- రాజ్యాంగ వ్యవస్థలను రక్షించుకోవాలి
- పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రాహుల్ గాంధీ
న్యూ దిల్లీ, ఏప్రిల్ 9 : రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అసవరం అత్యవసరంగా ఏర్పడిందని కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ అన్నారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే, ముందు వ్యవస్థలను కాపాడుకోవాలన్నారు. కానీ అన్ని వ్యవస్థలు ప్రస్తుతం ఆర్‌ఎస్‌ఎస్ చేతుల్లో ఉన్నాయని రాహుల్ విమర్శించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దిల్లీలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అధికారం కోసం రాజకీయ నాయకులు ఆరాటపడుతుంటారని, జీవితం అంతా శ్రమిస్తారని, కానీ అధికారం ఉన్న కుటుంబంలో తాను పుట్టానని, అందుకే తనకు ఆ ఆసక్తి లేదని రాహుల్ అన్నారు. కానీ దేశాన్ని అర్థం చేసుకోవాలన్న ఆసక్తి తనకు ఉన్నట్లు రాహుల్ చెప్పారు. ఇటీవల ముగిసిన యూపీ ఎన్నికల్లో మాయావతి పోటీపడలేదని, కూటమి ఏర్పాటు చేయాలని ఆమెకు సందేశం ఇచ్చామని, కానీ ఆమె స్పందించలేదన్నారు.
యూపీలో దళితుల కోసం కాన్షీరామ్ తన గళాన్ని వినిపించారని, దాని వల్ల కాంగ్రెస్‌కు ప్రమాదం ఏర్పడిందన్నారు. కానీ మాయావతి ఈసారి దళితుల స్వరాన్ని వినిపించలేదని, ఎందుకంటే సీబీఐ, ఈడీ, పెగాసెస్‌లకు ఆమె భయపడిందని రాహుల్ విమర్శించారు.