- రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు
- బీజేపీ, ప్రధాని మోడీపై తనదైన శైలిలో మంత్రి కేటీఆర్ సెటైర్లు
- నర్సంపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
- ఎర్రటెండలో భారీగా హాజరైన జనం
నర్సంపేట,ప్రజాతంత్ర, ఏప్రిల్ 20, :
తెలంగాణలోని 119 నియోజకవర్గాలు ఉండగా ఎక్కడ లేని విధంగా నర్సంపేటలో తక్కువ ధరలో ఇంటింటికీ వంట గ్యాస్ కనెక్షన్ ఇచ్చి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కొత్త చరిత్ర సృష్టించినట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. మంత్రి కేటీఆర్ బుధవారం నర్సంపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసారు. నర్సంపేటలో నూతనంగా నిర్మించిన గ్రంథాలయం, కూరగాయల మార్కెట్, ఇంటింటికీ గ్యాస్ లైన్‌ని ప్రారంభించారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరయ్యారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన బహిరంగ సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. నర్సంపేట పట్టణ అభివృద్ధి పనుల కోసం రూ.50 కోట్లు కేటాయించారు. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న 2వేల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు మరో మూడు వేలు కలిపి మొత్తంగా ఐదు వేల ఇళ్లు త్వరలో మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే పెద్ది కార్యకర్త, సర్పంచ్, జడ్పీటీసీ నుండి ఎమ్మెల్యే అయ్యి పేద ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్నాడన్నారు.
100కోట్ల పై చిలుకు నిధులను మంజూరు చేయించుకొని నర్సంపేటలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఎక్కడ కలిసిన నర్సంపేట అభివృద్ధి గురించే ఎమ్మెల్యే మాట్లాడుతారన్నారు. 22 వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన నాయకుడు కేసీఆర్ అన్నారు. నర్సంపేట నియోజకవర్గంలో పెద్ది సుదర్శన్ రెడ్డి అడిగిన ఎటువంటి పరిశ్రమలను తీసుకువచ్చే ప్రభుత్వం టిఆర్‌ఎస్ ప్రభుత్వం అని సభాముఖంగా తెలియజేస్తున్నానన్నారు.14 ఏళ్ళ పాటు కొట్లాడి రోడ్ లకి ఎక్కి రాష్ట్రాన్ని సాధించుకున్నాం అన్నారు. బంగారు తెలంగాణ కోసం ఒక్కో అడుగు వేసుకుంటూ పోతున్నాం అని తెలిపారు. 75 ఏళ్ళ భారత దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఇంటి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చిన ఘనత మన తెలంగాణది అన్నారు. కెసిఆర్ ప్రభుత్వం వచ్చాక నర్సంపేటలో 2 ఇరిగేషన్ ప్రాజెక్ట్ లను మంజూరు చేసుకొని 670 కోట్ల రూపాయలను వెచ్చించి 60 వేల ఎకరాలకి నీళ్లు ఇచ్చాం అన్నారు. ఎవరైనా చనిపోతే దహన సంస్కారాల కోసం కరెంట్ ఉండక పోయేది…నీళ్ల కోసం స్మశాన వాటిక దగ్గర ఆడుక్కునే పరిస్థితి గతం లో ఉండేదన్నారు. 24 గంటలు కరెంట్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమే అన్నారు.
ఒక్కో రైతుకి పెట్టుబడి సాయంగా 5 వేల రూపాయలు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. నర్సంపేటలో పసుపు, పత్తి, మిర్చి బాగా పండుద్ది.. వివిధ పంటల కోసం త్వరలో ఆహార శుద్ధి ఫ్యాక్టరీ ఇస్తామని చెప్పారు. ఫుడ్ ప్రాసెస్సింగ్ కింద భూములు పోయిన రైతులకు రూ.10 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 6-10 తరగతుల్లో చదువుతున్న 6200 మంది విద్యార్థులకు సోలార్ లైట్లను అందజేశారు.
కేటీఆర్ బీజేపీ, ప్రధాని మోడీ పై తనదైన శైలిలో సెటైర్లు
కేటీఆర్ బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగట్టారు. దేశంలో జనాలు బ్యాంకులో టక టక ఖాతా తెరవండి బ్యాంక్ ఖాతాల్లో ధనా ధన్ రు.15 లక్షలు ఏస్తామని ప్రగల్భాలు పలికిన మోడీ జనాలకు మొండి చెయ్యి చూపారని అన్నారు. విదేశాల్లో నల్ల డబ్బు వెలికి తీస్తామని చెప్పి వారికి అండగా నిలుస్తున్నారు అన్నారు. తెలంగాణలోనే మొట్ట మొదటి సారిగా నర్సంపేట పట్టణానికి గ్యాస్ పైప్‌లైన్ ద్వారా సరఫరా చేసే పక్రియకి శ్రీకారం చుట్టామన్నారు. ఈ రోజు తన చేతుల మీదుగా ప్రారంభించడం గర్వ కారణం అన్నారు. గ్యాస్ ధర రూ.400 ఉన్నప్పుడు గగ్గోలు పెట్టిన మోడీ నేడు గ్యాస్ ధరను రూ.1000 కి పెంచాడని ఎద్దేవా చేశారు. ఇప్పటికే వృద్ధులకు రూ. 200 నుండి రూ. 2000 కి పెంచిన ఘనత కేసీఆర్‌కి దక్కుతుందన్నారు.
త్వరలోనే కొత్తగా అర్జీ చేసిన అందరికి పెన్షన్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ గత 70 ఏళ్ళ రాజకీయ చరిత్ర లో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి జరి•గిందన్నారు. ఏ రాష్ట్రం లో ఎక్కడ లేనివిధం గా మన రాష్ట్రం లో పేద వారిని దృష్టిలో పెట్టుకొని పెన్షన్ పెంచామన్నారు. గత ప్రభుత్వాల హయాంలో మహిళల ఆర్ధిక పరిస్థితి ఘోరం గా ఉండేదన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ముఖ్య మంత్రి అయ్యాక ఒక్కొక్కరికి 3 లక్ష ల రూపాయలను స్త్రీ నిధి ద్వారా ఆర్ధిక సహాయం చేసారు. దీనితో ఆడవారికి ఎంతో గౌరవం దక్కుతోంది అని తెలిపారు. మన ముఖ్య మంత్రి లాంటి వ్యక్తి దేశం లో ఎక్కడ లేరన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధర కేంద్ర ప్రభుత్వం పెంచి పేద వర్గాల ప్రజలను ఇబ్బంది పెడుతోంది అని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులు బాగు పడ్డారన్నారు.
నియోజకవర్గ అభివృద్ధి కోసం శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఎంతో కష్ట పడుతున్నారని చెప్పారు. మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. నర్సంపేట నియోజకవర్గం అభివృద్ధి పథంలో తీసుకు పోవడానికి అహర్నిశలు కృషి చేస్తున్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి అభినందనలు తెలిపారు. నర్సంపేట నియోజకవర్గంలో మొదటిదశలో 12600 కుటుంబాలకు 30 శాతం తక్కువ ధరలతో పైపుడ్ న్యాచురల్ గ్యాస్ ని ప్రారంభించడం చాలా ఆనందించదగ్గ విషయం అన్నారు. ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ముగింపు ఉత్సవాల్లో కేటీఆర్ రావాలని నేను వారిని అడిగిన వెంటనే వారు ఒప్పుకొని ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషించదగ్గ విషయం అన్నారు. చెన్నరావుపేట మరియు దుగ్గొండి మండలాల్లో మహిళా సమైక్య బిల్లింగ్డ్ లు ఇంతవరకు లేవు. కానీ ఈరోజు వాటిని మంజూరు చేసుకొని కేటీఆర్ సమక్షంలో ఆ భవనాలను మనం ప్రారంభించుకున్నాము అని తెలిపారు. నర్సంపేట మోడల్ సిటీ అభివృద్ధి కోసం మీరు 35 కోట్ల రూపాయలను నర్సంపేటకు అందజేశారు.
అదేవిధంగా నర్సంపేటలో లైబ్రరీ బిల్లింగ్డ్ కూడా నేడు కేటీఆర్ చేతుల మీదుగా ఈ రోజు ప్రారంభించడం జరిగింది అన్నారు. నర్సంపేట నియోజకవర్గంలో ఇప్పటివరకు 52 గ్రామ పంచాయతీలకు బిటి రోడ్లు లేవు, వాటికి నిధులను మంజూరు చేయవలసిందిగా కోరుచున్నా మన్నారు. మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచుతూ ఉంటే కేటీఆర్ ఆ బాధను చూసి నర్సంపేట ప్రజల కోసం నేచురల్ పైపుడ్ గ్యాస్ లైన్ ప్రారంభించడం చాలా సంతోషించదగ్గ విషయం అన్నారు. వరంగల్ జిల్లా చైర్ పర్సన్ గండ్ర జ్యోతి మాట్లాడుతూ.. నిరంతరం కష్టపడే తత్వం ఉన్నటువంటి కేటీఆర్ కి ఈ రాష్ట్ర ప్రజలు, నర్సంపేట నియోజకవర్గ ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారు అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళ దినోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే నిర్వహించిన మహిళా క్రీడల పోటీలలో గెలుపొందిన మహిళకు కేటీఆర్ చేతుల మీదుగా బహుమతులను అందచేశారు.
అదేవిధంగా గ్యాస్ కనెక్షన్ ప్రారంభించిన అనంతరం మెగా గ్యాస్ కంపెనీ ఆధ్వర్యంలో మొక్కను నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ గోపి, సోషల్ మీడియా రాష్ట్ర కోఆర్డినేటర్ సతీష్ రెడ్డి, ఓడిసిఎంఎస్ చైర్మన్ రామస్వామి నాయక్, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్, జిల్లా జెడ్పి ఫ్లోర్ లీడర్, మండల పార్టీ అధ్యక్షులు, పట్టణ పార్టీ అద్యక్షులు, ఎంపిపిలు, జెడ్పిటిసిలు, ఎంపిటిసిలు, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్లు, సర్పంచ్ లు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.