కందుకూరు,ప్రజాతంత్ర,డిసెంబర్ 29: కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చేలా బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు ప్రజల గొంతుకగా ప్రశ్నించాలని,అర్హులైన వారందరికీ సంక్షేమ ఫలాలు అందేలా పనిచేయాలని మాజీ మంత్రి,మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు.కందుకూరు మండల కేంద్రంలోని సామ నరసింహ రెడ్డి ఫంక్షన్ హాల్ లో జరిగిన విజయోత్సవ సభలో సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ,గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో పార్టీలకు అతీతంగా అర్హులైన వారందరికీ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినట్లే ప్రస్తుత ప్రభుత్వం చేయకపోతే,కాంగ్రెస్ పార్టీ వారికే ఇస్తే ఉరుకోబోమని ఉద్యమిస్తామని ఆమె హెచ్చరించారు.అందరికీ అందేలా అవసరం అయితే పోరాటాలు చేస్తామన్నారు.ఎన్నికల సమయంలో రైతు బంధు ఇవ్వటానికి కృషి చేస్తే పిర్యాదులు చేసి అపారని,15 వేలకు పెంచి డిసెంబర్ 9 నుండి ఇస్తామని చెప్పి నేటికి కూడా రైతుల ఖాతాలో డబ్బులు వేయలేదన్నారు. ప్రభుత్వం దగ్గర తెలంగాణలోని ప్రజల సంపూర్ణ వివరాలు ఉన్న తిరిగి దరఖాస్తులు అంటూ ప్రజలను క్యూ లైన్లు కట్టిస్తున్నారని,అయిన కూడా ప్రజలందరూ దరఖాస్తులు ఇవ్వాలని,లేనట్లయితే దరఖాస్తు నేపంతో సంక్షేమానికి తిలోదాకాలు ఇచ్చే అవకాశం ఉందన్నారు.అన్ని పథకాలకు రేషన్ కార్డే ప్రామాణికం అయినపుడు ముందు వాటినే అందించాలని ప్రభుత్వానికి సూచించారు.ఆరు గ్యారెంటీలే కాదు 400 కు పైగా గ్యారెంటీ హామీలు ఇచ్చారని,వాటిని ప్రజలకు అందించే వరకు ప్రజల తరుపున పోరాటం చేస్తామన్నారు. దరఖాస్తులు,ఆతర్వాత వాటి విచారణ పేరుతో లోక్ సభ ఎన్నికల వరకు కాలయాపన చేస్తారన్నారు.ఒక ఇంటి లాగే ఏ ప్రభుత్వం అయిన అప్పులు చేస్తుందని,అభివృద్ధి చేస్తూ సంపద సృష్టిస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి తరుచూ అప్పులు అంటూ గ్యారెంటీలను,హామీలను పక్కన పెట్టె ప్రయత్నం చేస్తుందని సబితమ్మ విమర్శించారు.ఈ ప్రాంతంలో మెట్రోతో పాటు,కాలుష్యానికి తావులేని ఫార్మా సిటీ ఏర్పాటుతో రూపురేఖలు మారిపోయి ఉండేదని నేడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిపై ఎలాంటి చర్చలు,సమీక్షలు జరుపకుండానే రద్దు చేస్తున్నట్లు ప్రకటించారని పేర్కొన్నారు. వీటితో ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించేవని,మెగా శాటిలైట్ టౌన్ షిప్ తో ఇక్కడి యువతకు,ప్రజలకు ఎం ప్రయోజనం చేకూరుతుందని సబితరెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ఈ ప్రాంతం వరకు మెట్రో ఏర్పాటు చేసే వరకు కృషి చేస్తానని,ప్రజలతో కలిసి పోరాటం చేస్తామన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఫార్మాను రద్దు చేసి రైతులకు భూములు తిరిగి ఇస్తామని చెప్పారని,నేడు టౌన్ షిప్ అంటున్నారని అన్నారు. గత రెండు పర్యాయాలుగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని గొప్పగా తీర్చిదిద్దారని,అబద్ధాల హామీలు,అసత్యాలు ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. మహేశ్వరం నియోజకవర్గములో కూడా ఎంతగా ప్రయత్నించిన ప్రజలు తనకు సంపూర్ణ మద్దతు ఇచ్చారని,వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాన్నన్నారు.ఎన్ని ప్రలోభాలకు గురిచేసిన నియోజకవర్గములో 99 శాతం మంది నాయకులు బిఆర్ఎస్ పార్టీ విజయం కోసం,నా గెలుపుకు కృషి చేశారని వారిని ఎప్పటికి మర్చిపోనని అన్నారు.విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి సబితమ్మ కృతజ్ఞతలు తెలిపారు.మండల పార్టీ అధ్యక్షులు జయేందర్ అధ్యక్షతన జరిగిన సభలో జడ్పీటీసీ జంగారెడ్డి,మార్కెట్ చైర్మన్ సురేందర్ రెడ్డి,మాజీ ఎస్సి కమీషన్ సభ్యులు చిలకమర్రి నరసింహ్మ,సొసైటీ చైర్మన్ చంద్ర శేఖర్,పార్టీ సీనియర్ నాయకులు బేర బాలక్రిష్ణ,లక్ష్మీ నరసింహ రెడ్డి,వివిధ గ్రామాల సర్పంచ్ లు,ఎంపీటీసీలు,వార్డు సభ్యులు,మార్కెట్,సొసైటీ డైరెక్టర్లు,బిఆర్ఎస్ పార్టీ నాయకులు,అనుబంధ సంఘాల నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.