హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 1 : ‘టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్…తీగలాగితే ప్రగతిభవన్ డొంక కదిలిందా?.. విచారణలో ‘బావ’.. తెలంగాణ సీఎంవోలో బావమరిది?.. వి•కు అర్థం అవుతుందా పరువు గల కేటీఆర్ గారూ…?’ అంటూ టిఎస్‌పిఎస్‌సి విచారణలో పురోగతిపై పిసిసి చీఫ్ రేవంత్ ట్వీట్ చేశారు.టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో సెక్రటరీ అనితా రామచంద్రన్, కమిటీ సభ్యుడు లింగారెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసిన క్రమంలో టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ ఘటనపై రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ సెటైర్ విసిరారు. ట్వీట్‌తో పాటు టీఎస్‌పీఎఎస్సీ కమిటీ సభ్యుడు లింగారెడ్డి బయోడేటాను జతచేస్తూ రేవంత్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం రేవంత్ ట్వీట్ వైరల్‌గా మారింది. అసలు రేవంత్ ట్వీట్ చేసి బావా.. బావమర్ధులు ఎవరనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. ట్వీట్‌లో రేవంత్ ప్రస్తావించిన ఈ బావా బావమర్దుల్లో ఒకరు గతంలో సీఎంవోలో పనిచేసిన ఒక రిటైర్డ్ ఐఆర్‌ఎస్ అధికారి అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తుంది.
పేపర్ లీకేజ్ కేసులో సిట్ నోటీసులు అందుకున్న టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ సిట్ విచారణకు హాజరయ్యారు. దాదాపు రెండు గంటల పాటు అనితను సిట్ అధికారులు విచారించారు. ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ప్రవీణ్… అనితా రామచంద్రన్ వద్ద పీఏగా పనిచేశాడు. ఈ క్రమంలో ప్రవీణ్‌కు సంబంధించిన అంశాలతో పాటు టీఎస్‌ఎస్సీలోని అడ్మినిస్ట్రేషన్, కాన్ఫిడెన్షియల్ విభాగంపై స్టేట్మెంట్‌ను సిట్ రికార్డు చేసింది. అలాగే టీఎస్‌పీఎఎస్సీ కమిటీ సభ్యుడు లింగారెడ్డికి కూడా సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం కస్టడీలో ఉన్న రమేష్.. డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా, లింగారెడ్డికి పీఏగా పనిచేశాడు. ఈ నేపథ్యంలో రమేష్‌కు లింగారెడ్డికి ఉన్న సాన్నిహిత్యంపై సిట్ అధికారులు విచారించనున్నారు.