కేంద్ర హోం మంత్రిత్వశాఖ పరిధిలో న్యూఢిల్లీ కేంద్రంగా సేనలు అందిస్తున్న ‘కేంద్ర పారిశ్రామిక భద్రత దళం (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సిఐయస్‌యఫ్)’ పార్లమెంట్‌లో చేసిన చట్టం-1968తో 10 మార్చి 1969న 2,800 మంది ఉద్యోగులతో 3 బటాలియన్ల దళాలతో ప్రారంభమైంది. 15 జూన్ 1983న చేసిన మరో చట్టంతో ప్రస్తుతం సిఐయస్‌యఫ్‌లో 1,48,371 ఉద్యోగులు (2017లో ఉద్యోగుల సంఖ్య 1,80,000కు పెంచబడింది), 10,179.61 కోట్ల బడ్జెట్‌తో దేశవ్యాప్తంగా పలు నగరాల్లో విస్తరించబడివుంది.
సిఐయస్‌యఫ్ ముఖ్య విధులు:
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, 300ల పారిశ్రామిక కేంద్రాలు, ప్రభుత్వ మౌళిక వసతులకు రక్షణ, భద్రత కవచాలుగా సిఐయస్‌యఫ్ సేనలు, విధులను నిర్వహిస్తున్నారు. అణు విద్యుత్, అంతరిక్షం, గనులు, చమురు క్షేత్రాలు, రిఫైనరీలు, భారీ ఇంజనీరింగ్ కేంద్రాలు, ఉక్కు, ఎరువుల కర్మాగారాలు, మెట్రో రైల్ వ్యవస్థలు, వారసత్వ కట్టడాలు, విఐపిల (జడ్ ప్లస్, జడ్, ఎక్స్, వై) భద్రతలు, ఎయిర్ పోర్టులు, నావికాదళ పోర్టులు, విద్యుత్, నోట్ల ముద్రణ లాంటి అనేక ప్రముఖ కేంద్రాలు/సంస్థలు/విఐపిలకు రక్షణగా భద్రతను కల్పిస్తున్న గురుతర భాద్యతలను సిఐయస్‌యఫ్ సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నది. ప్రకృతి/మానవ కల్పిత విపత్తులతో పాటు శాంతి భద్రతల నిర్వహణ, అగ్నిమాపక అత్యవసర సేవలను కూడా ఈ దళం చేపడుతోంది.
దేశవ్యాప్తంగా విస్తరణ:
దేశవ్యాప్తంగా 9 సెక్టార్లతో (ఎయిర్‌పోర్ట్, నార్త్, నార్త్-ఈస్ట్, ఈస్ట్, వెస్ట్, సౌత్, ట్రేనింగ్, సౌత్-ఈస్ట్, సెంట్రల్ సెక్టార్లతో పాటు అగ్నిమాపక శాఖ) విస్తరించబడిన సిఐయస్‌యఫ్‌కు డిజీగా ఐపియస్ అధికారి నాయకత్వం వహిస్తారు. సిఐయస్‌యఫ్ చట్టం-2008/2009తో భద్రత సేవలను విశ్వవిద్యాలయాలు, విదేశీ భారత మిషన్లు, ఐరాస శాంతి స్థాపన విధులు (పీస్ కీపింగ్ ఆపరేషన్లు), రుసుము తీసుకొని ఇన్ఫోసిస్/రిలియన్స్ లాంటి ప్రైవేట్ సంస్థలకు కూడా భద్రతలను అందించే మరి కొన్ని విధులను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్నది. సిఐయస్‌యఫ్‌లో నేడు 12 రిజర్వ్ బటాలియన్లు, 08 శిక్షణ సంస్థలు, 63 ఇతర విభాగాలు పని చేస్తున్నాయి.
సిఐయస్‌యఫ్ వ్యవస్థాపక దినం-2023:
10 మార్చి 1969 రోజున ప్రారంభమైన కారణంగా ప్రతి ఏటా ’సిఐయస్‌యఫ్ వ్యవస్థాపక దినాన్ని‘ 10 మార్చిన దేశవ్యాప్తంగా ఆయా సంస్థలు ఘనంగా నిర్వహిస్తున్నాయి. 10 మార్చి 2023న సిఐయస్‌యఫ్ తన 54వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటున్నది. ఈ దినోత్సవాల్లో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు సన్మానాలు, ఆత్మవిశ్వాసంతో నిండిన కవాతులు, అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించడం లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు.
సేఫ్టీ అండ్డ సెక్యూరిటీ నినాదం:
కేంద్ర ఆర్మీ సాయుధ పోలీస్ (సిఏపియఫ్)గా విస్తరించబడిన ఈ పారామిలిటరీ క్రమశిక్షణ సంస్థ నినాదం ‘రక్షణ మరియు భద్రత’ అనబడే తీసుకొని విశిష్ట సేవలను అందిస్తూ, దేశ అయువు పట్టుగా నిలుస్తున్న ముఖ్య కేంద్రాల భద్రతను సమర్థవంతంగా నిర్వహిస్తున్నది. దేశ సర్వతోముఖాభివృద్ధిలో సింహ భాగమైన ప్రముఖ ప్రభుత్వరంగ సంస్థలకు రక్షక కవచంగా నిలుస్తూ, ప్రతి క్షణం డేక కళ్ళతో కాపలా కాస్తున్న సిఐయస్‌యఫ్ సైనికులకు కృతజ్ఞతలు తెలుపాల్సిన కనీస బాధ్యత దేశపౌరులందరి మీద ఉన్నది.
డా: బుర్ర మధుసూదన్ రెడ్డి
కరీంనగర్ – 99497 00037