దౌర్జన్యాలు పునరావృతమైతే…చీల్చీ చెండాడుతాం

  • సీఎం, డీజీపీ నీతిమంతులైతే… న్యాయ విచారణ జరపాలి
  • నీచానికి పాల్పడిన పోలీసులు యూనిఫాంలో ఉండేందుకు వీలులేదు
  • మాజీ మంత్రి బిజేపీ నేత ఈటెల రాజెందర్‌

‌మెదక్‌ ‌ప్రతినిధి ప్రజాతంత్ర(ఏప్రిల్‌19):‌టీఆర్‌ఎస్‌ ‌నేతలు, పోలీసులు కుమ్మక్కై రాష్ట్రంలో సామాన్య ప్రజలు, బిజేపీ కార్యకర్తలపై రామాయంపేట లాంటి ఘటనలు పునరావృతం చేస్తే చీల్చి చెండాడుతామని మాజీ మంత్రి, బిజేపీ నేత ఈటెల రాజెందర్‌ ‌హెచ్చరించారు. సీఎం, డీజీపీ నీతిమంతులైతే… నిజాయితీ పాలన కొనసాగించగలిగితే రామాయంపేట ఘటనపై న్యాయ విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. తల్లీ కొడుకుల ఆత్మబలిదానాలపై కొనసాగుతున్న ఆందోళనల్లో భాగంగా మంగళవారం రామాయంపేట బంద్‌కు అఖిలపక్షం పిలుపునిచ్చింది. బంద్‌లో భాగంగా ఈటెల రాజెందర్‌, ‌మాజీ ఎంపీ వివేక్‌, ‌దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, బిజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డంశ్రీనివాస్‌లతో కలిసి ఆయన బంద్‌లో పాల్గొన్నారు.

పట్టణంలో నిర్వహించిన నిరసన కార్యక్రమం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలీసుబలంతో ప్రభుత్వం విర్రవీగుతుందన్నారు. అవినీతి, అరాచకాలు రాష్ట్రంలో పెట్ర గిపోతున్నాయన్నారు. హుజురాబాద్‌ ‌తరహాలతో రాష్ట్రమంతట ప్రజలు కేసీఆర్‌ ‌ప్రభుత్వాన్ని తరిమి కొట్టేందుకు సిద్ధమవుతున్నారని అన్నారు. రామాయంపేట ఘటనపై సమగ్ర విచారణ జరగకపోతే ఉన్నత న్యాయ స్థానాలను ఆశ్రయించి పోలీసులను సైతం దోషులుగా నిలబెట్టాల్సి వస్తుందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలను చూస్తుంటే….పోలీసు శాఖపై ప్రజలు విశ్వాసాన్ని కోల్పోతున్నారని అన్నారు.

చనిపోయిన తల్లికొడుకులవి ఆత్మహత్యలు కావని, అవి ప్రభుత్వ వైఫల్యంతో జరిగిన సంఘటనలని ఆయన ఆరోపించారు. జిల్లా ఎస్పీ 24గంటల్లో నిందితులను అరెస్ట్ ‌చేస్తామని హామినిచ్చి…3రోజులు గడుస్తున్నా… పట్టుకోక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. వారి తీరుమార్చుకొని ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్‌ ‌చేశారు. ఈ ఆందోళనలో బిజేపీ నేత రవిందర్‌రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page