పెంచిన పెట్రో ధరలు, కరెంట్‌ ‌ఛార్జీలను వెంటనే తగ్గించాలి

  • డిమాండ్‌ ‌చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆం‌దోళన
  • పలు ప్రాంతాల్లో ధర్నాలు, రాస్తారోకోలు
  • సిలిండర్లకు దండలు వేసి ఊరేగింపు
  • భట్టి పాదయాత్రలో సిలిండర్‌కు దండవేసి మహిళల నిరసన
  • పెంచిన ధరలను తగ్గించేంత వరకు ప్రజలకు అండగా కాంగ్రెస్‌ : ‌సిద్ధిపేట జిల్లా డిసిసి ప్రెసిడెంటు తూంకుంట నర్సారెడ్డి

ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 31 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్‌, ‌డీజిల్‌, ‌గ్యాస్‌, ‌కరెంట్‌ ‌చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ ‌చేస్తూ గురువారం కాంగ్రెస్‌ ‌పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. ధరల పెంపును నిరసిస్తూ పలు చోట్ల ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. పలు జిల్లాల్లో సిలిండర్లకు దండలు వేసి నిరసనల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున నిరసనల్లో పాల్గొన్నారు. నారాయణ పేట జిల్లా కోస్గిలో..  శివాజీ చౌరస్తాలో గ్యాస్‌ ‌సిలిండర్‌కు పూల దండలు వేసి నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధరలు తగ్గించేవరకు ఆందోళనలు కొనసాగిస్తామన్నారు. పెట్రో, గ్యాస్‌, ‌కరెంట్‌ ‌చార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఎల్బీనగర్‌లో కాంగ్రెస్‌ ‌నేతలు ఆందోళనకు దిగారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్ని దోచుకుంటున్నాయని మండిపడ్డారు.

బీఎన్‌ ‌రెడ్డి నగర్‌ ‌నుంచి వనస్థలిపురం రెడ్‌ ‌ట్యాంక్‌ ‌వరకు ర్యాలీ తీశారు. పెంచిన ధరలు తగ్గించాలని డిమాండ్‌ ‌చేస్తూ…ఓ వ్యక్తికి గుండు కొట్టించి నిరసన తెలిపారు. వికారాబాద్‌ ‌జిల్లా బొంరాస్‌ ‌పేట మండలంలోని తుంకిమెట్లలో హైదరాబాద్‌- ‌బీజాపూర్‌ ‌జాతీయ రహదారిపై కాంగ్రెస్‌ ‌నాయకులు ధర్నాకు దిగారు. పెట్రోల్‌, ‌డీజిల్‌, ‌గ్యాస్‌ ‌ధరల పెంపుపై ఏఐసీసీ పిలుపుతో ఆందోళన నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి గ్యాస్‌ ‌సిలిండర్లు ముందు పెట్టుకుని నిరసన తెలిపారు. కాంగ్రెస్‌ ‌నాయకుల ఆందోళనతో హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

భట్టి పాదయాత్రలో సిలిండర్‌కు దండవేసి మహిళల నిరసన
ఖమ్మం, మార్చి 31 : ఖమ్మం జిల్లాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగుతుంది. ఇదే సందర్భంగా ఆయన పెట్రోల్‌, ‌డీజిల్‌, ‌గ్యాస్‌ ‌ధరల పెంపును నిరసిస్తూ ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన నిరసన కార్యక్రమానికి మద్దతు తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలోని చింతకాని మండలం పాతర్లపాడులో కాంగ్రెస్‌ ‌నేత పాదయాత్రలో మహిళా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో వినూత్నరీతిలో నిరసన తెలిపారు. మహిళలు గ్యాస్‌ ‌సిలిండర్లకు దండలు వేసి చావు డప్పు మోగిస్తూ నిరసనను తెలియజేశారు.

పెంచిన ధరలను తగ్గించేంత వరకు ప్రజలకు కాంగ్రెస్‌ అం‌డగా ఉంటుంది : సిద్ధిపేట జిల్లా డిసిసి ప్రెసిడెంటు తూంకుంట నర్సారెడ్డి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన నిత్యావసర ధరలను తగ్గించేంత వరకు ప్రజానికానికి కాంగ్రెస్‌ ‌పార్టీ పూర్తిగా అండగా ఉంటుందనీ సిద్ధిపేట జిల్లా కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షుడు, గజ్వేల్‌ ‌మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నారు. పెంచిన గ్యాస్‌ ‌ధరలను నిరసిస్తూ కాంగ్రెస్‌ ‌పార్టీ పిలుపు మురకు సిద్ధిపేట జిల్లా జగదేవ్‌పూర్‌లో గురువారం స్థానిక కాంగ్రెస్‌ ‌పార్టీ శ్రేణులు గ్యాస్‌ ‌సిలిండర్లకు పూలమాలలు వేసి నిరసన తెలిపాయి. ఈ నిరసనకు ముఖ్య అతిథిగా హాజరైన డిసిసి ప్రెసిడెంటు నర్సారెడ్డి మాట్లాడుతూ..కొరోనా  కష్టకాలంలో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రాష్ట్ర,  కేంద్ర ప్రభుత్వాలు ధరలను పెంచి ప్రజలను తీవ్ర కష్టాల్లోకి నెట్టివేస్తున్నాయన్నారు.  దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ,  అంబానీలకు దోచిపెడుతూ బిజెపి ప్రభుత్వం పేద ప్రజల కుటుంబాలను నష్టాల్లోకి నెట్టిందన్నారు.

పెంచిన ధరలతో సామాన్యుడు బతికే పరిస్థితి లేదని, అదేవిధంగా పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరల పెరుగుదలతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్య ప్రజానీకం పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిందని, పెంచిన ధరలను తగ్గించేంత వరకు కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రజానీకానికి అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జగదేవ్‌పూర్‌ ‌మండల కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షుడు కేశిరెడ్డి రవీందర్‌రెడ్డి, పిఏసిఎస్‌ ‌మాజీ ఛైర్మన్‌ ‌వంటేరు నరేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ ‌నేతలు చెరుకు లక్ష్మారెడ్డి, న్యాలమడుగు హన్మంతరెడ్డి, కొత్త నర్సింహారెడ్డి, మొగిలి జనార్ధన్‌రెడ్డి, కేశిరెడ్డి మహేందర్‌రెడ్డి, అజీజ్‌, ‌గుబ్బ శ్రీనివాస్‌గుప్తా, యాకుబ్‌, ‌గాల్‌రెడ్డి, అమర రాము, చారి, ధర్మారం మల్లేశం తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు పెంచిన ధరలకు నిరసనగా అంబేడ్కర్‌ ‌చౌరస్తా నుంచి  సబ్‌స్టేషన్‌ ‌వరకు భారీ ర్యాలీని చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page