి ఒక్కరు. ఇద్దరికి దళిత బంధు ఇచ్చి, ఎనలేని ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. ప్రచారం తప్ప, ఆచరణలో మాత్రం శూన్యమన్నారు. కేసీఆర్ ప్రజలను మరోసారి మభ్య పెట్టి ఎన్నికలో లబ్ధి పొందాలన్న ఉద్దేశంతో హడావుడిగా దళిత, ఎస్టీ, బిసి, మైనార్టీ బందులను ప్రకటిస్తున్నారని విమర్శించారు. తొమ్మిది ఏళ్లలో గుర్తుకు రాని దళితులు, ఎస్టీ, బిసి, మైనార్టీలు ఇప్పుడే ఎందుకు గుర్తుకు వచ్చారని ప్రశ్నించారు. కేవలం ఎన్నికల కోసమే కేసీఆర్ కొత్త నాటకానికి తెరలేపారని మండిపడ్డారు. కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు నమ్మరని అన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలను విపరీతంగా పెంచి, పేద, మధ్య తరగతి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలకు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే, మేము ప్రకటించిన అన్ని హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఏడుదొడ్ల సురేందర్ రెడ్డి, మాజీ వైస్ యంపీపీ కందాల బాబు, కార్పొరేటర్ చల్లా కవిత బాల్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా జర్నల్ సెక్రటరీ ఎరుకల వెంకటేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ వెంకటేష్ గౌడ్, మాజీ వార్డ్ సభ్యులు కిసరా యాదిరెడ్డి, యూత్ కాంగ్రెస్ జర్నల్ సెక్రటరీ అల్ల శ్రీనివాస్ రెడ్డి, శ్రీను, అంబేద్కర్ నగర్ కాలనీ వాసులు శ్రీను, ఐతరాజ్ భాస్కర్, పాయిల్లా శేఖర్ రెడ్డి, కోళ్ల పర్శరాం, సొంటీ వేంకటేష్, కుమార్, విక్రమ్, తదితరులు పాల్గొన్నారు.