- రాములవారి ఆశీస్సులతో ప్రజల వద్దకు సంక్షేమ పథకాలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లు పూర్తి
- ఐదేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు
- విలేఖరుల సమావేశంలో రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల శాఖా మాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- నేడు రామాలయం అభివృద్ధిపై సిఎం ప్రత్యేక సమీక్షా సమావేశం
భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 10 : శ్రీ సీతారామ చంద్రస్వామి ఆశీస్సులతో ప్రజల వద్దకు సంక్షేమ పథకాలు తీసుకువెళ్ళేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల శాఖా మాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేసారు. ఆదివారం సాయంత్రం నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం పర్యటన సందర్బంగా జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు. 11వ తేది సోమవారం ఉదయం కల్లా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…తాము పాలకులం కాదని, ఇది సేవకుల ప్రభుత్వమని చెప్పారు. మొదటి విడతగా నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేయటం జరుగుతుందని ఈ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తారని స్పష్టం చేసారు. ముందుగా శ్రీ సీతారామ చంద్రస్వామి వారిని దర్శించుకున్న అనంతరం సుమారు 3 వేల మందితో ఏర్పాటు చేసిన సభా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రజలతో మాట్లాడతారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో రానున్న ఐదేళ్ళలో 20 లక్షల ఇళ్ళు నిర్మిస్తామని స్పష్టం చేసారు. స్థలం ఉన్న ప్రతీ వారికి 5 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా రెండవ విడతలో ఎస్సీ, ఎస్టీ వారికి ఆరు లక్షల రూపాయలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. అలాగే స్థలం లేనివారిని కూడ స్థలం ఏర్పాటు చేసి ఇందిరమ్మ ఇళ్ళు నిర్మిస్తామని స్పష్టం చేసారు. ఏజన్సీ ప్రాంతంలో అభివృద్దే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. గడిచిన పదేళ్ళలో మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలను మాయ మాటలు చెప్పి మభ్యపెట్టారని విమర్శించారు. బుల్‌బెడ్ రూమ్ పేరుతో ప్రజలను నిండా ముంచారని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంతో ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 90 రోజుల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని అన్నారు.
సోనియా గాంధీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఆరు గ్యారెంటీలను అమలు చేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు సాగుతుందని స్పష్టం చేసారు. శ్రీ సీతారామ చంద్రస్వామి ఆశీస్సులతో భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ళు పథకాన్ని ప్రారంభిస్తునందుకు తమకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. తమ ప్రభుత్వానికి శ్రీ సీతారామ చంద్రస్వామి ఆశీస్సులు మెండుగా ఉన్నాయని స్పష్టం చేసారు. గత ప్రభుత్వం అభివృద్ధిని అందని ద్రాక్షాలాగా ప్రజలకు చూపించిందని విమర్శించారు. తమది ఇందిరమ్మ రాజ్యమని, ఇందిరమ్మ రాజ్యంలో తాము ప్రజలకు సేవ చేయటమే ధ్యేయంగా పెట్టుకున్నామని చెప్పారు. గత కేసీఆర్ ప్రభుత్వం జర్నలిస్టులకు కూడ తీరని అన్యాయం చేసిందని అన్నారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన జర్నలిస్టులందరికి ఖచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే హైద్రాబాదులో ఉన్న జర్నలిస్టు ఇండ్ల స్థలాలు ఒక కొలిక్కి తీసుకు వొచ్చామని, అర్హులైన ప్రతీ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా ఇళ్ళు నిర్మించి ఇస్తామని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా, గిరిజన సంక్షేమ శాకా మున్సిపల్ సెక్రటరీ శరత్, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ప్రతీక్ జైన్, గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచారకులు మన్నెమ్మ, ఇల్లందు శాసన సభ్యులు కోరం కనకయ్య, భద్రాచలం శాసన సభ్యులు తెల్లం వెంకట్రావు, భద్రాచలం మాజీ శాసన సభ్యులు పొదెం వీరయ్య తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశలో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని పొంగులేటి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
నేడు రామాలయం అభివృద్ధిపై ప్రత్యేక సమీక్షా సమావేశం
శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. ఇందుకోసం సోమవారం నాడు శ్రీసీతారామ చంద్రస్వామిని దర్శించుకున్న అనంతరం ఇందిరమ్మ ఇంటి పథకం లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆ తరువాత శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అభివృద్ధిపై ఉన్నత అధికారులో సమీక్ష నిర్వహించనున్నారు. ఆలయ అభివృద్ధిని ఏ విధంగా చేస్తే బాగుంటుందో ఆలయ అధికారులతో పాటు నిపుణుల సహకారం తీసుకోనున్నారు. సుమారు 100 కోట్ల రూపాయలతో ఆలయం అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం ముందుకు వెళుతున్నట్లు తెలుస్తుంది. గత కేసీఆర్ ప్రభుత్వం ఆలయానికి 100 కోట్లు ప్రకటించి పదేళ్ళు గడిచిన ఒక్క రూపాయి కూడ ఇవ్వలేదు. ఇందిరమ్మ రాజ్యంలో రామాలయం అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసింది. ఇందుకోసం భద్రాచలంలోనే ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ముందుగా 100 కోట్లతో అభివృద్ధి చేసి తరువాత మరి కొంత డబ్బును వెచ్చించి పనులు చేసేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు తెలుస్తుంది.





