” భూడిద అనే పదం కూడా ఏకపక్షంగా పాలకుల డిక్షనరీలో కి చేరిపోయింది.తప్పించుకోవడానికి పాలకులకు బూడిద కన్నా తేలికైన పదం కానీ,పదార్థం కానీ మరొకటి కనిపించడం లేదు? ఇప్పుడు గాలికి పోయే భూడిదను ఒంటికి సెంటుగా కొట్టుకుంటున్నారు పరిపాలకులు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా పాలకులకు ఆ భూడిదే ఇప్పుడు ఏలేటి వారిని శని లా పట్టుకుంది లేదా చుట్టుకుంది..”
ఎన్.తిర్మల్ (రాజకీయ,విశ్లేషకులు, సామాజిక కార్యకర్త) సెల్:9441864514,
తెలుగునాట ఇప్పుడు పాలన ఏమీలేదు! బూడిద తప్ప?ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా నైనా ఆ భూడిద కూడా ఆచూకీ కూడా లభించకపోవడమే అసలు సమస్య.ఎప్పుడో 30 ఏళ్ళ క్రితం సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నటరత్న స్వర్గీయ ఎన్టీఆర్ పూర్తి కషాయం ధరించి ,నొసట విభూది కూడా ధరించి ఆ మాట అన్నట్లు నాకు బాగా గుర్తు.అప్పటినుండి ఇప్పటిదాకా పాలకులు ఎవరెక్కినా భూడిధ గుట్టల మీద నుండి దిగినట్లు కనిపించడం లేదు.ఎన్నికలనబడే గండం గట్టెక్కే వరకే ఏ పార్టీ గాడిదైనా మూతికి వాగ్దానం అనబడే కర్రకు పిడికెడు పచ్చగడ్డి కట్టి ఆశ పెట్టి,ఖాయసు పెట్టి గట్టెక్కిన తర్వాత ఎగిరి వెనక్కాళ్ళతో ప్రజల డొక్కా మీద తన్నడం! చివరకు గుప్పెట తెరిచి తన దగ్గర ఏముంది బూడిద అనడం రివాజుగా మారింది.
భూడిద అనే పదం కూడా ఏకపక్షంగా పాలకుల డిక్షనరీలో కి చేరిపోయింది.తప్పించుకోవడానికి పాలకులకు బూడిద కన్నా తేలికైన పదం కానీ,పదార్థం కానీ మరొకటి కనిపించడం లేదు? ఇప్పుడు గాలికి పోయే భుడిదను ఒంటికి సెంటుగా కొట్టుకుంటున్నారు పరిపాలకులు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా పాలకులకు ఆ భూడిదే ఇప్పుడు ఏలేటి వారిని శని లా పట్టుకుంది లేదా చుట్టుకుంది. తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఉద్యోగులు కరువు బత్తెం అడిగినప్పుడు,కాంట్రాక్టర్లు బిల్లులడిగినప్పుడు,చివరకు బడి పిల్లలు పీజులడిగినప్పుడు అన్యొపదేశంగా ఆయన అదే చెబుతున్నారు.”నాదగ్గర ఏముంది బూడిద” అనడమే కాక కాస్తా నాజూగ్గా,మరి కాస్తా మోరటుగా “చివరకు నన్ను కాల్చుకుతిన్నా,కోసుకు తిన్నా నయాపైసా రాలదు “అంటున్నారు.ఆ భూడిద గుట్టగుట్టుమట్టు ఆయనకు పాపం తెలిసిన తర్వాత చేసిన వాగ్దానాలు పూర్తిగా కాదనలేక సగం,సగం అయినా నెరవేర్చడం లేదా సాంతం అయినా ఎగగొట్టడం ఆనవాయితీగా మారింది.
ఒకరకంగా బూడిద అంటే చివరి అంకం అనే అర్థం!లేదా శూన్యం అనే పదానికి దగ్గర చుట్టరికం కూడా దానికి ఉంది.బూడిద అంటే గాడిదల కే కాదు ఎవరికి మాత్రం ప్రీతిపాత్రం కాదు?చివరకు ఊరూపేరూ లేని ఆ సర్వేశ్వరుడికీ కూడా బూడిద గుట్టమీద కాపలా తప్పడం లేదు! ఇప్పుడు చిత్రంగా మన ప్రక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇప్పుడు ఆ భూడిద గుట్ట మీదనే మల్లా గుల్లాలు పడుతుంది.పరిశోధన చేస్తుంది.వోటేయించుకునేవరకు “దానా” దందా,ఓడ్డెక్కి గద్దెక్కిన తర్వాత భూడిద దందా ఇది ఏ పాలకులకైనా సహజ న్యాయ సూత్రమే? కాకుంటే కాస్తా వెనకా ముందు.
ఎన్నికల ముందు యువరాజు లోకేశుడు రెడ్ బుక్ రాజ్యాంగం అంటుంటే చాలా మందికి అర్థం కాలేదు.ఎరుపు అంటున్నారు గనుక అదేదో కమ్యూనిస్టుల నుండి అరువు తెచ్చుకున్న పదం కావచ్చులే అని కామ్రేడ్లు కూడా కొందరు ముచ్చట పడి ఉంటే ఉండవచ్చును కానీ,ఆచరణలోకి వచ్చిన తర్వాతనే దాని అసలు స్వరూపం బయట పడింది.ఎమ్మెల్యే అయినా యంపి అయినా ఎన్నికైన తర్వాత చట్టసభల్లో చట్టాలు చేయడమే అసలు పని!కానీ మన పాలకులు చట్టానికి,కార్యనిర్వాహణ పరిపాలన కు మధ్య సరిహద్దులు చెరిపేసారు.ఇప్పుడు ఈ ప్రతినిధులు బిల్లు కలెక్టర్ నుండి జిల్లా కలెక్టర్ వరకు, కానిస్టేబుల్ నుండి రాష్ట్ర కమిషనర్ వరకు అధికారాన్ని తమ ఇంటికి కాపలా ఉండే పెంపుడు జంతువుల్లా వాడుకుంటున్నారు.ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన కార్యనిర్వాహణ శాఖ కాస్తా పాలకుల కనుసన్నల్లో ప్రజల్ని నీరు గార్చేశాఖలుగా మారిపోయాయి.వీధి గొడవలు,మూకదందాలు ,ఊఅంటే కేసు,ఆఅంటే కేసు వరకు ఈ రాజ్యాంగ మార్పు సూచికలు గా మారిపోయాయి.చివరకు ఏకంగా మనుష్యులు మాయం అయ్యే వరకు తాజా రాజ్యాంగ తమాషా మారిపోయింది.
ఒకసారి దొంగతనం చేయిస్తే అదే దొంగ ఎన్నిసార్లయినా ఆ పని సులువుగా చేసేయగలడు.చట్టాలు,గిట్టాలు చాపలోచుట్టి చంకలో పెట్టేయగలరు.ఇప్పుడు బెజవాడ కృష్ణలంక లో అదే జరిగింది. చిత్రంగా బూడిద సమస్య తలఎత్తింది. గాదె సాయివంశీ కృష్ణ అనబడే యువకుడిని కృష్ణ లంక పోలీసులు నెల క్రితమే ఓ క్రిమినల్ కేసులో అరెస్టు చేశారట!ఇది ఆయన తల్లి చేస్తున్న ఆరోపణ.ఆమె బ్రతిమాలినా ,బామాలినా ఆయన బ్రతికుండగా వదలలేదు!పైగా కొడుకు పై ఆశలు వదులుకోవాలని చావు కబురు చల్లంగ చెప్పి పంపించారట !ఆయన ఇప్పుడు ఏకంగా పోలీసు రికార్డుల్లోంచి మాయం అయ్యారు? బ్రిటీష్ వాడి మోడల్ గా కట్టిన అంత పెద్ద ఇనుపచువ్వల లాకప్పులో అలా ఎలా జరుగుతుందబ్బా.ఆయనేమైనా దోమా,ఈగా పారిపోవడానికి,జారిపోవడానికి , పోలీసులు చెబుతున్నట్లు …అందునా ఆయన ఒక పెద్ద క్రిమినల్ కూడా నట! ఇలా అరెస్టు అయిన వారు మాయం కావడం,అరెస్టు భయంతో చావడం అక్కడ ప్రజలకూ అప్పుడప్పుడూ మామూలేనట.
అంతపెద్ద యువకుడు కటకటాల నుండి ఎలా మాయం అయ్యాడు ఇప్పుడిదే ప్రధాన ప్రశ్న,సమస్య!ప్రతిపక్షాలు ఏమో గాదె సాయీ కృష్ణను చిత్రహింసలు పెట్టి ,గోళ్ళు పీకి, దారుణంగా చంపి, మృతదేహాన్ని కృష్ణ లంక స్మశానం లో దహనం చేశారు.ఆ భూడిద కూడా మాయం చేశారని ఆరోపిస్తున్నారు.తల్లేమో!తమ పిల్లోడిని చంపేశారు..మృతదేహం కూడా ఇవ్వకుండా బూడిద చేశారు..కనీసం ఆ భూడిదైనా ఇవ్వండి దశ దినకర్మలు చేసుకొంటాం , పిండాలు పెట్టుకుంటాం అని శోకం పెడుతుంది. ప్రభుత్వం ఏమో నెలరోజులుగా సమాలోచనలు చేసి చివరికి సిఐ ని వెకేషన్ పంపి చేతులు దులుపుకుంది.పోలీసులేమో ఆయన ఆచూకీ మాకేం తెలియదు గాక తెలియదని ఇప్పటికీ మరీ బుకాయించి చెబుతున్నారు.కోర్టేమో చచ్చిన సాయీ కృష్ణ ను ఈనెల 29 నాటికి తమ ముందు హాజరు పరచాలని తన సహాజ ధోరణిలో ఆదేశాలు ఇచ్చింది.పోతే పోయాడు ఓకోటి తీసుకొని గమ్మునుండమని తల్లి దగ్గర రాజీ బేరం పెట్టాడట స్థానిక ఓ రాజకీయ నేత .ఇంతలోనే ప్రతిపక్ష నేత జగన్ మినీ ఓదార్పు యాత్ర! ఆ మరుసటిరోజే ముఖ్యమంత్రి చంద్ర బాబు నోట ఎప్పటిలా న్యాయం మాట!! దొంగల చేతికి తాళం ఇచ్చినట్లు పోలీసులు పైన పోలీసులే దర్యాప్తు నట.
ఇక ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఈ వ్యవహారం రాజకీయ నషాళం అంటినట్లు ఉంది.
పోలీసు ‘కాపు’నొదిలి మీరంతా వెర్రి మోహాలు వేసుకొని ‘క్రిమినల్ ‘కాపులను సమర్థిస్తా రేంటిరా? కాపుల్లో కాస్తా కాస్టిలీ ‘కాపు’ వర్గీకరణ కు దిగారు.బూడిద తో ఆయన సరికొత్త బుకాయింపుకు దిగారు.ఇక హోంమంత్రి పై సీఐ నాగరాజు తనను అరెస్టు చేస్తే అందరి బాగోతాలు బయట పెడతానని బుకాయిస్తున్నట్లు సోషల్ మీడియా గోస పెడుతుంది.ఇంతకీ సాయీ కృష్ణ ఏమైనట్లు? ఇట్లా మాయం అయ్యో మనుష్యులు గురించి రాజ్యాంగం ఏమి చెబుతుంది?భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 ప్రకారం “చట్టం ద్వారా ఏర్పాటు చేసిన విధానం ప్రకారం తప్ప,ఏ వ్యక్తినీ, అతని జీవితం నుండి లేదా వ్యక్తిగత స్వేచ్ఛ నుండి దూరం చేయరాదు “అని చెబుతుంది.ప్రజలకు జీవించే హక్కు మాత్రమే ఉంది.వారిని కొట్టి చంపే హక్కు ఎవరికీ లేదు.అప్పుడప్పుడూ ఇలాంటి పోలీసులకు తప్ప?గజానికో గాంధారి పుత్రునిగా మనదేశంలో యూనిఫాం నాగరాజులు కనిపిస్తూనే ఉంటారు?ఇంతకీ సాయి కృష్ణ ఏమైనట్లు?ఉన్నట్లా,లేనట్లా.ఇక ఏ విషయం తేల్చుకునేందుకు రెడ్ బుక్ రాజ్యాంగంలో ఏముంటుంది.కృష్ణ లంక స్మశానం, మాయమైన బూడిద తప్ప!?