కాంగ్రెస్ నాయకులు బాధ్యతారాహిత్యంగా ఏదితోస్తే అదే మాట్లాడుతున్నరు
రాష్ట్రం ఏర్పడిన నాడు ఉన్న ఇబ్బందులను ఒక్కొక్కటి అధిగమిస్తూ ముందుకెళ్లినం
ఇప్పుడు దేశంలోనే తలసరి ఆదాయంలో నెం. 1 స్థానంలో తెలంగాణ
కారు గుర్తుకు వోటేసి మంచిరెడ్డి కిషన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి
ఇబ్రహీంపట్నం ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం కేసీఆర్
ఇబ్రహీంపట్నం, ప్రజాతంత్ర, నవంబర్ 14 : ఎన్నికలొస్తే..పెద్దగా హడావుడి, అబద్ధాలు, అలవికాని వాగ్ధానాలు, తర్వాత నెరవేర్చక పోవడాలు, ప్రజలు అశాంతికి గురవ్వడం లాంటివన్నీ జరుగుతావున్నయ్. ఎన్నికల్లో నిలబడే అభ్యర్థుల గుణగణాలతో పాటుగా ముఖ్యంగా అభ్యర్థుల వెనుకున్న పార్టీల గత చరిత్రను చూడాలని.. ఆయా పార్టీలు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రజల పట్ల వారి వైఖరిని చూడాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మంగళవారం ఇబ్రహీంపట్నం ‘ప్రజా ఆశీర్వాద సభ’లో కేసీఆర్ మాట్లాడుతూ… ప్రపంచంలో రాజకీయ పరిణతి సాధించిన దేశాల్లోనే వేగంగా అభివృద్ధి జరుగుతున్నది. మనదేశంలో ఇంకా రావాల్సిన అవసరముందన్నారు. తెలంగాణ హక్కులు, రాష్ట్ర ఏర్పాటు, ప్రజల కోసమే పుట్టిన పార్టీ బీఆర్‌ఎస్. దేశంలో, రాష్ట్రంలో 50 ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేసినవాటిని..పదేండ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని బేరీజు వేసుకోవాలి..2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్‌ఎస్ అధికారంలోకి వొచ్చిన్నాడు రాష్ట్ర పరిస్థితులు అంతా గందరగోళంగా ఉన్నాయి. నాడు కరెంటు లేదు..మంచినీళ్లు, సాగునీళ్లు లేవు. పరిశ్రమలు కరెంటు లేక మూతపడే ఇబ్బందికర పరిస్థితులు ఉండేవి. నాడు రైతులు ఆకలిచావులకు గురయ్యేది. భూదాన్ పోచంపల్లి, సిరిసిల్ల, దుబ్బాకలలో చేనేత కార్మికులు డజన్ల కొద్దీ ఆత్మహత్యలు చేసుకునేటోళ్లు.
మేం వెళ్లి ఓదార్చి ఏడ్చేవాళ్లం. నాడు మహబూబ్ నగర్ జిల్లా నుంచి దాదాపు 15 లక్షల మంది బొంబాయి తదితర ప్రాంతాలకు వలసలకు పోయేది. స్వరాష్ట్రంలో మొదట రైతులు బాగుండాలంటే..వ్యవసాయ స్థిరీకరణ జరగాలని నిర్ణయించాం. దానికోసం కావాల్సిన అన్నింటినీ అమలు చేసాం. నాడు 40, 70, 200 రూపాయలున్న పెన్షన్‌ను మొదట వెయ్యికి, తర్వాత రెండు వేలకు పెంచి ఇస్తున్నదే బీఆర్‌ఎస్ సర్కారు, కేసీఆర్. దానిని ఎన్నికల తర్వాత ఐదు వేలకు పెంచుకుంటాం. అనుకోకుండా విధివంచితులైన వారు రెండు పూటలా మంచిగ తిని ఉండేలా పెన్షన్లనివ్వాలని 2014 లో అధికారులతో చెప్పి వెయ్యి రూపాయలుగా చేసినం. భారతదేశంలో పెన్షన్లను వేల రూపాయలకు పెంచిందే బీఆర్‌ఎస్ ప్రభుత్వం. కళ్యాణ లక్ష్మిని మొదట యాభై వేలకు, తర్వాత 75 వేలకు, తర్వాత లక్షా పదహారులకు పెంచుకొని ఆడబిడ్డల పెండ్లిండ్లకు ఇస్తున్నాం. విదేశాల్లో ఉన్నత విద్యా సంస్థల్లో సీట్లు వచ్చిన పేద పిల్లలకు రూ.20 లక్షల స్కాలర్షిప్స్ ఇచ్చి వేలాది మందికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేయూతనిచ్చింది. ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ పెట్టుకున్నాం. రంగారెడ్డి జిల్లా కోటాలో వచ్చిన మెడికల్ కాలేజీ ఇబ్రహీంపట్నంకే వచ్చింది. నా దగ్గర పట్టుబట్టి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డియే తెచ్చాడు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం మొదటగా 1,019 రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టుకొని, తర్వాత రెసిడెన్షియల్ కాలేజీలుగా మార్చుకున్నం. 
మన తెలంగాణలో తప్ప భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 1,019 రెసిడెన్షియల్ కాలేజీలు లేవు. ఒక దేశం లేదా రాష్ట్రం అభివృద్ధికి చూసే గీటురాయి..తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగం. నేడు తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయం రూ.3,18,000 లతో ఇండియాలోనే నంబర్ వన్ గా ఉంది. తెలంగాణ వచ్చిన్నాడు తలసరి విద్యుత్ వినియోగం 1140 యూనిట్లు ఉంటే, ఇవ్వాల 2200 యూనిట్లకు చేరుకొని దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ఇబ్రహీంపట్నం చెరువు ఎడారిగా ఉంటే మెట్రో వాటర్ తో చెరువును నింపాం. రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు, ముఖ్యంగా ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాలకు ఖచ్చితంగా కృష్ణానది నీళ్లు రావాలి. పాలమూరు-రంగారెడ్డి పథకం పెడితే దానిమీద కాంగ్రెస్ నాయకులు 1096 కేసులను వేసిండ్రు. గ్రీన్ ట్రిబ్యునల్, హైకోర్టులంటూ..కాలికి పెడితే మెడకు పెట్టి..మెడకు పెడితే కాలికి పెట్టి ఆపారు. అన్నింటినీ అధగమించి ఇటీవలే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం స్విచ్ కూడా ఆన్ చేసిన.
మునుగోడు రిజర్వాయర్ నుంచి ఇబ్రహీంపట్నంకు నీళ్లొస్తే ఒక లక్ష ఎకరాలకు పారుతుంది. రైతు బంధు పథకాన్ని పుట్టించిందే కేసీఆర్, బీఆర్‌ఎస్ ప్రభుత్వం. ఈ పథకం దేశంలో, ప్రపంచంలో ఎక్కడా లేదు. నీటి తీరువా లేకుండా చేయడమే కాదు..గతంలోని పాత బకాయిలనూ రద్దు చేసినం. రాష్ట్రం ఏర్పడిన ఏడాదిన్నరలోనే 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ను మన ప్రభుత్వం అందిస్తున్నది. గుంట, రెండు గుంటల భూమి ఉన్న రైతు కూడా దురదృష్టవశాత్తు మరణిస్తే రూ.5 లక్షలు అందేలా రైతు బీమాను అందిస్తున్నాం. ధరణి రాకముందు రైతుల భూములపై అధికారులు, దళారీలు, పైరవీకారుల చేతుల్లో ఉండేది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుల బొటనవ్రేలికే తమ భూములపై అధికారాన్ని కట్టబెట్టింది. ఇవ్వాల పెరిగిన భూముల ధరలతో ధరణి లేకుంటే.. అధికారులు, దళారుల చేసే అవకతవకలకు ఎన్నో ఘోరాలు, హత్యలు జరగుతుండె.. రైతుబంధు, రైతు బీమా, ధాన్యం కొన్న డబ్బులు రైతుల అకౌంట్లలోకి ధరణి వల్లనే వస్తున్నయ్. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ధరణి తీసి బంగాళా ఖాతంలో వేస్తామని కాంగ్రెస్ నాయకులు రాహూల్ గాంధీ, పిసిసి అధ్యక్షుడు, సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్కలు అంటున్నరు. ధరణి తీసేస్తే పైరవీకారులు, దళారులు వచ్చేస్తరు.
కేసులు, కోర్టుల చుట్టూ తిరిగి ప్రజలు లక్షల రూపాయలు ఖర్చుపెట్టుకోవాలి. ధరణి ఉండాలంటే ఇబ్రహీంపట్నంలో మంచిరెడ్డి కిషన్ రెడ్డి గెలవాలి. కాంగ్రెస్ పిసిసి మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతు బంధు దుబారా అంటడు. మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఎమ్మెల్యే అయితేనే ప్రభుత్వం ఏర్పడి రైతు బంధు అందరికీ వస్తది. పిసిసి అధ్యక్షుడు రైతులకు కేసీఆర్ వేస్ట్ గ 24 గంటల కరెంటు ఇస్తున్నడంటున్నడు. రైతులకు 3 హెచ్.పి. లేదా 5 హెచ్.పి. మోటార్ మాత్రమే ఉంటది. మరి తెలంగాణలో ఉన్న 30 లక్షల 10 హెచ్.పి. మోటార్లను ఎవరు కొనిస్తరు? కాంగ్రెస్ నాయకులు బాధ్యతారాహిత్యంగా ఏదితోస్తే అదే మాట్లాడుతున్నరు. ప్రధాని మోదీ మోటార్లకు మీటర్లు పెట్టమంటే నేను సచ్చినా పెట్టలేదు. దాంతో రాష్ట్రానికి రావాల్సిన రూ.25 కోట్లను ఎగ్గొట్టిండ్రు. ఒక్క నవోదయ పాఠశాల, ఒక్క మెడికల్ కాలేజీని కూడా తెలంగాణకు ఇవ్వని బీజేపీ పార్టీకి వోట్లు ఎందుకు వేయాలి? పొరపాటున కాంగ్రెస్ వస్తే కేసీఆర్ కూడా చేసేదేముంటది. కాంగ్రెసోల్లు బహిరంగంగానే అంటున్నరు జాగ్రత్త. దళిత బంధును దేశంలో ఎవరన్నా ఆలోచించిండ్రా? ఎవరన్నా పెట్టిండ్రా? భారతదేశంలో ఎవ్వరూ చేయని విధంగా మన బీఆర్‌ఎస్ ప్రభుత్వం మానవీయ కోణంలో ఎన్నో కార్యక్రమాలను చేసింది. కంటి వెలుగు, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, అమ్మవొడి లాంటి మానవీయ పథకాలెన్నో విజయవంతంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్నది. సుమారు రూ.700 కోట్లతో ఇబ్రహీంపట్నంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి రోడ్లను వేశాడు. రింగురోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు, కలెక్టరేట్, పండ్ల మార్కెట్, ఫాక్స్ కన్ ఇండస్ట్రీ మన ఇబ్రహీం పట్నం నియోజకవర్గంలోనే వచ్చినయ్..వస్తున్నయ్. ఇబ్రహీంపట్నం ముఖచిత్రమే మారిపోనున్నది. కారు గుర్తుకు వోటేసి మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఎమ్మెల్యే గా భారీ మెజార్టీతో గెలిపించాలని సీఎం కేసీఆర్ కోరారు.




