- ప్రజారోగ్యం బాగుండాలన్నదే తపనగా ఉండాలె…
- ప్రయివేటు దవాఖానల్లో వైద్య ఖర్చులు తగ్గించకుంటే లైసెన్స్ రద్దు
- పని చేసే వారికి ప్రోత్సాహం..పని చేయని వారిపై చర్యలు
- సిద్ధిపేటలో ఆశా వర్కర్లకు మొబైల్ సెల్‌ఫోన్ల పంపిణీలో మంత్రి హరీష్‌రావు
సిద్ధిపేట, ఏప్రిల్ 9(ప్రజాతంత్ర బ్యూరో) : ప్రజలు దవాఖానలకు రాకుండా ఉంటేనే ఆనందం. ప్రజారోగ్యం బాగుండాలన్నదే మన తపనగా ఉండాలని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఆశా వర్కర్లకు సూచించారు. శనివారం జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని విపంచి ఆడిటోరియంలో ఆశా వర్కర్లకు మొబైల్ సెల్‌ఫోన్లను జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణశర్మ, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి మంత్రి హరీష్‌రావు పంపిణీ చేసిన అనంతరం మాట్లాడుతూ… తన ఆలోచనలు పంచుకోవాలని ఉందనీ, డాక్టర్ అవతరమెత్తి వైద్య అంశాలు ఒక్కొక్కటిగా చెబుతూ.. వైద్య రంగంలో చాలా వసతులు తేవాలని మంత్రి హరీష్‌రావు ఆశా వర్కర్లకు దిశానిర్దేశం చేశారు. క్షేత్ర స్థాయిలో పని బాగుండాలనీ, గ్రామాల్లో ఆరోగ్య పరిరక్షకులు మీరే, గ్రామ ప్రజలకు మీరే బాధ్యులు, మీరే బాధ్యతగా ఉండాలన్నారు.
27 వేల మంది ఆశ కార్యకర్తలుగా మీరు బలోపేతమైతే వైద్య శాఖ బాగుంటుందనీ, ఇంటింటికి జ్వర సర్వే చేశాం, కేంద్రం మెచ్చుకుంది. అందరికీ మనమే ఆదర్శం జ్వర సర్వే సూపర్ హిట్ అన్నారు. కొరోనా రాక ముందే కోటి కిట్స్ అందుబాటులో పెట్టుకుని, 2 కోట్ల టెస్టింగ్ కిట్స్ పెట్టుకున్నామన్నారు. పనిచేసే వారికి ప్రోత్సహం ఉంటుందని, రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రతి ఆరు నెలలకొకసారి సన్మానం చేస్తామనీ జిల్లాకు చెందిన ఆశ వర్కర్ మంజులను హైదరాబాద్‌లో సన్మానించామనీ చెబుతూ ప్రతి ఒక్క కార్యకర్త పనిలో పోటీ పడాలని ఆశాలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 5500 హెల్త్ సబ్ సెంటర్లు ఉన్నాయని, వాటిలో 202 బాగా లేవని, వాటి పరిధిలో 80 శాతం ప్రయివేటు దవాఖానలలో ప్రసవాలు చాలా బాధాకరమని పద్ధతి మార్చుకోవాలని ఆశాలకు సూచించారు. ఆదిలాబాద్ జిల్లా బోధన్‌లో అమ్మ ఒడి సమస్యలు పరిష్కారం చేసామనీ, క్షేత్ర స్థాయిలో మాట్లాడం వల్ల సమస్యలు తన దృష్టికి వొస్తాయన్నారు.
సిద్దిపేటలో 40 శాతం ప్రయివేటు దవాఖానలకు వెళ్లడం బాధగా ఉందనీ, ఎవరి పరిధిలో ప్రయివేటు దవాఖనకు ప్రసవం వెళ్లడంపై ఆరా తీస్తున్నామనీ, లోపాన్ని సరిద్దిదేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 75 శాతం గర్భిణీలు ప్రభుత్వ దవాఖానకు ప్రసవం కోసం రావాలనీ, అప్పుడే అనుకున్న లక్ష్యం సాధించినట్టన్నారు. ప్రభుత్వ దవాఖానలో భోజన వసతి ఉంది. ప్రాథమిక దవాఖాన సిబ్బంది చిత్తశుద్ధితో పని చేయాలి. డాక్టర్లు పని విధానంలో మార్పు తెద్దాం. లోపం సరిద్దిదుకుని వైద్య రంగాన్ని మార్చుదామన్నారు. రాష్ట్రంలో పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించే బాధ్యత నాది అని, సిఎం కేసీఆర్ ఆశీస్సులు ఉన్నాయని, 11 వేల కోట్లు బడ్జెట్ పెట్టామనీ, జవాబుదారీ తనం పెంచుదామని ఆశాలకు పిలుపునిచ్చారు.
తెలంగాణ సీ సెక్షన్ల ఆపరేషన్లు సంఖ్య బాధ అనిపిస్తుంది. మూలం తెలుసుకునే ప్రయత్నం చేసి మారుద్దామన్నారు. ఆపరేషన్లతో భవిష్యత్‌లో చాలా ఇబ్బందులు వొచ్చే అవకాశం ఉందని, మొదటి గంటలో ముర్రు పాలు అమృతంతో సమానమని, రోగ నిరోధక శక్తి అందక చిన్న పిల్లలు పుట్టిన పది రోజుల పాటు సమస్యలు ఎదుర్కుంటున్నారని ఇవన్నీ ఆశాలు క్షేత్రస్థాయిలో వివరించాలని, ముర్రు పాలు గురించి ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ప్రయివేటు దవాఖానాలో వైద్య ఖర్చులు తగ్గించకుంటే లైసెన్స్ రద్దు చేస్తామని మంత్రి హరీష్‌రావు హెచ్చరించారు. ప్రభుత్వ దవాఖానలో విధులు సరిగ్గా చేయకుంటే కఠిన చర్యలు తీసుకునేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీని కోసం అందరూ ప్రయత్నాలు చేయాలనీ అప్పుడే సాధ్యమవుతుందన్నారు.
గత 40 ఏండ్లుగా రోగం లెక్క ఉందనీ, దానిని బద్ధలు కొట్టాలని ఒకటి ప్రభుత్వ దవాఖానలలో ప్రసవాలు, నార్మల్ డెలివరీ జరగాలన్నారు. తల్లులను కాపాడుకుందాం. సిద్దిపేటలో మార్పు జరిగితే రాష్ట్రం మొత్తంగా చేద్దాం. అందుకు మీ సహకారం అవసరమన్నారు. ప్రభుత్వ దవాఖానలలో వసతులు కోసం నిధులు అందుబాటులో పెట్టామనీ, త్వరలోనే దుబ్బాక, హుస్నాబాద్ డయాలసిస్ సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల కంటే తెలంగాణలో ఆశా కార్యకర్తలకు ఎక్కువ వేతనాలు ఇస్తున్నామనీ, రోగమొస్తే నయం చేయడం కంటే రోగం రాకుండా చూసుకునే బాధ్యత మీదేననీ ఆశా వర్కర్లను కోరారు. క్షేత్ర స్థాయిలో పనిచేసే ప్రజల వారధులు ఆశాకార్యకర్తలుగా మీరేననీ, బాగా పనిచేసే వారిని గుర్తించి ప్రతి ఆరు నెలలకొకసారి తగిన పారితోషికం ఇస్తామనీ, పని చేయని వారిని ఎవరైనా ఉపేక్షించేది లేదన్నారు.
రాబోయే రోజుల్లో రూపాయి ఖర్చు లేకుండా సిద్దిపేట ప్రభుత్వ దవాఖవనలో రేడియో, కిమో థెరపీ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఇటీవల థర్డ్ పార్టీ ద్వారా సర్వే చేయిస్తే 48శాతం ఉచితంగా ఇచ్చే గోళీలు వాడడం లేదనీ, ప్రజల్లో మందులు వాడటంపై నమ్మకం పెంచాన్నారు. ప్రజలకు సేవకులం చిత్తశుద్ధితో పనిచేద్దాం. మార్పు సిద్దిపేట నుంచి మొదలు కావాలి. మార్పు కోసం అందరం కలిసి పనిచేద్దామని హరీష్‌రావు కోరారు. సిఎం కేసీఆర్ న్యూట్రీషన్ కిట్ పేరిట తొమ్మిది జిల్లాలో అమలు చేస్తున్నామనీ, త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు మంత్రి హరీష్‌రావు తెలిపారు.