- గీత దాటితే చర్యలు తప్పవనే సంకేతాలు
- అసమ్మతి నేతలకు నో అపాయింట్‌మెంట్
ప్రజాతంత్ర , హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఆ పార్టీ అధిష్టానం పూర్తి అండగా నిలచింది. పార్టీలో అసమ్మతి స్వరం వినిపిస్తున్న సీనియర్ నేతలకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఇప్పటికే అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డిపై తరచూ విమర్శలు గుప్పిస్తున్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పార్టీ పదవుల నుంచి తప్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న అధిష్టానం పెద్దలు ఇకపై ఈ తరహా చర్యలను ఎట్టి పరిస్తితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఇందులో భాగంగానే పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనీ, ఎప్పటి నుంచి పార్టీలో ఉన్న తమను సరైన గౌరవం ఇవ్వడం లేదని ఫిర్యాదు చేయడానికి దిల్లీకి వెళ్లిన అసమ్మతి నేతలకు కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకుంటా ఝలక్ ఇచ్చింది.
పార్లీమెంటు సమావేశాల సందర్భంగా దిల్లీలోనే ఉన్న రేవంత్ రెడ్డి తనకు అనుకూలంగా ఉన్న దిల్లీ పెద్దల ద్వారా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు, అసమ్మతి నేతలతో పార్టీకి వాటిల్లుతున్న నష్టం గురించి ఏఐసిసి అధినేత సోనియా గాంధీ, కీలక నేత రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. పార్టీ పరంగా నిర్వహించే కార్యక్రమాలకు సీనియర్ నేతలు తరచూ అడ్డు తగులుతున్నారనీ, దీంతో అధికార టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు రాజకీయ లబ్ది కోసం వారిని వాడుకునే ప్రయత్నం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి అధిష్టానం పెద్దల దృష్టికి తీసుకు వెళ్లినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇటీవల తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఫుటేజ్ కూడా రేవంత్ రెడ్డి అధిష్టానం పెద్దలకు అందజేశారనీ, అన్ని విషయాలనూ సావధానంగా విన్న ఏఐసిసి పెద్దలు రేవంత్ రెడ్డికి ఫుల్ సపోర్ట్‌గా ఉంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకు రావడమే ఏకైక లక్ష్యంగా పనిచేయాలనీ, అందుకు తాము అండగా ఉంటామని ఏఐసిసి నేతలు రేవంత్‌రెడ్డికి హామీ ఇచ్చినట్లు సమాచారం.
పనిలో పనిగా రాష్ట్రంలోని కొంతమంది సీనియర్ నేతలకు రేవంత్ రెడ్డికి సహకరించాలనీ, లేనిపక్షంలో పార్టీలో ప్రాధాన్యం ఉండదని స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. అందుకే గత వారం రోజులుగా రేవంత్ రెడ్డి నాయకత్వంపై ధిక్కార స్వరం వినిపించిన జగ్గారెడ్డితో పాటు పార్టీ సీనియర్ నేతలు సైలెంట్ అయ్యారని పార్టీలో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే పార్టీ కార్యక్రమాలు కొనసాగాలనీ, ఎవరు ధిక్కరణ చర్యలకు పాల్పడ్డా ఉపేక్షించేది లేదని ఏఐసిసి పెద్దలు అంతర్గతంగా సీనియర్ నేతలకు స్పష్టం చేసినట్లు సమాచారం.