ప్రజల్ని ప్రభుత్వం దగ్గరకు రప్పించకుండా ప్రభుత్వమే ప్రజల వద్దకు
ప్రజా సమస్యలన్నీ పరిష్కరిస్తాం
కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు…అవసరమైన వారికి అందజేస్తాం
మేడిగడ్డపై విచారణ కొనసాగుతుంది
అప్పుల కుప్పను చేసి…ఖాళీ బిందెలు ఇచ్చారు
లక్ష కోట్లలో కెసిఆర్ నుంచి లక్ష రాబట్టాం
అసెంబ్లీలో బావాబామ్మర్దులు తంటాలు పడ్డారు
ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగ నియామకాలు
విూడియాతో సిఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 27 : ఒకప్పుడు ప్రజలకు సమస్యలు ఉంటే ప్రభుత్వం దగ్గరకు వొస్తే గడీలు అడ్డుగోడలుగా ఉండేవని, కానీ ఇప్పుడు ప్రభుత్వమే ప్రజల వద్దకు నడిచి వెళ్తుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బుధవారం సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజాపాలన అభయహస్తం ఆరు గ్యారంటీల లోగో, పోస్టర్, దరఖాస్తు ఫారమ్‌ను విడుదల చేశారు. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని అన్నారు. నిస్సహాయులకు సహాయం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. తండాలు, గూడాలలో ఉన్న అత్యంత నిరుపేదలకు పథకాలు అందించేందుకు గ్రామ సభలు ఏర్పాటు చేస్తున్నట్టు సిఎం చెప్పారు. సచివాలయానికి, ప్రజాభవన్‌కు వొచ్చి దరఖాస్తులు ఇవ్వడం కష్టమైన పని అన్నారు. హైదరాబాద్ రావాల్సిన పని లేకుండా గ్రామాల్లోనే లబ్దిదారుల ఎంపిక నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రజల్ని ప్రభుత్వం దగ్గరకు రప్పించకుండా ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళుతుందన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు పంపుతున్నట్టు చెప్పారు. గ్రామ సభల్లో సర్పంచులు, ఎంపిటిసిలు, జడ్పిటీసీలు, మంత్రలు, ఎమ్మెల్యేలు ప్రజల వద్దకు ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని చెప్పారు. ప్రజావాణి కార్యక్రమానికి రప్పించడం కాకుండా ప్రజల వద్దకే వెళ్లి గ్రామ సభలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
డిసెంబరు 28 నుంచి గ్రామాలు, పట్టణాలు, మున్సిపల్ వార్డుల్లో ఐదు పథకాలకు(మహాలక్ష్మి, రైతుభరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత) సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తామని, ఎనిమిది పనిదినాల్లో గ్రామ సభల ద్వారా దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తాము డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేశామని, జనవరి 7లోపు లబ్ధిదారుల వివరాలు సేకరించేందుకు యత్నిస్తున్నామని, అర్హులైన లబ్ధిదారులకు పథకాలు అందించాలని నిర్ణయించామని, ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి న్యాయం చేసేందుకు యత్నిస్తుందని, ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. గ్రామసభల దరఖాస్తుతో వివరాలు తమకు అందుతాయయని, ఎన్ని రోజుల్లో పరిష్కారం చేయగలుగుతం అనేది తెలుస్తుందన్నారు. మంచి ఆలోచనతో చేస్తున్నామని తెలిపారు. ప్రతి మండలం రెండు గ్రూపులు ఉంటాయని, ఒక గ్రూప్‌కి ఎండీఓ..మరో గ్రూప్‌కి ఎమ్మార్వో బాధ్యత వహిస్తారని చెప్పారు. త్వరలోనే రేషన్‌కార్డులు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రేషన్‌కార్డులు ఉంటేనే సంక్షేమ పథకాలు అందుతాయని, అయితే అభయహస్తం దరఖాస్తు చేసుకునే వారికి రేషన్ కార్డు లేకపోయినా పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని రేవంత్ రెడ్డి అన్నారు. గత పదేళ్లలో ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో లేదని.. అందుకు ప్రజావాణీలో వొచ్చిన 24 వేల ఫిర్యాదులే నిదర్శనమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలు మోయలేని భారాన్ని గత పదేళ్లలో మోసారని అన్నారు. ఒకప్పుడు ప్రజలకు సమస్యలు ఉంటే ప్రభుత్వం దగ్గరకు వొస్తే గడీలు అడ్డుగోడలుగా ఉండేవని, కానీ ఇప్పుడు ప్రభుత్వమే ప్రజల వద్దకు నడిచి వెళ్తుందన్నారు. ప్రజా పాలనలో ప్రజలకు తమ మీద మరింత విశ్వాసం కలుగుతుందన్నారు. గతంలో గడీల మధ్య పాలనా నడిచిందని.. ఇప్పుడు ప్రభుత్వమే ప్రజల కోసం వారి వద్దకు వెళ్తుందన్నారు. ప్రభుత్వం, అధికారులకు దగ్గరైనప్పుడు సమస్యలు పరిష్కారం అవుతాయని, గ్రామసభల్లో దరఖాస్తు పత్రాలు అందుబాటులో ఉంటాయని, అర్హులైన ప్రతీ ఒక్కరికి గ్యారంటీలను అందిస్తామని, మారుమూల పల్లెకూ సంక్షేమ పథకాలు అందాలన్నదే తమ లక్ష్యమని రేవంత్ రెడ్డి తెలిపారు.
ప్రభుత్వమే ప్రజల దగ్గరకు వొస్తుందని, ప్రతీ మండలంలో రెండు గ్రూపులు ఏర్పాటు చేస్తామని, మహిళలకు, పురుషులకు వేరువేరుగా కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని, గ్రామ సభలు ముగిసిన తరువాత కూడా దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. గడువు తరువాత దరఖాస్తులు స్వీకరించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు సీఎం. ఎవరూ ఆందోళన చెందొద్దని, ఈ ప్రభుత్వం ప్రజలదని, ప్రజల కోసం పనిచేస్తుందన్నారు. జనవరి ఆరో తేదీ తర్వాత కూడా ఎంపీడీవో, ఎంఆర్వో ఆఫీసుల్లో అభయ హస్తం దరఖాస్తు చేసుకోవచ్చునని సిఎం అన్నారు. గత ప్రభుత్వ అవినీతిపై శ్వేతపత్రాలు విడుదల చేశామని, రూ. 6.71లక్షల కోట్లు అప్పులు చేసి రాష్రాన్ని నిండా ముంచారని, పరిస్థితుల నుంచి తేరుకుని ముందుకు వెళ్లేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబడతామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత చూస్తే.. ఖాలీ కుండలే ఉన్నాయని, కేసీఆర్ అండ్ ఫ్యామిలీ మొత్తం ఊడ్చుకుని వెళ్లిందన్నారు. తాము లంకె బిందెలు అని వొస్తే.. ఖాలీ గిన్నెలు కనిపిస్తున్నాయని.. ఇప్పుడు అంతా సెట్ రైట్ చేయాల్సిన పరిస్థితి వొచ్చిందన్నారు. అందుకే తాము కేంద్రం దగ్గరకు వెళ్లామన్నారు. తెలంగాణకు సంబంధించి ఎక్కడి నుంచి రావాలో అవన్నీ తెస్తామని, కేంద్రం నుంచి రావాల్సిన నిధులను కూడా తెచ్చుకుంటామన్నారు రేవంత్ రెడ్డి. పదేళ్లపాటు కేటీఆర్, హరీష్ రావులు తిన్నది ప్రజల రక్తం కూడు అని ఆరోపించారు. ప్రజల రక్తమాంసాలతో రూ.1 లక్ష కోట్లు సంపాదించారన్నారు. ఉపయోగపడే భవనాలను కూల్చి కొత్తవి కట్టారు… అది ఆస్తి సృష్టించడం అని చెప్పుకుంటున్నారని విమర్శించారు. అసెంబ్లీలో కూడా బావాబావమరుదులు తప్ప మిగతా వారికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదని విమర్శించారు.
అసెంబ్లీలో చెప్పుకోవడానికి వారికి ఏ అంశమూ లేదని, అందుకే బయట చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఐటీఐఆర్ వెనక్కి వెళ్లిన, సైనిక్ స్కూల్ గురించి అడగని వినోద్ కుమార్ బుల్లెట్ ట్రైన్ గురించి తమకు నీతులు చెబుతారా…అంటూ సీఎం ఎద్దేవా చేశారు. రైతు బంధు పథకంపై వొస్తున్న వార్తలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ..కేసీఆర్..బీఆర్
టీఎస్పీఎస్సీ ఛైర్మన్ లేకుండా పరీక్షల ప్రక్రియ జరగదని, టీఎస్పీఎస్సీ సభ్యులు ఇప్పటికే రాజీనామాలు సమర్పించారని, గవర్నర్ నిర్ణయం తీసుకున్న వెంటనే కొత్త కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం జాబ్ కాలెండర్ మేరకు ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. ఏడాదిలోగా నోటిఫికేషన్లు విడుదల, రిక్రూట్మెంట్ ప్రక్రియ భర్తీ చేస్తామని నిరుద్యోగులకు సీఎం భరోసానిచ్చారు. మేడిగడ్డకు సంబంధించి న్యాయ విచారణ జరుగుతుందని, విచారణ తర్వాత ఎల్ అండ్ టీ, అధికారుల పాత్ర ఏమిటనేది తేలుతుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విజయవంతమైందని, ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్ల పరిస్థితిని ముందే ఊహించామని, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందజేసి ఆదుకుంటామన్నారు సిఎం. నిధులు దుర్వినియోగం కాకుండా చూస్తే పథకాలకు ఉపయోగపడుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఒకప్పుడు సచివాలయం అంటే ఏదో తెలియదని, సచివాలయం లోపల మీడియా సమావేశం ఉంటుందని ఎవరైనా ఊహించారా అని అడిగారు. ఇక మీదట సెక్రటేరియెట్‌లో మీడియా సెంటర్ ఉంటుందన్నారు. మంత్రులు, అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు.





