హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20 : అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినా దేశంలో పెట్రో ధరలు పెరిగిపోతుండటంపై ప్రధాని నరేంద్రమోదీకి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా సూటి ప్రశ్న వేశారు. 2014లో బీజేపీ అధికారంలోకి వొచ్చినప్పుడు క్రూడాయిల్ ధర ఎక్కువగా ఉన్నా పెట్రో ధరలు తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం క్రూడాయిల్ ధరలు తక్కువగా ఉన్నప్పటికీ పెట్రో ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఇలా క్రూడ్ ధర తగ్గినా పెట్రో ధరలు ఎందుకు పెంచుతున్నారని, ఈ పెంపుతో ఎవరికి ప్రయోజనమని కేటీఆర్ ప్రశ్నించారు. ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్న ఇంధర ధరలపై ప్రధాని నరేంద్ర మోదీజీకి సూటి ప్రశ్న’ అంటూ కేటీఆర్ తన ట్వీట్‌ను మొదలుపెట్టారు.
దాని కిందనే 2014 మే నెలలో ఒక బ్యారెల్ ముడి చమురు ధర 107 డాలర్‌లు ఉంటే లీటర్ పెట్రోల్ ధర రూ.71 ఉన్నదని.. 2023 మార్చి నాటికి బ్యారెల్ క్రూడాయిల్ ధర 65 డాలర్‌లకు తగ్గినా లీటర్ పెట్రోల్ ధర రూ.110కి పెరిగిందనే విషయాన్ని ప్రస్తావించారు. ఆ తర్వాత లైన్‌లో ‘క్రూడాయిల్ ధర పెరిగినప్పుడు దేశంలో ఇంధన ధరలను పెంచాల్సి వొస్తే.. క్రూడాయిల్ ధర తగ్గినప్పుడు ఇంధన ధరలను తగ్గించ కూడదా..?’ అని ప్రశ్నించారు. ఆ వెంటనే ‘ఈ పెంపుతో ఎవరికి ప్రయోజనం..?’ అంటూ మరో ప్రశ్న వేశారు. అదే విధంగా 2014, 2023 సంవత్సరాల్లో క్రూడాయిల్, ఇంధన ధరల హెచ్చుతగ్గులను పోల్చిచూపుతున్న కొన్ని గ్రాఫ్‌లను కేటీఆర్ తన ట్వీట్‌కు జతచేశారు.