నోటీసులు మాకు..సమాచారం కేటీఆర్‌కు

  • కేటీఆర్‌ ‌కనుసన్నల్లోనే సిట్‌ ‌విచారణ
  • ఇద్దరు వ్యక్తులు మాత్రమే చేసిన తప్పుగా ఎలా చెప్తారు
  • దోషులను కాపాడే ప్రయత్నంలో ప్రభుత్వ పెద్దలు
  • సిట్‌ అధికారి శ్రీనివాస్‌ ‌ట్రాక్‌ ‌రికార్డు సరిగ్గా లేదు
  • ఇప్పటి వరకూ వేసిన ఒక్క సిట్‌ ‌కూడా నివేదిక ఇవ్వలేదు
  • సీబీఐ, ఈడీ, ఏసీబీలతో ప్రత్యేక సిట్‌ ‌వేయాలి
  • ఫిర్యాదుకు సీబీఐ, ఈడీ డైరెక్టర్లు సమయం ఇవ్వడం లేదు
  • దిల్లీలో మీడియాతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి

న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 28 : టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై ప్రశ్నించినందుకు తమకు నోటీసులు ఇస్తున్నారని..దోపిడీ దొంగతనం చేసిన కేటీఆర్‌కు సమాచారం ఇస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి మండిపడ్డారు. సిరిసిల్లలో సోమవారం జరిగిన ఆత్మీయ సమావేశంలో కేటీఆర్‌ ‌చేసిన వ్యాఖ్యలు, టీఎస్పీఎస్సీ పేపర్‌ ‌లీకేజీ అంశంపై మంగళవారం దిల్లీలో మీడియాతో మాట్లాడుతూ…ఈ కేసులో బ్యాంకు లావాదేవీల కంటే ఆర్థిక లావాదేవీలు ఎక్కువగా జరిగాయని, కోట్ల రూపాయలు చేతులు మారాయని, మనీలాండరింగ్‌, ‌హవాలాతోపాటు విదేశాల్లో లావాదేవీలు జరిగాయని, కాబట్టి సిట్‌ ఒక్కటే ఈ కేసును విచారించలేదని, కాబట్టి సీబీఐ, ఈడీ, ఏసీబీ శాఖలతో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాల్సిందేనని రేవంత్‌ ‌రెడ్డి డిమాండ్‌ ‌చేశారు. ఈ అంశంపై  ఫిర్యాదు చేసేందుకు కాంగ్రెస్‌ ఎం‌పీలు, మాజీ ఎంపీలు గత రెండు, మూడు రోజులుగా అపాయింట్‌మెంట్‌ అడుగుతుంటే సీబీఐ, ఈడీ డైరెక్టర్లు తమకు సమయం ఇవ్వడం లేదన్నారు. ఈ మీడియా సమావేశం చూసి అయినా తమకు వెంటనే అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలని ఆయన కోరారు.

ఈ కేసులో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు కాబట్టి అవినీతి నిరోధక చట్టం కూడా వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు.  కానీ సిట్‌ అవినీతి నిరోధక చట్టం కింద ఒక్క సెక్షన్‌ ‌కూడా పెట్టలేదని, అవినీతి నిరోధక చట్టం కింద కేసులు పెడితే..ఈ కేసులు ఏసీబీ పరిధిలోకి వెళ్తాయని, ఏసీబీ కోర్టుకు క్రిమినల్‌ ‌కేసులను కూడా విచారించే అధికారం ఉంటుందని, తద్వారా విచారణ త్వరగా ముగుస్తుందని, సీబీఐకి కేసు ఇస్తే ఈడీ కూడా వొస్తుందని, అప్పుడు ఇంకా సత్వరంగా కేసులు తేలే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం నిందితుల మీద పెట్టిన సెక్షన్లు, సాధారణ కోర్టుల్లో విచారణ జరిగితే ఈ కేసు తేలడానికి ఏళ్ల సమయం పడుతుందని రేవంత్‌ ‌వ్యాఖ్యానించారు. కేసు నుంచి మంత్రి కేటీఆర్‌ ‌తప్పించుకోవడానికి..ఎదురుదాడి చేస్తూ.. విచారణ అధికారులపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒత్తిడి తీసుకువస్తున్నారని రేవంత్‌ ‌రెడ్డి ఆరోపించారు. పేపర్‌ ‌లీకేజీ విషయాన్ని తామే పసిగట్టామని కేటీఆర్‌ ‌చెప్పడం అబద్ధం అన్నారు. డబ్బు పంపకాల్లో వొచ్చిన తేడాల వల్లే.. నిందితుల ద్వారా ప్రశ్నపత్రాల లీకేజీ బయటపడిందన్నారు. దీన్ని కప్పిపుచ్చడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

కేసీఆర్‌ ‌కుటుంబంపై ఆరోపణలు రావడంతో విధిలేని పరిస్థితుల్లోనే టీఎస్పీఎస్సీ బేగంపేట పీఎస్‌లో ఫిర్యాదు చేసిందని, ఈ కేసును పక్కదారి పట్టించేందుకు, ప్రభుత్వ పెద్దలను కాపాడేందుకు ప్రభుత్వం కేసును సిట్‌కు అప్పగించిందని, తెలంగాణలో ఏదైనా సంచలన సంఘటనలు జరిగినప్పుడు..అందులో ప్రభుత్వ పెద్దల పాత్ర కనిపించినప్పుడు…వారిని కాపాడేందుకు, సమస్యను పక్కదారి పట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారి సిట్‌ను నియమిస్తుందని చెప్పారు. ఎంసెట్‌, ‌నయీమ్‌ ‌కేసుల నుంచి మొదలు ఇప్పటి వరకూ వివిధ కేసుల్లో సిట్‌ ఒక్క నివేదికను కూడా ఇవ్వలేదని, నిందితులపైనా చర్యలు తీసుకోలేదని చెప్పారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై ప్రశ్నించినందుకు సిట్‌ ‌తమకు నోటీసులు, కేటీఆర్‌కు సమాచారాన్ని ఇస్తుందని, సిట్‌ ‌విచారణ కేటీఆర్‌ ‌కనుసైగల్లోనే జరుగుతుందని, సిట్‌ ‌విచారణ నివేదికను కోర్టుకు ఇవ్వకముందే జగిత్యాలలో పరీక్ష రాసిన వారి సమాచారం కేటీఆర్‌కు ఎలా వొచ్చిందని ప్రశ్నించారు.

ఈ ఇష్యూలో కేటీఆర్‌ ‌పీఏ తిరుపతి చిన్న పావు మాత్రమే అని అన్నారు. కేటీఆర్‌ ‌వద్ద నిర్దిష్టమైన సమాచారం ఉందని, ఆయనకు నోటీసులు ఇవ్వకపోగా తమపై క్రిమినల్‌ ‌కేసులు పెడతామని మీడియాకు లీకులు ఇచ్చారన్నారు. కేటీఆర్‌కు సమాచారం  నేరగాళ్లు ఇచ్చరా?.. విచారణ అధికారి ఇచ్చారా? ఈ సమాచారం ఎవరిచ్చారో కేటీఆర్‌ ‌సమాధానం చెప్పాలన్నారు. తమకు నోటీసులు ఇచ్చిన ఏఆర్‌ ‌శ్రీనివాస్‌ ‌కేటీఆర్‌కు ఎందుకు ఇవ్వరు? దీని వెనక గూడుపుఠానీ ఏమిటి? అని రేవంత్‌ ‌రెడ్డి ప్రశ్నించారు. లీకేజీ వ్యవహారంతో కేటీఆర్‌కు సంబంధం లేనప్పుడు..సిట్‌ ‌విచారణ జరుగుతున్న సమయంలో.. నివేదిక ఇంకా పూర్తి కాకముందే..మంత్రికి పూర్తి సమాచారం ఎక్కడి నుంచి వొచ్చిందని ప్రశ్నించారు. కేటీఆర్‌కు సమాచారాన్ని ఎవరు ఇస్తున్నారో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని రేవంత్‌ ‌రెడ్డి వ్యాఖ్యానించారు.  కేటీఆర్‌ ‌వద్ద నిర్ధిష్టమైన సమాచారం ఉందని, ఆయనకు కూడా సిట్‌ అధికారులు నోటీసులు ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు. పేపర్‌ ‌లీకేజీల్లో జరిగిన లావాదేవీలను, ప్రమేయం ఉన్న వ్యక్తులను కాపాడేందుకు కేటీఆర్‌ ‌తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారని, కేటీఆర్‌ ‌తత్తర, తొందరపాటు చూస్తే జనానికి ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుందన్నారు. నేరాన్ని చిన్నది చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

మొత్తం ఆరోపణలు కేటీఆర్‌ ‌పైనే చేస్తున్నామని, లీకేజీ విషయం కేవలం ఇద్దరు వ్యక్తులకు(ప్రవీణ్‌, ‌రాజశేఖర్‌) ‌సంబంధించినదని మంత్రి కేటీఆర్‌ ఎలా మాట్లాడారని, సిట్‌ ‌నియమించిన తర్వాత ఈ విషయాన్ని కేటీఆర్‌ ఎలా చెప్పారని, కస్టడీలోకి తీసుకోకముందే ఇద్దరు వ్యక్తులకే సంబంధం ఉందని కేటీఆర్‌ ఎలా చెప్తారని మరోసారి ప్రశ్నించారు. ఈ కేసును విచారిస్తున్న సిట్‌ అధికారి శ్రీనివాస్‌ ‌ట్రాక్‌ ‌రికార్డు సరిగ్గా లేదు. గతంలో హై కోర్టుకు కంటెప్ట్ ఆఫ్‌ ‌కోర్టు కింద ఆయనకు రెండు వారాల శిక్ష విధించిందని తెలిపారు.  టీఎస్పీఎస్సీలో నమోదు చేసుకున్న 30 లక్షల మంది, నమోదు చేసుకొని వారు 20 లక్షల మంది ఉంటారని, మొత్తమ్మీద 50 లక్షల మంది నిరుద్యోగుల సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్న సమస్య అని, కేసీఆర్‌కు తెలంగాణ విద్యార్థులు నచ్చకపోవచ్చు కానీ జీవితాలతో చెలగాటమాడే అధికారం కేసీఆర్‌, ‌కేటీఆరుకు లేదని రేవంత్‌ ‌రెడ్డి మండిపడ్డారు.

తెలంగాణలో నిజాయితీ పరులైన అధికారులు చాలా మంది ఉన్నారని, ఇప్పటికైనా ఆంధ్రా అధికారుల చేతుల్లోంచి విచారణను తప్పించాలని, కేసీఆర్‌, ‌కేటీఆర్‌ ‌తెలంగాణ బిడ్డలైతే తక్షణమే ఈ కేసును తెలంగాణ అధికారులతో జరిపించాలన్నారు. సీబీఐ, ఈడీ, ఏసీబీ  డిపార్ట్ ‌మెంట్స్ ‌కలిపి సిట్‌ ‌వేసి ఇందులో ఉన్న పెద్దలందరిని శిక్షించాల్సిందిగా కాంగ్రెస్‌ ‌పార్టీ డిమాండ్‌ ‌చేస్తుందని రేవంత్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. గత ఏడాది అక్టోబర్‌ 16‌న నిర్వహించిన గ్రూపు 1 పరీక్షలో లాలాగూడాలోని ఒక కేంద్రంలో ఉదయం 10.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ జరగాల్సిన పరీక్షను  మధ్యాహ్నం 1 గంట నుంచి 3.30 నిమిషాల వరకూ పరీక్ష నిర్వహించారని, కావాల్సిన వ్యక్తులను ప్రత్యేకంగా కూర్చోబెట్టి.. పరీక్షలను రాయించారన్నారు. ఇతర కేంద్రాల్లోనూ కొంతమంది అభ్యర్థులకు అదనంగా సమయం కేటాయించి.. ఇతర వ్యక్తులతో పరీక్షలు రాయించారని, ఈ వివరాలను కప్పిపుచ్చారని, దీనిపై మరునాడు కొన్ని పత్రికల్లో కథనాలు వొస్తే.. సంబంధిత అధికారులు వివరణ ఇచ్చి తప్పించుకునే ప్రయత్నం చేశారని, ఈ విషయాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం కప్పిపుచ్చిందని రేవంత్‌ ‌రెడ్డి ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *