పనామాలో ఘోర ప్రమాదం

  • లోయలో పడ్డ వలస కూలీల బస్సు
  • ప్రమాదంలో 39మంది కూలీల దుర్మరణం

పనామా సిటి(యుఎస్‌ఏ), ‌ఫిబ్రవరి 16 : సెంట్రల్‌ అమెరికా లోని దేశం పనామాలో బుధవారం అత్యంత విషాదకర సంఘటన జరిగింది. పొట్ట చేతబట్టుకుని, ఉపాధి కోసం వెళ్లిన వలస కూలీలు బస్సు ప్రమాదానికి గురయ్యారు. వీరు ప్రయాణిస్తున్న బస్సు ఓ లోయలో పడిపోవడంతో 39 మంది ప్రాణాలు కోల్పోయారు, సుమారు 20 మంది గాయపడ్డారు. వెస్టర్న్ ‌పనామాలో ప్రయాణిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. వీరంతా కొలంబియా నుంచి డరియన్‌ ‌గ్యాప్‌ ‌గుండా ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే వీరు ఏ దేశానికి చెందినవారో వెల్లడించలేదు. పనామా ప్రభుత్వం డరియన్‌ ‌దాటి వచ్చే వలస కార్మికులను పనామాకు మరొకవైపునగల కోస్టారికా సరిహద్దుల్లోని ప్రత్యేక శిబిరాలకు తరలిస్తోంది. ఈ బస్సులను కేవలం వలసదారుల కోసం మాత్రమే ఏర్పాటు చేశారు. అయితే టిక్కెట్లను వలసదారులే తీసుకోవలసి ఉంటుంది.

ప్రతి బస్సుకు ఇద్దరు డ్రైవర్లు ఉంటారు, నేషనల్‌ ఇమిగ్రేషన్‌ ‌సర్వీస్‌ ‌సిబ్బంది కూడా ఉంటారు. పనామా నేషనల్‌ ఇమిగ్రేషన్‌ అధికారి ఒకరు మాట్లాడుతూ..గ్వాలాకాలోని షెల్టర్‌ ‌వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఈ బస్సును హైవే పైకి తీసుకురావడం కోసం ప్రయత్నిస్తుండగా, మరొక బస్సును ఢీకొట్టిందని, వెంటనే లోయలోకి పడిపోయిందని చెప్పారు. ఈ బస్సులో 66 మంది వలసదారులు ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. వీరంతా లాస్‌ ‌ప్లేన్స్ ‌షెల్టర్‌కు వెళ్తున్నట్లు తెలిపారు. గాయపడినవారిని అంబులెన్సులలో డేవిడ్‌లోని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. పనామా అధ్యక్షుడు లౌరెంటినో కోర్చిజో ఇచ్చిన ట్వీట్‌లో, పనామాకు, ఈ ప్రాంతానికి ఇది విచారకర వార్త అని ఆవేదన వ్యక్తం చేశారు.

పనామా అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, వలసదారులు ప్రమాదానికి గురైన సంఘటనల్లో ఓ దశాబ్దంలో ఇది అత్యంత దయనీయమైనది. పనామా గుండా అమెరికాకు వలసవెళ్లేవారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది. ప్రమాదకరమైన అటవీ ప్రాంతం నుంచి వీరు ప్రయాణిస్తుంటారు. గత ఏడాది, అంతకు ముందు సంవత్సరం కన్నా రెట్టింపు సంఖ్యలో, 2,50,000 మంది ఈ అటవీ మార్గంలో అమెరికాకు వలస వెళ్లారు. వీరిలో అత్యధికులు వెనెజులాకు చెందినవారు. జనవరిలో 24 వేల మంది వలసదారులు ఈ అడవి గుండా వలస వెళ్లారు. వీరిలో అత్యధికులు హైతీ, ఈక్వెడార్‌లకు చెందినవారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page