- వ్యక్తిగత ప్రయోజనాలు ఆశిస్తే రావు
- నా టిక్కెట్‌కే నేను గ్యారెంటీ కాదు
- బిజెపిలో కేంద్ర కమిటీ మేరకు నిర్ణయాలు
- వేయికోట్లు కేటాయిస్తానని చెప్పి ఎంబిసిలకు బడ్జెట్‌లో కెసిఆర్ మొండిచేయి
- బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్
ప్రజాతంత్ర, హైదరాబాద్, ఏప్రిల్ 12 : పార్టీ కోసం కష్ట పడిన వారికే ఎన్నికల్లో టికెట్లు, వ్యక్తుల కోసం పనిచేసేవారికి టికెట్లు రావని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. పాదయాత్ర ముందు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన వి•డియాతో మాట్లాడుతూ.. టికెట్లు ఇప్పిస్తామంటూ కొందరు.. నాయకులను తిప్పుకుంటున్నారు. తిప్పుకున్న వారికీ.. తిరిగిన వారికీ ఇద్దరకీ టికెట్లు రావు. బీజేపీ జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ సంతోజీ కూడా ఇదే విషయం స్పష్టం చేశారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొందరు పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి అవుతామని చెప్పుకునే వారు.. బీజేపీలో ముఖ్యమంత్రులు కాలేరు. అధ్యక్షుడైప్పటికీ.. నా టికెట్ పై కూడా స్పష్టత లేదు. యూపీ ఎన్నికల్లో టికెట్లు ఇప్పిస్తామని చెప్పుకున్నవారే టికెట్ రాలేదని బండి సంజయ్ పేర్కొన్నారు.
ఇకపోతే సీఎం కేసీఆర్‌పై విమర్శల గుప్పించారు. ఎంబిసిలకు ప్రతి ఏటా బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయించి, ఖర్చు చేస్తామని ప్రభుత్వం ప్రగల్భాలు పలికిందని ఆయన మండిపడ్డారు. 2017-18 నుండి 2021-22 వరకు ఎంబీసీ కార్పోరేషన్‌కు బడ్జెట్ కేటాయింపులకు ఖర్చుకు అసలు పొంతనే లేదని ఆయన వెల్లడించారు. ఎంబీసీలకు గడిచిన నాలుగు బడ్జెట్‌లలో 3 వేల కోట్లు కేటాయించినట్లు కాగితాల్లో కనిపిస్తున్నా ఫైనాన్స్ విభాగంలో ఆమోదం పొందింది రూ.350 కోట్లు కాగా కనీసం 10 కోట్లు కూడా ఖర్చు చేయలేదని ఆయన తెలిపారు. ప్రస్తుతమున్న 36 కులాలు కాక మరో 15 కులాలవారు తమను ఎంబీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారన్నారు.
వీరి అభ్యర్థనను పరిశీలించి వెంటనే పరిష్కారం చూపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్దత తెస్తామని 2017లో అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ చేసిన హావి నేటికీ అమలుకాలేదని ఆయన విమర్శించారు. 2017లో బీసీ మంత్రులు, బీసీ ప్రజాప్రతినిధులు మూడు రోజులు సమావేశమై 210 తీర్మానాలను ఆమోదించి ప్రభుత్వానికి అందజేశారన్నారు. ఈ తీర్మానాలకు ఇప్పటి వరకు అతీగతీ లేదని, 2017లో బీసీ సబ్ ప్లాన్ అమలుపై కేసీఆర్ ఇచ్చిన హావి• అమలై ఉంటే బీసీ సంక్షేమం కోసం కేటాయిస్తున్న నిధులకు మరో 10 వేలకోట్ల నిధులు అదనంగా సమకూరేవని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటినుండి రాష్ట్ర బడ్జెట్‌లో బీసీలకు 2, 3 శాతం మాత్రమే నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం చేతులు దులుపుకుంటుందని ఆయన మండిపడ్డారు.
2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో 146 బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తామని అందుకు 73 ఎకరాలభూమి 53 కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు బుట్టదాఖలా చేశారన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు ఉన్న 34 శాతం రిజర్వేషన్లను 18శాతానికి కుదించారని. 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు మూడు మంత్రి పదవులు మాత్రమే ఇచ్చారన్నారు. జనాభా నిష్పత్తి ప్రకారం రాష్ట్ర మంత్రి వర్గంలో కనీసం 8 మంది బీసీలకు ప్రాతినిధ్యం ఉండాలన్నారు. మోడీ క్యాబినెట్‌లో 27 మంది బీసీలకు స్థానం కల్పించారని ఆయన గుర్తు చేశారు. 12 మంది ఎస్సీలకు, 8 మంది ఎస్టీలను క్యాబినెట్ మంత్రులను చేసి అట్టడుగు వర్గాలవారికీ సముచితమైన గౌరవాన్ని ఇచ్చారన్నారు. 102వ రాజ్యాంగ సవరణ ద్వారా 338 బి, 342 ఏ, 366 (26 ఏ) అధికరణను చేరుస్తూ జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించిన ఘనత భారతీయ జనతా పార్టీదేనని ఆయన వ్యాఖ్యానించారు.