‘‘టీకాలతో ఆరోగ్య, ఆర్థిక, సామాజిక ప్రయోజనాలు కూడా కలుగుతాయని, వ్యాధులు సోకకుండా నాటి నేటి వరకు భారతీయుల ఆరోగ్య కవచంగా నవజాత శిశువు నుండే వయోవృద్ధుల వరకు టీకాలు పలు రోగాల పట్ల వ్యాధినిరోధకశక్తిని పెంపొందించడం, జీవితకాలం వ్యాధులు సోకకుండా కట్టడి చేయడం చూస్తున్నాం. గత రెండు ఏండ్లుగా ప్రపంచ మానవాళిని పట్టి పీడిస్తున్న కోవిడ్-19 వ్యాధి సోకకుండా ముందు జాగ్రత్తగా టీకాలు మానవ జాతికి వరాలుగా ఆవిష్కరించబడ్డాయి.’’
16 మార్చి 1995న దేశవ్యాప్తంగా ‘జోనస్ సాల్క్’ కనుగొన్న పోలియో టీకాలను భారత చిన్నారులు అందరికీ ఉద్యమంగా ‘ఓరల్ పల్స్ పోలియో డ్రైవ్’ ప్రారంభమైంది. భారతదేశ ప్రజారోగ్య చరిత్రలో అత్యంత ప్రధానమైన మైలురాయికి గుర్తుగా ప్రతియేట 16 మార్చిన ‘జాతీయ వ్యాక్సినేషన్ దినం (నేషనల్ వ్యాక్సినేషన్ లేదా ఇమ్యునైజేషన్ డే)’ను పాటించుట ఆనవాయితీగా మారింది. జాతీయ టీకా దినం-2022 నినాదంగా ‘అందరికీ అందుబాటులో టీకాలు (వ్యాక్సీన్ వర్కస్ ఫర్ ఆల్)’ అనబడే అంశాన్ని తీసుకొని, టీకాలకు భయపడే వారితో పాటు టీకాలను వ్యతిరేకించే వారిని కూడా టీకా పరిధిలోకి తీసుకురావడానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. పలు ప్రమాదకర వ్యాధులను జీవితకాలం నిరోధించడానికి, ప్రజారోగ్య పరిరక్షణకు, ఆరోగ్య నియంత్రణకు, ప్రాణాలు కాపాడటానికి టీకాలే దివ్య ఔషధాలని ఐరాస – డబ్ల్యూహెచ్‌ఓ పిలుపునిస్తున్నది.
టీకాలతో ఆరోగ్య, ఆర్థిక, సామాజిక ప్రయోజనాలు కూడా కలుగుతాయని, వ్యాధులు సోకకుండా నాటి నేటి వరకు భారతీయుల ఆరోగ్య కవచంగా నవజాత శిశువు నుండే వయోవృద్ధుల వరకు టీకాలు పలు రోగాల పట్ల వ్యాధినిరోధకశక్తిని పెంపొందించడం, జీవితకాలం వ్యాధులు సోకకుండా కట్టడి చేయడం చూస్తున్నాం. గత రెండు ఏండ్లుగా ప్రపంచ మానవాళిని పట్టి పీడిస్తున్న కోవిడ్-19 వ్యాధి సోకకుండా ముందు జాగ్రత్తగా టీకాలు మానవ జాతికి వరాలుగా ఆవిష్కరించబడ్డాయి. ‘టీకా పితామహుడి’గా పేరుగాంచిన ‘ఎడ్వర్డ్ జెన్నర్’ స్మాల్‌ఫాక్స్‌కు టీకా కనుగొన్నారు. ‘లూయిస్ పాస్చర్’ పరిశోధనల్లో కలరా, ఆన్‌త్రాక్స్ టీకాలు కనుగొనుటలో చురుకైన పాత్రను పోషించారు. ఇండియాలో 19వ శతాబ్దం నుంచి టీకాల ఆవిష్కరణలు జరుగుతున్నాయి. 1940లో పెద్ద ఎత్తున టీకాల ఉద్యమం మ్నెదలైంది. 1960లో యం.యం.ఆర్ (మీసిల్స్, మంప్స్, రుబెల్లా) టీకా, 1972లో ఏకంగా ‘స్మాల్‌ఫాక్స్’ నిర్మూలన చేయడం చూశాం. గత అర్థశతాబ్దంగా ఇండియాలో ట్యుబర్‌క్యులోసిస్ (టిబి) సోకకుండా బిసిజి (బాసిల్లే కాల్మెట్-గ్యురిన్) టీకాను తొలిసారి ప్రారంభించారు. టైఫాయిడ్-డిప్తీరియాలు రాకుండా 1978లో టీకాలను ప్రవేశ పెట్టారు. ‘ప్రపంచ ఇమ్యునైజేషన్ డే’ను 10 నవంబర్‌న విశ్వ మానవాళి సమైక్యంగా నిర్వహించుకుంటున్నాం.
‘మిషన్ ఇంద్రధనుష్’ సార్వత్రిక టీకా ఉద్యమం:
1985లో దేశవ్యాప్తంగా ‘యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ (యూపిఐ)’ను ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. పోలియో, టెటనస్, రుబెల్లా, మెనిన్‌జైటిస్, డిప్తీరియా, న్యుమోనియా,పెర్‌ట్యుసిస్, మీసిల్స్, మంప్స్, టిబి, హెపటైటిస్-బిలతో (5 ఏండ్ల లోపు పిల్లలకు) పాటు నేడు కరోనా లాంటి భయంకర వ్యాధులకు టీకాలు అందుబాటులో ఉన్నాయి. 12 ఏండ్లు దాటిన పిల్లలకు కూడా కరోనా టీకాలు 16 మార్చి 2022 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ‘మిషన్ ఇంద్రధనుష్’ గొడుగు కింద 2014 డిసెంబర్ నుంచి సార్వత్రిక టీకా పరిధిలోకి మహిళలు, పిల్లలను చేర్చి వ్యాక్సినేషన్ వసతులను ఇళ్ల వద్దనే వేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా 2030 నాటికి టీకాల కొరతతో పిల్లల మరణాలను ఆసాంతం కట్టడి చేయడానికి ప్రణాళికలు వేస్తున్నారు. వ్యాక్సినేషన్‌తోనే రోగాలకు అడ్డుకట్ట వేయగలమని, టీకా పట్ల వ్యతిరేకంగా ఉన్న అమాయక జనులను కూడా టీకాల పరిధిలోని తేవడానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. టీకాలు ప్రాణాలు కాపాడుతాయి, టీకా భయంతో తీసుకోని యెడల ప్రాణాపాయం కలగవచ్చని నేటి సమాజం ప్రచారం చేయాలి.
దేశవ్యాప్తంగా ఉద్ధృతంగా కోవిడ్-19 టీకా ఉద్యమం:
2019 డిసెంబర్‌లో చైనా, వూహాన్ నగరంలో బయట పడిన బాంబు లాంటి కరోనా వైరస్ భారతదేశంలో 30 జనవరి 2020న తొలి కరోనా కేసు రూపంలో బయట పడింది. ఇండియాలో 13 మార్చి నాటికి 4.3 కోట్ల కరోనా కేసులు, 3.1 కోట్ల రికవరీలు, 5.16 లక్షల మరణాలు నమోదైనాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదదైన దేశాల జాబితాలో అమెరికా, ఇండియా, బ్రెజిల్‌లు తొలి మూడు స్థానాలలో ఉన్నాయి. కరోనా అలల తీవ్రత, అధిక వైరస్ వ్యాప్తి రేటు, ఔషధాల కొరత, ఆసుపత్రుల్లో పడకల/వెంటిలేటర్ల/ఆక్సీజన్ సిలిండర్ల కొరత, వలసల వెతలు,విద్యాలయాల మూసివేత, లాక్‌డౌన్‌లతో ఆర్థిక సంక్షోభాలు, ఉద్యోగ ఉపాధుల కోతలు, ప్రగతిరథానికి బ్రేకులు, టీకాలకు వ్యతిరేకించే జనాలు, వైద్యఆరోగ్య లోసుగులు, రవాణ ఇక్కట్లు, గ్రామీణుల వ్యథలు, ప్రజాపంపిణీ వ్యవస్థల అవస్థలు, కోవిడ్-19 అనంతర రుగ్మతలు, టీకా కోరతలు లాంటి అనేక సమస్యలు ప్రపంచ మానవాళి మెడకు చుట్టుకున్నాయి.
16 జనవరి 2021న ప్రారంభమైన కోవిడ్-19 టీకా ఉద్యమం ద్వారా 12 మార్చి 2022 నాటికి 1.8 బిలియన్ల డోసులు అందించారు. దేశంలో 95 శాతం 15 ఏండ్లు దాటిన ప్రజలకు (97 కోట్ల జనాభా) ఒక డోసు, 80 శాతం అర్హతగల ప్రజలకు (81 కోట్ల జనాభా) రెండు డోసులు, 2.1 కోట్ల ప్రజలకు బూస్టర్ డోసుల కోవిడ్-19 టీకాలు అందడం ఓ మహత్తర సాఫల్యతగా చెప్పవచ్చు. సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కోవిషీల్డ్ టీకాలు, భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సీన్ టీకాలు, డా: రెడ్డి ల్యాబ్స్ తయారు చేసిన స్పుత్నిక్-వి కోవిడ్-19 టీకాలను దేశ ప్రజలు తీసుకున్నారని మనకు తెలుసు. వ్యాధుల నివారణ, ప్రజారోగ్య పరిరక్షణ, ఆర్థిక సామాజిక వెసులుబాటు లాంటి పలు ప్రధాన ప్రయోజనాలు కలిగిన టీకా ఉద్యమం విజయవంతం కావడానికి చేయూత ఇవ్వవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. టీకాలను సకాలంలో తయారు చేసిన పరిశోధకులు, ఆవిష్కరించిన శాస్త్రవేత్తలు, అందిస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బంది, సహకరించినా ప్రభుత్వ యంత్రాంగాలకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు సమర్పించాల్సిన బాధ్యత ప్రజల మీద ఉన్నది. మన పిల్లలకు సకాలంలో అర్హతగల టీకాలను అందించాల్సిన కనీస కర్తవ్యం తల్లితండ్రులు, కుటుంబ పెద్దల మీద ఉన్నది. వ్యాధి సోకకుండా ముందే జాగ్రత్త పడదాం. ‘చికిత్స కన్న నివారణ మిన్న’ అని ప్రచారం చేద్దాం.