- మీడియా స్వేచ్ఛ పరిరక్షణకు పలువురు వక్తల పిలుపు
- పట్నాలో ఐజేయూ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభం
పట్నా, ఆగస్ట్ 26 : పత్రికాస్వేచ్ఛ పరిరక్షణ కోసం పాత్రికేయులు సాగించే పోరాటానికి దేశంలోని అన్ని వర్గాలు మద్దతు ఇవ్వాలని, పత్రికాస్వేచ్ఛ తోనే ప్రజాస్వామ్య మనుగడ ముడిపడి ఉన్నదనీ, పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఇండియన్ జర్నలిస్టస్ యూనియన్ (ఐజేయూ) రెండు రోజుల జాతీయ కార్యవర్గ సమావేశాల ప్రారంభసభ శనివారం ఉదయం బీహార్ శాసనమండలి ఉపభవనం సమావేశ మందిరంలో జరిగింది. ఐజేయూ జాతీయ అధ్యక్షుడు కే.శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన శాసనమండలి చైర్మన్ దేవేశ్ చంద్ర ఠాకూర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య మనుగడకు పత్రికా స్వేచ్ఛ కీలకమని, అప్పుడప్పుడు కొన్ని సమస్యలు తలెత్తినప్పటికీ దేశంలో పత్రికారంగం ప్రజాస్వామ్యం కోసం నిరంతరం గట్టిగా నిలబడిందని గుర్తు చేశారు. కొన్ని సందర్భాల్లో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ పత్రికారంగం ధైర్యంగా నిలిచిందని గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో మీడియాపై మరింత గురుతర బాధ్యత ఉందని, ఒత్తిళ్ళకు, అణచివేతకు, భయానికి లోబడి పనిచేయాల్సిన అవసరం మీడియాకు లేదని దేవేష్ చంద్ర ఠాకూర్ అన్నారు. మన సమాజంలో ప్రజాస్వామ్య మూలాలు బలంగా ఉన్నాయని, సందర్భం వచ్చినప్పుడు ప్రజలు గట్టిగా నిలబడ్డారని అన్నారు. పత్రికాస్వేచ్ఛ పరిరక్షణకు పాత్రికేయులు సాగించే పోరాటానికి పౌరసమాజం మద్దతు ఇవ్వాలని దేవేశ్ చంద్ర ఠాకూర్ పిలుపు ఇచ్చారు.
బీహార్ కార్మికశాఖ మంత్రి సురేంద్ర రామ్ మాట్లాడుతూ పాత్రికేయులకు సంకెళ్ళు వేయడానికి ఎవరు ప్రయత్నించినా వారు సఫలం కాలేరని, అలాంటి ప్రయత్నాలను ప్రతిఘటించాలని, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే మీడియా ప్రతినిధుల నోరు నొక్కేందుకు గత కొన్నేళ్ళుగా జరుగుతున్న ప్రయత్నాలను గమనించాలని సురేంద్ర రామ్ అన్నారు. పత్రికాస్వేచ్ఛ కోసం, పాత్రికేయుల భద్రత కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. పాత్రికేయుల పోరాటానికి తమవంతు మద్దతు ఇస్తామని అన్నారు. బీహార్ కాంగ్రెస్ శాసనసభపక్ష నేత షకీల్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ హయాంలో వేసిన ప్రజాస్వామ్య పునాదులను దెబ్బ తీసేందుకు నేటి పాలకులు ప్రయత్నిస్తున్నారని అన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలనే ఆలోచనలు కూడా కొందరిలో కొనసాగుతున్నాయని అన్నారు. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, మన సమాజంలో ప్రజల్ని కలిపి ఉంచే సిద్ధాంతాలని అన్నారు. వాటిని నిలబెట్టుకునేందుకు పోరాడాలని అన్నారు.
దేశంలో శాస్త్రీయ దృక్పథం స్థానంలో ఛాందస వాదాన్ని, మూఢ నమ్మకాలను తెచ్చే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. శాస్త్రవేత్తల, సాంకేతిక నిపుణుల, కార్మిక సిబ్బంది కృషితో చంద్రయాన్ -3 విజయవంతం అయ్యిందని, అయితే గత నాలుగు రోజులుగా చంద్రయాన్ పై మోదీ చేసిన ప్రసంగాన్ని బ్రేకింగ్ న్యూస్ గా మీడియా కొనసాగిస్తున్నదని తెలిపారు. ప్రభుత్వానికి మద్దతుగా మీడియాలో ఒక పెద్ద విభాగం కృషి చేస్తోందని, వారు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు.
ఐజేయూ అధ్యక్షుడు కే శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన చట్ట సవరణలు ప్రజాస్వామ్యానికి , పౌరహక్కులకు ప్రమాదకరంగా ఉన్నాయని, రాజద్రోహం చట్టాన్ని దేశ ద్రోహ చట్టంగా మార్చడం పత్రికా స్వేచ్ఛ కు ప్రమాద సంకేతాలను ఇస్తోందని అన్నారు. వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాన్ని రద్దు చేసి తెచ్చిన లేబర్ కోడ్ మీడియా సిబ్బందికి ఏవిధంగానూ పనికిరాదని శ్రీనివాసరెడ్డి అన్నారు. దశాబ్దాలుగా ఉన్నహక్కులకు కేంద్రప్రభుత్వం మంగళం పాడుతోందని అన్నారు. చెన్నైలో జరిగిన ప్లీనరీలో ‘‘సేవ్ జర్నలిజం’’ పేరుతో పత్రికాస్వేచ్ఛ పరిరక్షణ కోసం పోరాడాలని పిలుపు ఇచ్చిందని గుర్తు చేశారు.
సమావేశంలో బీహార్ శాసనసభ సీపీఐ శాసనసభాపక్ష నాయకుడు సూర్యకాంత్ పాశ్వాన్ , సీపీఐ ఎం.ఎల్. శాసనసభ్యుడు సందీప్ సౌరభ్, ఐజేయూ సెక్రెటరీ జనరల్ బల్విందర్ సింగ్ జమ్మూ, పూర్వాధ్యక్షుడు ఎస్.ఎన్. సిన్హా, జాతీయ ఉపాధ్యక్షుడు అమర్ మోహన్ ప్రసాద్ మాట్లాడారు. తొలుత బీహార్ వర్కింగ్ జర్నలిస్టస్ యూనియన్ అధ్యక్షురాలు నివేదితా ఝా స్వాగతం పలికారు. జాతీయ కార్యవర్గ సభ్యులు శివేంద్ర నారాయణ్ సింగ్, ప్రధాన కార్యదర్శి కమల్ కాంత్ సహాయ్, రాష్ట్ర యూనియన్ నాయకులు రవి ఉపాధ్యాయ్, సీటూ తివారీ తదితరులు పాల్గొన్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఉభయ తెలుగు రాష్ట్రాలనుండి జాతీయ కార్యదర్శులు వై.నరేందర్ రెడ్డి, డి.సోమసుందర్, జాతీయ కార్యవర్గసభ్యులు ఆలపాటి సురేష్ కుమార్, ఐజేయూ స్టీరింగ్ కమిటీ సభ్యులు మాజిద్, ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టస్ అధ్యక్షుడు ఐ.వి. సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ హాజరయ్యారు.
సాయంత్రం 2.30 గంటలకు కార్యవర్గ సమావేశం ప్రారంభం అయ్యింది. కే.శ్రీనివాసరెడ్డి అధ్యక్షత వహించారు. ఇటీవల మృతి చెందిన యూనియన్ నాయకులకు, జర్నలిస్టులకు సమావేశం సంతాపం ప్రకటించింది. ఇటీవల కన్నుమూసిన సీనియర్ నాయకులు అంబటి ఆంజనేయులు సేవలను, కృషిని స్మరించుకుంటూ ఐజేయూ పూర్వాధ్యక్షుడు ఎస్.ఎన్.సిన్హా ప్రవేశపెట్టిన ప్రత్యేక తీర్మానాన్ని సమావేశం ఆమోదించింది. తీర్మానం పై బల్విందర్ సింగ్ జమ్మూ, ఆలపాటి సురేష్ కుమార్ మాట్లాడుతూ అంబటి తో తమ ఉద్యమ సహచర్యాన్ని గుర్తు చేసుకున్నారు. సెక్రెటరీ జనరల్ బల్విందర్ సింగ్ జమ్మూ కార్యకలాపాల నివేదిక ఇచ్చారు. జాతీయ ఉపాధ్యక్షుడు జి.ప్రభాకరన్, స్రైబ్స్ న్యూస్ సంపాదకుడు ఆలపాటి సురేష్ తదితరులు మాట్లాడారు.