చండీగఢ్ లో జరుగుతున్న జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లో పాల్గొంటున్న ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు బుధవారం ప్రతిష్టాత్మక “చండీగఢ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్”ను సందర్శించారు. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ డాక్టర్ వివేక్ లాల్, డీన్ డాక్టర్ పురి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వివేక్ కౌశల్ మంత్రికి సాదర స్వాగతం పలికారు. హాస్పిటల్ లోని సదుపాయాలు, అందిస్తున్న సేవల గురించి మంత్రికి వివరించారు. సీఎం కేసీఆర్ మార్గనిర్దశనంలో తెలంగాణ వైద్య రంగంలో తీసుకొస్తున్న మార్పుల గురించి మంత్రి హరీష్ రావు వారికి వివరించారు.
హైదరాబాద్ లోని నిమ్స్ విస్తరణ, నగరం నలువైపులా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న టిమ్స్, వరంగల్ లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు వంటి అంశాల గురించి వారితో చర్చించారు. ఒక్క హైదరాబాద్ లోనే కొత్తగా ఆరు వేల పడకలు, వరంగల్ లో వేయి పడకలతో పాటు, సూపర్ స్పెషాలిటీ సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించారు. మరింత మెరుగైన వసతులు కల్పించడానికి సలహాలు, సూచనలు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి వెంట వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతూ ప్రసాద్, సీఎం ఓఎస్డీ డాక్టర్ గంగాధర్, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్ లు ఉన్నారు.