ట్వీట్ ద్వారా రేవంత్ రెడ్డి మండిపాటు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 13 : తండ్రీ కొడుకుల కట్టుకథలతో పాలమూరు కన్నీటి కథలు మరుగున పడ్డాయని, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. అబద్ధాన్ని అతికినట్టు చెప్పడంలో కల్వకుంట్ల వారికి అస్కార్ ఇవ్వొచ్చంటూ సెటైర్ వేశారు.
పాలమూరు పచ్చబడ్డదన్నది జూటామాట అన్న రేవంత్..సందేహం ఉంటే క్షేత్రస్థాయిలోకి వెళ్లి నిజనిర్దారణ చేద్దాం..వొచ్చే దమ్ముందా కేటీఆర్ అంటూ సవాల్ విసిరారు. అదే విధంగా టీఆర్‌ఎస్ జిల్లా పార్టీ కార్యాలయానికి ఖరీదైన స్థలం కేటాయింపుపై రేవంత్ మండిపడ్డారు. దళితులకు మూడెకరాలు ఇవ్వడానికి భూమి లేదు..గిరిజన విశ్వవిద్యాలయానికి భూమి లేదు..టీఆర్‌ఎస్ జిల్లా ఆఫీసుకు మాత్రం నగరం నడిబొడ్డున 100 కోట్ల విలువైన భూమి అప్పనంగా కొట్టేయడానికి భూమి ఉందంటూ ఫైర్ అయ్యారు. ఎవని పాలయిందిరో తెలంగాణ? జాతి సంపద దోస్తున్నవాడి పాలయిందిరో తెలంగాణ అంటూ రేవంత్ ట్వీట్ చేశారు.