పుస్తక పఠన కళను యువత నిర్లక్ష్యం చేస్తున్నారా…!

విశ్వ రహస్యాలను తెలుసుకోవడానికి, అంతరిక్ష గుట్టును విప్పడానికి, ప్రముఖుల జీవిత విశేషాలను అర్థం చేసుకోవడానికి, మన చూడని ప్రదేశాలను అక్షరయాత్రలో వీక్షించడానికి, మానవ నాగరికత పరిణామాన్ని తెలుసుకోవడానికి, జీవితాన్ని సుసంపన్నం చేసుకోవడానికి, మూర్తిమత్వం విరబూయడానికి, జీవన పోరాటంలో ఎదురు దెబ్బలను తట్టుకొని నడవడానికి, లక్ష్యాలను సునాయాసంగా ఛేదించడానికి, మన‌లోకి మనం తొంగి చూడడానికి, చీకటి దారుల్లో వెలుతురు మార్గాన్ని ఎన్నుకోవడానికి, నీ గూర్చి నువ్వు అవగాహన పరుచుకోవడానికి, మానవ జీవితాల్లో సంక్లిష్టతలను జీర్ణించుకోవడానికి, జీవిత పరమార్థాన్ని అర్థం చేసుకోవడానికి, విజ్ఞాన వివేకాలను సమపార్జించడానికి, ఊహా జగత్తులో విహరించడానికి, ఆలోచనాశక్తిని విస్తృత పరుచుకోవడానికి అందుబాటులో ఉన్న ఏకైక ఉత్తమ సాధనం పుస్తకాలను చదవలగడమే అని చరిత్ర నిరూపించింది. పుస్తక పఠన నైపుణ్యంతో వివిధ అంశాలను అధ్యయనం చేసి తెలియని విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకోవడం, మానసిక వికాస దిశగా అడుగులు వేయడం, అజ్ఞాన చీకట్ల నుంచి విజ్ఞాన వెలుగుల దిశగా పయనించడమే “పుస్తక పఠన కళ లేదా ఆర్ట్‌ ఆఫ్‌ రీడింగ్‌” అని అర్థం చేసుకోవాలి. మనకు వచ్చిన సందేహాలకు, అర్థవంతమైన ప్రశ్నలకు చక్కటి సమాధానాలను ప్రదానం చేసేదే పుస్తక పఠన కళ అవుతుంది.
పుస్తక పఠన ప్రయోజనాలు:
పుస్తకం చదవడం శ్వాస తీసుకోవడం లాంటిది. ఒక పుస్తకం, ఒక కలం, ఒక గురువు, ఒక బ్లాక్‌ బోర్డు అనేవి ప్రపంచాన్ని మార్చగలిగే మహత్తర శక్తిని కలిగి ఉంటాయి. సంపాదన కరిగి పోవచ్చు, భూములను కోల్పోవచ్చు, ధనాన్ని ఖర్చు చేయవచ్చు, కాని పుస్తకం ద్వారా నేర్చుకున్న విజ్ఞానం తరిగి పోలేని అపూర్వ శాశ్వత ఆస్తి అవుతుంది. పుస్తక పఠనంతో విజ్ఞాన వికాసం, వివేకం విప్పారడం, సమాచారం తెలుసుకోవడం, ఊహల రెక్కలు విచ్చుకోవడం, జీవితంలో కొత్త కోణాన్ని చూపించడం,కెరీర్‌ను మెరుగుపరుచుకోవడం, క్రమశిక్షణ పెంచుకోవడం, ఉన్నత ఉద్యోగాన్ని పొందేలా ఉపకరించడం, నూతన ఆలోచనలకు బీజాలు పడడం, చరిత్రను తెలుసుకోవడం, సామాజిక సంబంధాలను మెరుగుపరుచికోవడం, మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవడం, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం, పరిశోధనాత్మక ఊహాశక్తిని కలిగించడం, గొప్ప వారి జీవిత చరిత్రలు తెలుసుకోవడం, ఆకర్షణీయ వ్యక్తిగా ఎదగడం, పదజాల విస్తరణ, ఆశావహ దృక్పథాన్ని పెంచడం/మార్చి వేయడం, వినోదాలను అందించడం, విశ్రాంతి వేళ మంచి నేస్తంగా మారడం, స్ఫూర్తిని అందించడం, మెదడు వికసితం కావడం, స్వతంత్ర ఆలోచనామృత శక్తిని పెంపొందించడం, సత్యాన్ని శోధించడం, సృజనాత్మకత పెంచడం, విశ్లేషణాత్మక సామర్థ్యాన్ని పెంచడం లాంటి ప్రయోజనాలతో మనసుకు స్వేచ్ఛను కలిగించి సన్మార్గాన్ని చూపిస్తుంది. బహుముఖ మానసిక వికాసానికి, భాషలో పట్టు సాధించడానికి, పేరు ప్రఖ్యాతుల సంపాదనకు పుస్తక పఠనం దోహదపడుతుందనడంలో సందేహం లేదు. ఏకాగ్రతతో చదవడం వల్ల పారిభాషిక పదకోశం, విషయ అవగాహన, క్రిటికల్‌ థింకింగ్‌, అనలిటికల్‌ థింకింగ్‌, జీవితాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడం, జ్ఞాన/భాషా ప్రవాహం, రాయడం/వేగంగా చదవడమనే కళను తెలుసుకోవడం, ప్రపంచాన్ని చూపించే గవాక్షంగా, పఠనాభిలాష పెరగడం, అల్ప జ్ఞాని నుంచి వేధావి వరకు ఎదిగేందుకు ఉపకరించడం లాంటి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. చిన్నతనం నుంచే పిల్లలకు పుస్తకాలు చదవడమనే అలవాటు చేస్తే వారు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదుగుతారని గత అనుభవాలు రుజువు చేస్తున్నాయి.
డిజిటల్‌ యుగంలో పుస్తక పఠనం:
మంచి పుస్తకాన్ని చదివినపుడు పొందే అనుభూతులు వర్ణణాతీతమని మనకు తెలుసు. నేటి ఆధునిక వేగవంతమైన జీవితంలో అనంత సమాచారం మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సమయంలో చదవడానికి తీరికలేని ఆధునిక ఉరుకులు పరుగులు మన ఊపిరిని శాసిస్తున్నాయి. ఆఫ్‌లైన్‌లోగాని, ఆన్‌లైన్‌లోగాని చదవడం విధిగా అలవాటు చేసుకోవాలి. మనలోని సృజనను తట్టి లేపడానికి పుస్తక పఠనం ఇంధనంగా పని చేస్తుంది. చరిత్రలో నిలిచిన వారందరూ చదువు మహిమను అవగతం చేసుకున్నవారే అని మనకు తెలుసు. ‘పుస్తకాలు నా మనసుకు దగ్గరైన నేస్తాలు, నా గృహమే వేల పుస్తకాలతో కూడిన ఓ గ్రంధాల దేవాలయం, పుస్తకాలే నా వద్ద ఉన్న అపూర్వ సంపద’ అంటూ భారత రత్న ఏ పి జె అబ్దుల్‌ కలాం అన్న వాక్యాలు మనకు గుర్తున్నాయి. దేశ జనాభా ఏకాగ్రతతో చదివితే దేశం అభివృద్ధి దిశగా కదులుతుందని మనం నమ్ముతున్నాం. దేశ అసలైన ఆస్తి మేధో సంపదే అని మనం గుర్తించాం. జాతీయ విద్యావిధానం-2020 ఉద్దేశ్యాల్లో విజ్ఞాన సమాజ స్థాపన, ప్రపంచ స్థాయి మేధో సంపత్తి నిర్మాణం, ప్రపంచ విలువలను ప్రేగు చేసుకోవడం లాంటివి నిర్ణయించడం జరిగింది.
విద్యతోనే బహుముఖీన వికాసం:
గొప్ప పుస్తకాల పఠనం మన జీవితాలను మలుపు తిప్పగలవు, మరి కొన్ని అశ్లీల పుస్తకాలు పాతాళంలోకి కూడా నెట్టగలవు. కొన్ని పుస్తకాలను స్పృశించి వదిలేయడం, మరి కొన్నింటిని లోతుగా అర్థం చేసుకోవడం, కొని పునశ్చరణ చేసుకోవడం పాఠకుడికి తెలియాలి. చిరిగిన చొక్కానైనా తొడుక్కొని ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కోమని పెద్దలు అంటూ వస్తున్న విషయం మనకు తెలుసు. విద్యావంతమైన సమాజం ద్వారా రాజకీయ, సామాజిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక వికాసం రాజ్యమేలుతుందని తెలుసుకోవాలి. విద్యావంతులు అధికంగా ఉన్న దేశాలు అభివృద్ధిలో ముందుండడం, తలసరి ఆదాయాలు అధికంగా ఉండడం, జీవన ప్రమాణాలు మెరుగుపడడం, శాంతి నెలకొనడం, క్రమశిక్షణ కలిగిన సమాజ విలువలు నెలకొనడం తప్పనిసరిగా జరుగుతుంది. పుస్తక పఠనాన్ని నమ్ముకున్న సమాజంలో ఆలోచనాశక్తి పెరగడం, ఆవిష్కరణలు బయట పడడం, విలక్షణ ఆలోచనలు పురుడు పోసుకోవడం అనాదిగా జరుగుతూనే ఉన్నది. నేటి అంతర్జాల వలయంలో చిక్కిన యువత పుస్తక పఠనానికి ద్వితీయ ప్రాధాన్యం ఇవ్వడం, దృశ్యశ్రవణ వీక్షణకు మొగ్గు చూపడం రాబోయే ప్రమాదానికి సంకేతంగా నిలుస్తున్నది.
జాతీయ డిజిటల్‌ లైబ్రరీ స్థాపన:
పుస్తక పఠన ప్రాధాన్యాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇటీవల ‘జాతీయ డిజిటల్‌ గ్రంధాలయాలను’ ఏర్పాటు, ప్రఖ్యాత పుస్తకాలను పౌరులకు అందుబాటులో ఉంచడానికి సంకల్పించడం ముదావహం. గ్రామ పంచాయితీల్లో గ్రంధాలయాల నుంచి జాతీయ డిజిటల్‌ గ్రంధాలయాలను ఏర్పాటు చేయడం వరకు అన్ని సదుపాయాలు పుస్తకపఠనాన్ని పెంచాలని ఉద్దేశించినవే అని తెలుసుకోవాలి. దేశంలో అక్షరాస్యత రేటు కన్న విద్యావంతుల రేటు పెరిగితేనే దేశం అసలైన సుస్థిరాభివృద్ధిని పొందుతుందని మనకు విధితమే. పుస్తకాలను చదివి శారీరక మానసిక విసాసాన్ని పెంచుకుంటూ, ఉద్యోగ ఉపాధులను పొందడం జరగాలి. చదువుకున్న వారికి అనంత అవకాశాల ద్వారాలు తెరుచుకొని ఉంటాయి. అనంత జ్ఞానం పుస్తకాల్లో నిక్షిప్తం కావడంతో దానిని ఆస్వాదించడానికి పఠన శక్తిని పెంచుకోవాలి. చదవడమనే అలవాటు మెదడుకు చైతన్యం కలిగించడమే కాకుండా సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి పునాదిగా కూడా పని చేస్తుంది. మనకు ఏం తెలియకపోయినా ఫరవా లేదు కాని మన సమీపంలో గ్రంధాలయం ఎక్కడ ఉందో తెలియడం ప్రధానమని నమ్ముదాం, పుస్తకాలు చదవడం అలవాటుగా చేసుకుందాం.
పుస్తకాలు అపార జ్ఞాన నిధులు, సంతోషానికి పునాదులు. ‘విద్య లేని వాడు వింత మనిషి అయితే విద్యావంతుడు అనంత శక్తిమంతుడు’ అని నమ్మాలి. నేటి విద్యావంతులందరూ ప్రాంతీయ భాష, జాతీయ భాష, అంతర్జాతీయ భాషా పుస్తకాలను చదువుతూ విద్యావేత్తలుగానే కాకుండా సంస్కారవంతులుగా దేశాభివృద్ధిలో భాగస్వామ్యం తీసుకుందాం. అజ్ఞాన చిక్కటి చీకట్ల సమాజంలో విజ్ఞాన కాంతులను నలుదిశలా వెలిగిద్దాం. జై జవాన్‌, జై కిసాన్‌, జై విద్వాన్‌ అంటూ సగర్వంగా నినదిద్దాం.

-డా. బుర్ర మధుసూదన్ రెడ్డి
9949700037

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page