యాత్రలు పాదయాత్రలు
పుణ్య స్థలాలకు మోక్ష యాత్రలు!
ఓటరు దేవుళ్ల దర్శనాలకు
బహురూపుల యాత్రలు!
దేవుళ్లకు భక్తులకు మధ్య
అనుబంధమైంది ఓటు!
దేవుడు పొగడ్తలకు పొంగిపోయి
ఐదేండ్ల కొకసారి అనుగ్రహిస్తాడు!
దేవుళ్ళ ప్రాపకం పొందడానికి
భక్తుల నానావిధ యాత్రలు!
సిరికిన్ జెప్పడు అన్నట్లు వస్తారు
ఎండనక వాననక లారీల్లో దేవుళ్ళు!
భజన భక్తులు ఎత్తైన గద్దెల మీద
అమాయక దేవుళ్ళు నేల మీద!
కంప్యూటర్ యుగంలో కూడా
సభల్లో దేవుళ్ళ ప్రేక్షక అవతారం!
పాద యాత్రల్లో పారాయణాలు
దండకాల పురాణాలు!
మొక్కిన మొక్కులు చెల్లించక నే
పాద యాత్రలతో పవిత్రులై పోతారా!
అధికార అందలమెక్కిస్తారే గాని
శాపాలు పెట్టలేని అమాయక దేవుళ్ళు!
దేవుళ్ళ బాధ తీర్చే భక్తదాసుడెవడో!
గుర్తించుట దేవుళ్ళకే పరీక్ష!
– పి.బక్కారెడ్డి
9705315250