- రాజకీయ ఫ్రంట్‌ల అవసరం లేదు
- ఆర్థిక శక్తిగా ఎదిగే వనరులను భారత్ కలిగి ఉంది
- నూతన వ్యవసాయ, ఆర్థిక, పారిశ్రామిక విధానం రావాలి
- అందుకు తెలంగాణ ప్రత్యామ్నాయ వేదిక కావాలి
- వనరులను ఉపయోగించుకునే సత్తా కావాలి
- దేశానికి తెలంగాణ తరహాలో పాలన అందాలి
- టిఆర్‌ఎస్ ప్లీనరీ వేదికగా రాజకీయ మార్పునకు కెసిఆర్ పిలుపు
- దుర్మార్గంగా మారిన గవర్నర్ వ్యవస్థ…అన్ని రాష్ట్రాల్లోనూ వారితో పంచాయితీలే
- అంటూ కెసిఆర్ మండిపాటు
- దళితబంధు పథకం దేశానికే ఆదర్శమన్న సిఎం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27 : ఈ దేశానికి కావాల్సింది రావాల్సింది రాజకీయ ఫ్రంట్‌లు కాదని… ఇవేం సాధించలేవని, ఇవాళ దేశానికి కావాల్సింది ప్రత్యామ్నాయ ఎజెండా అని టిఆర్‌ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ అన్నారు. ఒక అద్భుతమై ప్రగతి పథంలో తీసుకెళ్లే ఎజెండా కావాలి. ఆ సిద్దాంతానికి ప్రతిపాదిక పడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ ప్లీనరీ వేదికగా సీఎం కేసీఆర్ ప్రసంగించారు. 2000లో తాను తెలంగాణ అని మాట్లాడితే.. ఏం పని లేదా అని కొందరు అన్నారు. సంకల్పంతో జన్మనిచ్చిన తల్లి దండ్రులకు, ఆ భగవంతుడికి దండం పెట్టి బయలుదేరి తెలంగాణ సాధించాం. అంతేకాదు..సాధించిన తెలంగాణను దేశానికి రోల్‌మోడల్‌గా నిలిచేలా చేశామన్నారు. చేయగలిగే సామర్థ్యం, సంకల్పం, చిత్తశుద్ధి ఉంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థికశక్తిగా ఎదిగే వనరులను భారత్ కలిగి ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. కానీ ఇవాళ దుఖ పడుతున్నాం. నివారణ జరగాలి.
కేసీఆర్ రాజకీయ ఫ్రంట్ ప్రకటిస్తాడా? అని అంటున్నారు. దేశం బాగు కోసం ఒక ప్రాసెస్ జరగాలి. భారతదేశ ప్రజలకు అనుకూలమైన ఫ్రంట్ ఉంటది. ఈ దేశాన్ని గొప్పగా తీర్చిదిద్దే ప్రత్యామ్నాయ ఎజెండాకు శ్రీకారం చుడుదాం. దేశం బాగుపడటానికి మన రాష్ట్రం నుంచి ప్రారంభం జరిగితే అది మనందరికీ గర్వకారణం అని సీఎం అన్నారు. తెలంగాణ ప్రజల పక్షాన.. దేశ రాజకీయాలను ప్రభావితం చేయడానికి, గతిని, స్థితిని మార్చడానికి, దేశాన్ని సరైన ప్రగతి పంథాలో నడిపించడానికి హైదరాబాద్ వేదికగా కొత్త ఎజెండా, ప్రతిపాదన, సిద్దాంతం తయారై దేశం నలుమూలల వ్యాపిస్తే ఈ దేశానికే గర్వకారణంగా ఉంటుందని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ రాజకీయ గుంపు కాదు.. కూటమి కాదు.. ప్రత్యామ్నాయ ఎజెండా ఈ దేశానికి కావాలి. ఆ దారులు వెతకాలని సూచించారు. నూతన వ్యవసాయ విధానం, నూతన ఆర్థిక విధానం, నూతన పారిశ్రామిక విధానం రావాలి. అందుకు అవసరమైన వేదికలు తయారు కావాలి. ఆ భారతదేశం లక్ష్యంగా పురోగమించాలి. సంకుచిత రాజకీయాలు వద్దు. దేశానికి కావాల్సింది అభ్యుదయ పథం కావాలి. అప్పుడే దేశం అద్భుతంగా బాగుపడతది. ఉజ్వలమైన భారత్ తయారవుతోంది అని కేసీఆర్ పేర్కొన్నారు. దేశానికి కావాల్సింది బీజేపీని గద్దె దించడమో, రాజకీయ ఎజెండానో కాదని.. ప్రత్యామ్నాయ ఎజెండా అవసరమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. టీఆర్‌ఎస్ 21వ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా హైదరాబాద్ హెచ్‌సీసీలో జరిగిన ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో జాడ్యాలు, అవాంఛితమైన, అనారోగ్యకరమైన, అవసరమైన పెడధోరణులు ప్రబలుతున్నాయన్నారు. భారత దేశం శాంతికి అలవమైన సమాజం. కానీ, అవసరమైన జాఢ్యాలు పెరిగిపోతున్నాయి. ఇది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. ఇంత అద్భుతమైన దేశంలో సంకుచిత, ఇరుకైన విధానాలు.. దేశ గరిమకు గొడ్డలి పెట్టుగా పరిణమిస్తున్నాయి.
మంచి మార్గాలు కనిపించడం లేదు. అందుకే ఒక రాష్ట్రంగా ఏం చేయాలో, మన ప్రవర్తన ఎలా ఉండాలి.. ఎలాంటి పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. అలాగే దేశ అభ్యున్నత కోసం యధాశక్తిగా కృషి చేయాల్సి ఉంటుందని సీఎం కేసీఆర్ పిలుపు ఇచ్చారు. తెలిసిన దాని చుట్టే ఆలోచనలు తిరుగుతున్నాయి. చదువుకున్న వాళ్లకు సైతం చాలా విషయాలు దూరంలోనే ఉన్నాయి. 75 ఏళ్ల స్వాతంత్య్రలో ఏం జరిగందో దేశ ప్రజలందరికీ తెలుసు. ఏ పద్ధతిలో స్వాతంత్య ్రఫలాలు ప్రజలకు లభించాలో ఆ పద్ధతిలో లభించలేదు. తెలంగాణ పని చేసిన పద్ధతిలో దేశం పని చేసి ఉంటే.. ఫలితం మరోలా ఉండేది. ఈ మాట కాగ్, ఆర్థిక నిపుణులు చెప్తున్న మాట. దేశంలో కరెంట్‌కోతలు కొనసాగుతుంటే.. తెలంగాణ మాత్రం వెలుగు జిలుగులని గర్వంగా చెప్తున్నా. తాగునీరు, కరెంట్ అందలేని పరిస్థితులు. వాళ్ల ఉపన్యాసాలు వింటే మైకులు పగిలిపోతాయి. వాగ్దానాలు ఎక్కువ.. పని తక్కువ. ఇంత దుస్థితి ఎందుకు? ఎవరి అసమర్థత? వనరులు లేవంటే వేరు.. కానీ, ఉండి కూడా అందించలేని పరిస్థితి దాపురించిందన్నారు. పరిష్కారాలు కనబర్చాల్సింది విపరీతంగా ఉన్న సమస్యల వి•ద. ప్రపంచంలోనే యువ జనాభా ఉన్న దేశం భారత్.. కానీ, దరిద్రమే తాండవిస్తోంది. ప్రతిభాపాటవాలను విదేశాల్లోనే ఖర్చు పెడుతున్నారు. అద్భుతంగా పురోగమించాల్సిన దేశం.. వెనుకబడి పోతోంది. మట్టిని కూడా సింగపూర్ పొరుగుదేశం నుంచి తెచ్చుకుంటుంది. నీళ్లు కూడా మలేషియాదే. కానీ, వాళ్ల ఆర్థిక పరిస్థితి ఎందుకు మెరుగ్గా ఉంది. ఇది కఠోరమైన వాస్తవం. నిప్పులాంటి నిజం. హేతు బద్ధమైన వాదం. స్వచ్ఛమైన కఠోరమైన వాస్తవం. కాదనుకుంటే నీతి ఆయోగే ఖండించేది కదా అన్నారు. అన్నీ మనకే తెలుసన్న అహంకారం పక్కనపెట్టాలి.. తెలిసిన వాళ్లను తెలియని వివరాలు అడిగి నేర్చుకోవాలి. అలా చేయబట్టే తెలంగాణ ప్రతీ రంగంలో అవార్డులు సాధిస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. కొన్ని పార్టీల మిత్రులు మనమంతా ఏకం కావాలని, బీజేపీని గద్దె దించాలని కోరారు. చెత్త ఎజెండా తాను వెంట రాలేనని చెప్పానని సీఎం కేసీఆర్ అన్నారు. గద్దె ఎక్కించాల్సింది ప్రజలని, తెలియజేయాల్సింది ప్రజలకు, మారాల్సింది దేశ ప్రజల జీవితాలు, కావాల్సింది మౌలిక వసతులని సీఎం కేసీఆర్ ప్రసంగించారు. అందరికీ రేషన్ బియ్యం ఇచ్చినందుకే వోటేయాలని ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలను కోరాడు. ఇదా పరిస్థితి అన్నారు. దేశం తన లక్ష్యం కోల్పోయింది. లక్ష్యరహిత దేశంగా భారత్ ముందుకెళ్తోంది. సామూహిక లక్ష్యాన్ని కోల్పోయి ఏకతాటిగా భారత్ ఎందుకు ముందుకు వెళ్లలేకపోతోందన్నారు. ఈ క్రమంలో మనపయనం ఎలా ఉందో సవి•క్షించుకోవాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలో అనారోగ్యమైన వాతావరణం నెలకొంది. రావాల్సింది రాజకీయ ఫ్రంట్‌లు కాదని, రాజకీయ పునరేకీరణ కాదని, ప్రత్యామ్నాయ ఎజెండా కావాలని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు. నూతన వ్యవసాయం, పారిశ్రామిక, ఆర్థిక విధానాలు కావాలి. ప్రతీ ఒక్కరికీ పని చేసే అవకాశం రావాలి. అద్భుతమైన దేశ నిర్మాణం జరగాలి. అంతేకానీ, సంకుచిత రాజకీయం కాదన్నారు. పాలమూరు జిల్లాలో వలసలు ఆగిపోయాయని అన్నారు. ఇవాళ తెలంగాణకు 11 రాష్టాల నుంచి మన వద్దకు వలసలు వస్తున్నారు. బీహార్ హమాలీ కార్మికులు లేకపోతే తెలంగాణ రైస్‌మిల్లులు నడవడం లేదు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ లో భవన నిర్మాణ రంగంలో ఉత్తరప్రదేశ్, బీహార్ కార్మికులు పని చేస్తున్నారు. తెలంగాణలో పని పుష్కలంగా దొరుకుతోంది. శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నాయని కేసీఆర్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలో అవినీతి రహిత పాలన… టిఆర్‌ఎస్ రాష్ట్రానికి పెట్టని కోట
రాష్ట్రంలో అవినీతికి తావులేకుండా పాలన సాగిస్తున్నామని, అవినీతి మంత్రులు లేరని సీఎం కేసీఆర్ అన్నారు. అవినీతి రహితంగా, చిత్తశుద్ధితో ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నామని తెలిపారు. హెచ్‌ఐసీసీలో టీఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో బుధవారం కేసీఆర్ మాట్లాడుతూ.. పాలమూరు- రంగారెడ్డిని పూర్తి చేసుకుంటే రాష్ట్రం మరింత సస్యశ్యామలంగా మారుతుందన్నారు. ఎందరో మహానుభావులు, శ్రేణుల కష్టమే టీఆర్‌ఎస్‌కు ఈ విజయం సాధించి పెట్టిందని తెలిపారు. కర్నాటకలో అవినీతికి పాల్పడిన ఒకరు మంత్రి పదవి కోల్పోయారని, ఆ పరిస్థితి తెలంగాణలో రాదన్నారు. ధరణి ద్వారా రైతులు, భూ యాజమాన్య సమస్య తీరిందని తెలిపారు. గొప్పలు చెప్పుకొని పొంగిపోవడం లేదు..వాస్తవాలు మాట్లాడుకుంటున్నామన్నారు. పలు పెద్ద రాష్ట్రాలను అధిగమించి మన తలసరి ఆదాయం రూ.2,78,000ని రెట్టింపు కంటే ఎక్కువగా చేసుకున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒకప్పుడు 3 మెడికల్ కాలేజీలుంటే ఇప్పుడు 33కు పెంచామని తెలిపారు. పోలీస్ కానిస్టేబుల్, గ్రూప్-1 నోటిఫికేషన్ కూడా ఇచ్చామన్నారు. తెలంగాణను జీరో ప్లోరైడ్ రాష్ట్రంగా నిలిపామని కేసీఆర్ పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ తెలంగాణ ప్రజల ఆస్తి అని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణకు టీఆర్‌ఎస్ ఒక రక్షణ కవచం అన్నారు. రాష్ట్రానికి టీఆర్‌ఎస్ పెట్టని కోట అని..దాన్ని ఎవరూ బద్దలు కొట్టలేరని కేసీఆర్ పేర్కొన్నారు. ఎన్నో అవమానాలు, ఛీత్కారాలు, ఓటములు…గెలుపుల తర్వాత రాష్ట్రాన్ని సాధించుకున్నామని, ఇప్పుడు దేశానికే రోల్ మోడల్‌గా పాలన సాగిస్తున్నామని కేసీఆర్ తెలిపారు. 60 లక్షల మంది పార్టీ కార్యకర్తలతో..వెయ్యి కోట్లకు పైగా ఆస్తులు ఉన్న పార్టీ ఒక్క టీఆర్‌ఎస్ మాత్రమేనని అన్నారు. తెలంగాణ ప్రజల కాపలాదారు టీఆర్‌ఎస్ పార్టీ అని, దేశంలో 10 ఉత్తమమైన గ్రామాల్లో అన్ని తెలంగాణ ప్లలెలే ఉన్నాయన్నారు. దేశంలో 20 ఉత్తమ గ్రామాల్లో కూడా 19 తెలంగాణవే ఉన్నాయని తెలిపారు. అవార్డులు, రివార్డులు రాని శాఖలు తెలంగాణలో లేనేలేదన్నారు. సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ రంగంలో అద్భుతమైన ప్రగతి సాధించామని తెలిపారు. ఏ రంగం తీసుకున్నా అద్భుతమైన ఫలితాలను తెలంగాణ రాష్ట్రం సాధించిందని కేసీఆర్ తెలిపారు.
దుర్మార్గంగా మారిన గవర్నర్ వ్యవస్థ… అన్ని రాష్ట్రాల్లోనూ వారితో పంచాయితీలే
గవర్నర్ వ్యవస్థపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. టీఆర్‌ఎస్ ప్లీనరీలో ఆయన మాట్లాడుతూ.. గవర్నర్ వ్యవస్థ దుర్మార్గంగా మారిందన్నారు. గవర్నర్ వ్యవస్థ వక్రమార్గంలో నడుస్తోందన్నారు. మహారాష్ట్రలో 12 మంది ఎమ్మెల్సీల కోసం తీర్మానం చేసి పంపితే గవర్నర్ తన వద్దే పెట్టుకున్నారన్నారు. తమిళనాడు, బెంగాల్‌లో సైతం పంచాయితీ నడుస్తోందన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌పై కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. ప్రజల బలంతో గెలిచిన ఎన్టీఆర్ దుర్మార్గపు గవర్నర్ వ్యవస్థను గద్దె దించారన్నారు. అదే ఎన్టీఆర్‌ను ప్రజలు తిరిగి గద్దెను ఎక్కించారన్నారు. దేశంలో కొత్త రాజకీయ శక్తి ఆవిర్భవించాలన్నారు. అందులో టీఆర్‌ఎస్ కీలక భూమిక పోషిస్తుందన్నారు. దేశంలో జరుగుతున్న పరిణామాలపై చర్చ జరగాలని.. జాతిపితను చంపిన హంతకులను పూజించడం దుర్మార్గమన్నారు. మత పిచ్చితో దేశాన్ని ఎటువైపు తీసుకు వెళుతున్నారని కేసీఆర్ ప్రశ్నించారు. ఇటీవల ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ ఓ వ్యాసం రాశాడని.. అది తనను ఎంతో ఆకట్టుకుందని సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితిగా మార్చాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ వ్యాసం రాసినట్లు ఆయన వివరించారు. తెలంగాణ సాధన కోసం పెట్టిన పార్టీ లక్ష్యాన్ని సాధించిందని.. ఇప్పుడు భారత దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపే రాజకీయ పార్టీ కావాలి కాబట్టి ఆయన టీఆర్‌ఎస్ పార్టీ పేరును భారతీయ రాష్ట్ర సమితిగా మార్చాలని కోరుతున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు. అయితే ఈ దేశంలో కొత్త రాజకీయ శక్తి ఆవిర్భావించాలని, సందర్భానుసారం స్పందించే గుణం ఉండాలని కేసీఆర్ ఆకాంక్షించారు. దేశంలో తుఫాన్‌ను సృష్టించి దుర్మార్గాలను తరిమేసే రోజులు దగ్గర్లోనే ఉంటాయన్నారు. అందులో టీఆర్‌ఎస్ కూడా ఉజ్వలమైన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
దేశానికి ఆదర్శంగా దళితబంధు పథకం
దళితబంధు దేశానికి, ప్రపంచానికే ఆదర్శం కాబోతుందని సిఎం కేసీఆర్ అన్నారు. దళితులలో ఎంతో మంది ప్రతిభాసంపన్నులకు ఇప్పటివరకు అవకాశాలు లేవన్నారు. శక్తి ఉన్నా, పైకి రావాలనే ఆలోచన ఉన్నా అవకాశం లేకనే వెనుకపడ్డారన్నారు. ఆరేడేళ్లలో భారత సమాజానికే తెలంగాణ ఎస్సీ సమాజం ఆదర్శంగా నిలవబోతోందన్నారు. దళితబంధు అంటే రూ.10 లక్షలు ఇవ్వడం కాదని.. ఆ లక్ష్యాలను తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా అమలు చేస్తోందన్నారు. 17.50 లక్షల కుటుంబాలకు దశలవారీగా 2 నుంచి రెండున్నర లక్షల చొప్పున ప్రతి కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ఇందులో కిస్తీలు, కిరికిరిలు, బ్యాంకులో తిరిగి కట్టేది ఏదీ లేదన్నారు. దళితులు వారికి నచ్చిన, వారు మెచ్చిన పనిని చేసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. ప్రభుత్వం లైసెన్సులు ఇచ్చే అన్ని రంగాల్లో రిజర్వేషన్ ఉంటుందన్నారు. మెడికల్ షాపులు, ఫెర్టిలైజర్ షాపులు, హాస్టల్ , ఆసుపత్రి , వైన్ షాపులు, బార్ షాపుల్లో కూడా రిజర్వేషన్ అమలు చేశామన్నారు. తెలంగాణలో 261 షాపులను దళితబిడ్డలు నడుపుతున్నారని సీఎం వెల్లడించారు. దళితబంధులో ఆర్థిక ప్రేరణ, అన్నింట్లో రిజర్వేషన్లు కల్పించడం, ప్రపంచంలోనే ఎక్కడా లేనటుంవంటి సపోర్టు అందించా మన్నారు. దళితబంధు లబ్దిదారుల రక్షణ కోసం దళిత రక్షణ నిధిని ఏర్పాటు చేశామన్నారు. ఈ దళిత రక్షణ నిధిలో 10వేలు లబ్దిదారుని నుంచి, ప్రభుత్వం మరో 10 వేలు కలిపి ఈ నిధిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో అద్భుతాలు జరుగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులందరూ ఈ పథకాన్ని పటిష్ఠంగా అమలు చేయాలని సూచించారు. అంబేడ్కర్ ఆశయాలను నెరవేర్చడంలో రాష్ట్రం ముందడుగు వేయాలని సీఎం కేసీఆర్ సూచించారు.