నిన్నటివరకు మునుగోడు – నేడు ప్రోటోకాల్‌ ‌వివాదం

మునుగోడు వివాదం ఇంకా చల్లారనేలేదు. ఇప్పుడు బిజెపి, టిఆర్‌ఎస్‌ల మద్య మరో వివాదం చోటుచేసుకుంది. అది పార్టీల మధ్య నే కాకుండా ఇప్పుడు ప్రభుత్వాల మధ్య వ్యవహారంగా మారింది. ఈ నెల 12న ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. అదే ఇప్పుడు వివాదగ్రస్తమవుతున్నది. మోదీ రాక సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానించే విషయంలో కావాలనే ప్రధాని కార్యాలయం అవమానించిందంటూ టిఆర్‌ఎస్‌ ‌వార్గలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ప్రధాని పర్యటనకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును ప్రోటోకాల్‌ ‌ప్రకారం ఆహ్వానించలేదన్నది వారి ఆరోపణ. దీనిపై ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు వ్యక్త మవుతున్నాయి. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ దాదాపు ఏడాది క్రితంనుండే ఉత్పత్తిని ప్రారంభిస్తుండగా ఇప్పుడు ప్రధాని పనిగట్టుకుని ఇక్కడికి రావడమన్నది బిజెపి రాజకీయ ఎత్తుగడేనన్న విమర్శ సర్వత్రా వినిపిస్తుంది.

మునుగోడు ఎన్నికల సందర్భంగా బిజెపి, టిఆర్‌ఎస్‌ ‌ల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం కొనసాగిన విషయం తెలిసిందే. ఆ నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో ఉభయ పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణతోపాటు దాడులు కూడా జరిగాయి. ఈ ఎన్నికలో తప్పకుండా విజయం సాధిస్తామన్న నమ్మకం బిజెపికి ఉండింది. కాని, ఓటమి చవిచూడాల్సి వొచ్చింది. ఇంకా ఆ బాధనుండి కోలుకోనేలేదు. ఇదే సందర్భంగా టిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏల కొనుగోలు వ్యవహారం కూడా బిజెపి పార్టీ మెడకు పడ్డ పాములా తయారైంది. ఈ వివాదం దేశ వ్యాప్తంగా బిజెపి ప్రతిష్టను దెబ్బతీసింది. ఈ రెండు సంఘటనలతో సతమతమవుతున్న ఆ పార్టీ ఒక ఎత్తుగడగానే ప్రధాని కార్యక్రమాన్ని తెలంగాణాలో ఏర్పాటు చేసిందన్న అభిప్రాయాలు

వీటికి తోడు గవర్నర్‌కు ముఖ్యమంత్రికి మధ్య పెరుగుతున్న అఘాతం ఇటీవల కాలంలో మరింతగా పెరిగింది. రాష్ట్ర పాలనా విషయాల్లో గవర్నర్‌ ‌నేరుగా జోక్యం చేసుకోవడాన్ని తెరాస నేతలు భరించలేకపోతున్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే ప్రధాని పర్యటన ఆహ్వానం ప్రోటోకాల్‌ ‌ప్రకారం కాకుండా సాధారణంగా ఆహ్వానించారన్నది టీఆర్‌ఎస్‌ ఆరోపణ. ఇది కేవలం ముఖ్యమంత్రిని అవమానించడమేకాదు, ప్రధాని కార్యాలయం తెలంగాణ ప్రజలను అవమానించిందంటూ వారు ఆక్రోషిస్తున్నారు. వాస్తవంగా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో రాష్ట్ర ప్రభుత్వానికి వాటా ఉంది. అలాంటప్పుడు ఆ ఫ్యాక్టరీని జాతికి అంకితం చేసే బృహత్తర కార్యక్రమంలో ముఖ్యమంత్రిని ప్రోటోకాల్‌ ‌ప్రకారం ఆహ్వానించకపోవడమేంటన్నది టిఆర్‌ఎస్‌తో పాటు కమ్యూనిస్టు పార్టీలు నిలదీస్తున్నాయి. ఇది ఒక విధంగా తెలంగాణ ప్రజలను అవమానించినట్లేనంటూ ఆరోపిస్తున్నాయి. అసలు తెలంగాణకు ఏం చేశారని మోదీ ఇక్కడ పర్యటన పెట్టుకున్నారంటూ ఆయన పర్యటనను అడ్డుకునేందుకు సిద్దపడుతున్నారు. సింగరేణిని ప్రైవేటు పరం చేయాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ సింగరేణి కార్మికులు, ఇక్కడ 90 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలన్న డిమాండ్‌తో పలు విద్యార్థి సంఘాలు ప్రధానిరాకను అడ్డుకుంటామంటూ ప్రకటనలు చేశాయి. కాగా విభజన హామీలేవీ కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదని, నీతి ఆయోగ్‌ ‌చెప్పినా ఒక పైసా నిధులను కూడా కేటాయించలేదని టిఆర్‌ఎస్‌ ‌తన అఫిషియల్‌ ‌ట్వీట్‌ ‌లో తీవ్రంగా విమర్శించింది.

ఇదిలాఉంటే రామగుండంలో ఏడాదిగా ఉత్పత్తి జరుగుతున్నప్పటికీ అది కేవలం ట్రయల్‌ ‌రన్‌ ‌మాత్రమేనన్నది బిజెపి వాదన. వివిధ రాష్ట్రాలకు కావల్సిన యూరియాను సరఫరా చేస్తున్న ఈ ఫ్యాక్టరీని జాతికి అంకితం చేసేందుకే ప్రధాని వొస్తున్నారనీ..అలాంటి మంచి కార్యక్రమాన్ని అడ్డుకుంటామనడం సమంజసం కాదంటూ బిజెపి వర్గాలు కూడా ఎదురుదాడి మొదలు పెట్టాయి. వాస్తవంగా పిఎంను సిఎంయే అగౌరవపర్చారంటోంది ఆ పార్టీ. గతంలో అనేక సార్లు ప్రధాని తెలంగాణలో పర్యటించినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలనే వేరే చోటుకు టూర్లు పెట్టుకున్నారని, తాజాగా బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని హైదరాబాద్‌ ‌వొస్తే సిఎం కాకుండా మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌ను పంపించారన్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. సిఎం బాధ్యతగా వ్యవహరించడంలేదంటూ ఆ పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఏది ఏమైనా మోదీ తెలంగాణ పర్యటన ఇక్కడ రాజకీయ ప్రకంపనలు లేపుతున్నది. ప్రధానిని ఈ సారైనా ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌స్వయంగా వెళతారా లేక గతంలో లాగానే మంత్రుల్లో ఎవరినైనా పంపుతారా అన్నది ఇప్పుడప్పుడే చెప్పేట్లులేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *