హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 30 : రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసే నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవుల్లో క్రిస్టియన్ కౌన్సిల్ నాయకులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులను గుర్తించి ప్రాతినిధ్యం కల్పించాలని తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు ముల్కల ప్రవీణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం బషీర్ బాగ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను ప్రజలకు వివరిస్తూ పార్టీ గెలుపుకు కృషి చేశారని తెలిపారు. ఎన్నికల సమయంలో టిపిసిసి అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రైస్తవులకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం క్రైస్తవులను నమ్మించి మోసం చేసిందని ఆయన ఆరోపించారు. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం నిజమైన క్రైస్తవులను గుర్తించి నామీనేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి సన్ని ఎడ్వార్డ్, మహిళ అధ్యక్షురాలు జి.షీబా, ఉపాధ్యక్షులు పెద్దేల్లి డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.
నామినేటెడ్ ఎమ్మెల్సీలు నిజమైన క్రైస్తవులకే ఇవ్వాలి





