- వారు సమాజహితాన్ని వీడకుండా పనిచేయాలి
- నాయకులు ఉండేది ఐదేళ్లు మాత్రమే…సివిల్ సర్వెంట్లు రిటైర్ అయ్యే వరకు ఉంటారు
- సివిల్ సర్వెంట్లకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉద్బోధ
ప్రజాతంత్ర, హైదరాబాద్, ఏప్రిల్ 21 : భారతదేశాన్ని నాలుగు ప్రధాన సవాళ్లు వేధిస్తున్నాయని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. పేదరికం, ఆర్థిక సామాజిక అసమానతలు, నిరక్షరాస్యతతో భరతమాత తల్లడిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత ముఖ్యంగా అధికారులదేనని ఉద్ఘాటించారు. ప్రజాప్రతినిధుల కంటే అధికారులకే ఎక్కువ బాధ్యత ఉండాలన్న వెంకయ్య.. వ్యవస్థ, ప్రజలకు వారు జవాబుదారీతనం వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో జరిగిన నేషన్ సివిల్ సర్వీస్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకయ్య నాయుడు హాజరయ్యారు. ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్ ట్రైనీలను ఉద్దేశించి ప్రసంగించారు. నాయకుల కంటే అధికారులకే బాధ్యతలు ఎక్కువ ఉండాలన్నారు.
ప్రజాప్రతినిధులకంటే అధికారులకే ప్రజాప్రతినిధులు ఐదేళ్లకోసారి మారుతారు కానీ.. కార్యనిర్వాహకవర్గం శాశ్వతమైందని అన్నారు. వ్యవస్థ, ప్రజలకు జవాబుదారీతనం వహించాల్సింది అధికారులేనని పేర్కొన్నారు. యువ సివిల్ సర్వెంట్లు వృత్తిపరమైన నైపుణ్యాలు పెంచుకుంటూ అవకాశాలు అందిపుచ్చుకోవాలి. సమాజంలో అట్టడుగున ఉన్న ప్రజల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని పనిచేయాలి. ప్రజాస్వామ్య భారతదేశంలో కార్యనిర్వాహక వ్యవస్థ మూడో మూల స్థంభం. ప్రజలు, సమాజం, రాష్ట్రం, దేశం ప్రయోజనాల దృష్ట్యా సివిల్ సర్వెంట్లు సరైన మార్గంలో పనిచేయాలి. రాజకీయ పార్టీల నేతలు ఐదేళ్లకోసారి ప్రజల వద్దకు వెళ్ళి తీర్పు కోరతారు. అదే సివిల్ సర్వెంట్లు పదవీ విరమణ వరకు సుదీర్ఘకాలం వివిధ హోదాల్లో పనిచేయాల్సి ఉంటుంది. ప్రతి సివిల్ సర్వెంట్ నీతి, నిజాయితీ, నిర్భయంగా విధులు నిర్వహించాలి. దస్త్రాలపై సంతకాలు పెడుతూ సివిల్ సర్వెంట్లు కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
ఆ నిర్ణయం, ప్రతి దస్త్రం ఒక జీవితం, సమాజం, దేశం కావచ్చు… కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్రతి సివిల్ సర్వెంట్ నిర్భయంగా డైనమిక్ నిర్ణయాలు తీసుకోవాలి. రాజకీయ జోక్యం, నేతల ఒత్తిళ్ల పట్ల దూరంగా ఉండాలి. చట్టానికి లోబడి నిబద్ధతతో పనిచేయాలన్నారు. ఎంతో కష్టమైన పోటీని తట్టుకుని సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక అవుతున్న యువత.. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము నమ్మిన సిద్దాంతాలను వదిలిపెట్టకూడదని సూచించారు. శరవేగంగా భారతదేశం అభివృద్ధి చెందుతున్నా లింగ వివక్ష కొనసాతుండటం దురదృష్టకరమని వాపోయారు. ప్రపంచవ్యాప్తంగా అనూహ్యంగా వాతావరణ మార్పులు కూడా ఓ సవాల్. ఆ సవాళ్లు తీవ్రంగా తీసుకుని అధిగమించేందుకు సివిల్ సర్వెంట్లు కృషి చేయాలి.