దేశానికి ఆద‌ర్శంగా భూభార‌తి: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

– భూభార‌తి పేద‌ల చ‌ట్టం
-ప్ర‌తిరైతుకు భ‌ద్ర‌త‌
-త‌హ‌సీల్దార్ నుంచి సీపీఎల్ ఏ వ‌ర‌కు ఐదంచెల వ్య‌వ‌స్థ ఏర్పాటు
-రుద్రంగి మండ‌లంలో ఇందిర‌మ్మ ఇళ్ల‌కు శంకుస్థాప‌న‌
– రెవెన్యూ స‌ద‌స్సులో పాల్గొన్న మంత్రులు

సిరిసిల్ల, ప్రజాతంత్ర,మే 16 : దేశానికి ఆదర్శంగా ప్రభుత్వ రూపొందించిన భూ భారతి  చట్టం నిలుస్తుందని  రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి  పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం రుద్రంగి మండలం  గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన భూ భారతి చట్టం – 2025 పై నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయ‌న‌ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) రవాణా , బీసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా  పొంగులేటి మాట్లాడుతూ గత ప్రభుత్వ పెద్దలు  ఎవరి అభిప్రాయాలు తెలుసుకోకుండా  ధరణి చట్టం రూపొందించార‌న్నారు.  కాంగ్రెస్ ప్ర‌భుత్వం  దేశంలోని 18 రాష్ట్రాల్లో అమ‌ల‌వుతున్న 20 చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించి వేల మంది ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని వారి కోరిక మేరకు భూ భారతి చట్టం తయారు చేసింద‌న్నారు. ఎన్నో రాత్రులు శ్రమించి, మేధావులతో చర్చించి, రైతుల‌కు మంచి జరగాలనే తపనతో భూ భారతి చట్టాన్ని రూపొందించామ‌న్నారు.  భవిష్యత్తులో ఏ రాష్ట్రంలో రెవెన్యూ చట్టం తయారు చేయాలన్నా ఆదర్శంగా ఉండే విధంగా ఈ చ‌ట్టాన్ని ప్రభుత్వం తయారు చేసిందన్నారు.  తమ ప్రభుత్వం భూ భారతి చట్టంలో నిబంధ‌న‌లు పొందుప‌ర‌చింద‌న్నారు. వీటి ప్రకారం సాధా బైనామా దరఖాస్తులు తేలిగ్గా పరిష్కారమ వుతాయన్నారు.

పెండింగ్‌లో వున్న‌  సాదా బైనామా చట్టం సమస్యలకు భూ భారతి ద్వారా పరిష్కారం లభిస్తుందని స్ప‌ష్టం చేశారు. గత ప్రభుత్వం సాదా బైనమా దరఖాస్తులు స్వీకరించినప్పటికీ ధరణి చట్టంలో సాదా బైనమా గురించి  అసలు పేర్కొన‌లేద‌న్నారు.  భూ సరిహద్దులతో పాటు భూమి కొలతలు పూర్తిగా వుండే విధంగా రిజిస్ట్రేషన్ వ్యవస్థలో మార్పులు తీసుకువ‌చ్చామన్నారు. కర్ణాటక  విధానాలను అనుస‌రిస్తూ  రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాలలో 6 వేల లైసెన్స్ క‌లిగిన‌   ప్రైవేటు సర్వేయర్లను ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చి, మ్యాప్ పై సర్వే సంతకంతో కంప్యూటర్ లో అప్ లోడ్ చేస్తేనే రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ జరిగేలా వ్యవస్థ ఏర్పాటు చేశామని అన్నారు.  రాబోయే రోజులలో ప్రభుత్వం మరో వెయ్యి మంది సర్వేయర్లను తీసుకుంటుంద‌న్నారు.  గత ప్రభుత్వ హ‌యాంలో రెవెన్యూ , వీఆర్ఏ, వీఆర్ఓ వ్యవస్థను పూర్తిగా కుప్ప‌కూలిపోయాయ‌ని,  ప్రజా ప్రభుత్వంలో గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించి, అర్హులైన వారిని మళ్లీ తీసుకువచ్చి గ్రామాలలో ఎటువంటి భూ సమస్య ఉన్న అక్కడే పరిష్కారం చూపిస్తామన్నారు. ధ‌ర‌ణి పోర్ట‌ల్‌లో భూములు త‌మ‌పేర్న న‌మోదు కాక ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డుతున్నార‌న్నారు. ధరణి చట్టం వల్ల ప్రజలు అధికారుల వద్దకు వెళ్లాల్సి ఉండేదని, కానీ భూ భారతి చట్టం వల్ల ప్రజల వద్దకే అధికారులు వారి వారి గ్రామాలకు వచ్చి ఒక్క రూపాయి తీసుకోకుండా భూ సమస్యలను పరిష్కరిస్తారని మంత్రి తెలిపారు.  అసైన్డ్ భూములకు కూడా హక్కులు కల్పిస్తామని, పేదలకు భూములు పంచాలన్న ఆలోచ‌న త‌మ ప్ర‌జాప్ర‌భుత్వానికి వున్న‌ద‌ని,  కోర్టు వివాదాల్లో లేని ప్రతి భూ సమస్య పరిష్కరించడమే భూ భారతి ముఖ్య ఉద్దేశం అన్నారు.ఎవరి పేరుతో ఎంత భూమి ఉందో అది వారికే చెందేలా చూస్తామన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్ సమావేశం నిర్వహించి భూ భారతి చట్టం ద్వారా భూ సమస్యలను పరిష్కరించాలని స్పష్టంగా చెప్పారని, మొదటగా నాలుగు మండలాల పైలెట్ ప్రాజెక్టు కింద తీసుకున్నామని, జూన్ రెండు లోపు ఎంపిక చేసిన నాలుగు పైలెట్ గ్రామాల భూ సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలం ప్రతి రెవెన్యూ గ్రామానికి ఇదే పద్ధతిలో అధికారుల రైతులు వద్దకు వస్తారని, రైతుకు ఎటువంటి సమస్య లేకుండా పూర్తి భద్రత కల్పిస్తామన్నారు.  భూ భారతి చట్టాన్ని రాజకీయాల కతీతంగా అందరూ వినియోగించుకోవాలని అన్నారు.  భూ హక్కుల ఉన్న రైతులకు న్యాయం జరిగేలా తహసిల్దార్ నుంచి సిసిఎల్ఏ వరకు 5 అంచెల వ్యవస్థ ఏర్పాటు చేశామని మంత్రి వివ‌రించారు. సిసిఎల్ఏ స్థాయిలో న్యాయం జరగకపోతే ప్రజలు కొత్తగా ఏర్పడిన ట్రిబ్యునల్ సంప్రదించ వచ్చని, రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైన ట్రిబ్యునల్ లను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిధి 10 లక్షల పెంపు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ సరఫరా, 20 వేల కోట్లతో 25 లక్షల మంది రైతులకు 2 లక్షల రుణ మాఫీ, సన్న వడ్లకు క్వింటాళ్ల 500 రూపాయల బోనస్, రైతు భరోసా, డైట్ చార్జీలు, కాస్మోటిక్ చార్జీల పెంపు, రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యం సరఫరా వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను పేదల కోసం అమలు చేశామని అన్నారు. అర్హులందరికీ త్వరలోనే రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు. రాబోయే 4 సంవత్సరాలలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. కార్పొరేట్ స్థాయిలో విద్య‌ అందించేందుకు సమీకృత గురుకులాలను నిర్మిస్తున్నామని , ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం  చేసే సీతారామ ఎత్తిపోతల పథకాన్ని యుద్ధ ప్రాతిపదికగా పూర్తి చేస్తున్నామని అన్నారు.

రవాణా శాఖ మంత్రి వర్యులు పోన్నం ప్రభాకర్ మాట్లాడుతూ  మనిషికి ఆధార్ కార్డు ఉన్నట్లు, భూమి భూ దార్ కార్డు ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.ప్రజలకు భూ హక్కుల పై భరోసా కల్పించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములపై ఎటువంటి సమాచారం వున్నా అధికారులకు తెలియజేయాలని, అక్రమార్కుల నుంచి వాటిని స్వాధీనం చేసుకొని ప్రజా అవసరాల కోసం వినియోగిస్తామని మంత్రి తెలిపారు. రాబోయే 2,3 రోజులలో వేములవాడ నుంచి ముంబైకి  ప్రత్యేక ఏసీ బస్సు వేస్తామని మంత్రి తెలిపారు. రుద్రంగి బస్ స్టాండ్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు.
గ్రామీణ అభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి  దనసరి అనసూయ (సీతక్క) మాట్లాడుతూ రుద్రంగి మండల కేంద్రంలో జరుగుతున్న భూ భారతి అవగాహన కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. గతంలో ఎటువంటి సమస్యలు ఉన్న కోర్టు వెళ్లాల్సిన ఉండేదని, నేడు భూ సమస్యల పరిష్కారానికి తహసిల్దార్ నుంచి సిసిఎల్ఏ వరకు అంచెలంచెలుగా వ్యవస్థను ఏర్పాటు చేశామని అన్నారు.మహిళా సంఘాలను సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని,  స్కూల్ యూనిఫాం దగ్గర నుంచి ఆర్టీసీ అద్దె బస్సుల వరకు, రైస్ మిల్లుల ఏర్పాటు, ఇందిరా మహిళ క్యాంటీన్, వివిధ రకాల వ్యాపార యూనిట్ల స్థాపనకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని అన్నారు.

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ  తమ ప్రభుత్వం ఎన్నికల వాగ్దానం మేరకు భూ భారతి చట్టం ప్రవేశపెట్టి భూ సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్న‌ద‌న్నారు.  రుద్రంగి భీమారం మండలాల్లో రెవెన్యూ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని, వేములవాడ నియోజకవర్గంలో సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని నిర్మించాలని మంత్రి దృష్టికి విప్ తీసుకెళ్లారు. వేములవాడ నియోజకవర్గానికి అదనంగా వెయ్యి ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని కోరగా అదనంగా 1750 ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. మిడ్ మానేరు భూ నిర్వాసితులకు మన హయాంలో 4656 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.  ఇంటి జాగా లేని పేదలకు కూడా ఇందిరమ్మ ఇల్లు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.   జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ, వేములవాడ ఎమ్మెల్యే తో తనకు చాలా కాలం నుంచి సత్సంబంధాలు ఉన్నాయని తెలిపారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ, భూ సమస్యలు శాశ్వత పరిష్కారం చేసే దిశగా అంబేద్కర్ జయంతి నాడు ప్రభుత్వం భూ భారతి పోర్టల్ ప్రారంభించిందని, ఈ చట్టంపై సందేహాల నివృత్తి కోసం మండల కేంద్రాలలో అవగాహన సమావేశాలు విజయవంతంగా నిర్వహించామన్నారు.

రుద్రంగి మండలం పైలట్ గా ఎంపిక చేసి రెవెన్యూ సరస్సు నిర్వహిస్తున్నామని, తహసిల్దార్ అధికారి నేతృత్వంలో 3 బృందాలను ఏర్పాటు చేసి  గ్రామాలలో ప్రజల దగ్గరి నుంచి భూ సమస్యలపై ఇప్పటి వరకు 1027  దరఖాస్తులు స్వీకరించామని తెలిపారు.  గతంలో ధరణి పోర్టల్ సమస్యల పరిష్కారం స్పెషల్ డ్రైవ్ లో సిరిసిల్ల జిల్లా రాష్ట్రంలో మొదటి రెండు స్థానాలు నిలిచిందని, అదే విధంగా భూ భారతి పోర్టల్ నందు కూడా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో 243 ఇందిరమ్మ ఇళ్ల‌ నిర్మాణ పనులకు కూడా నేడు శంకుస్థాప‌న జ‌రుగుతున్న‌ద‌న్నారు.అనంతరం రుద్రంగి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భూ భారతి హెల్ప్ డెస్క్ ను పరిశీలించి రైతులు నుండి స్వీకరిస్తున్న భూ సమస్యల దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పలువురు రైతులు  తమ భూ సమస్యలను పరిష్కరించాలని రెవెన్యూ శాఖ మంత్రిని కోరారు.  రుద్రంగి గ్రామంలో మంజూరు చేసిన 243 ఇందిరమ్మ ఇండ్ల కు గాను ఈ రోజు 30 ఇళ్ల‌ నిర్మాణ పనులకు మంత్రి  శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్,మార్కెట్ కమిటీ చైర్మన్లు చెలుకల తిరుపతి, రోండి రాజు, కచ్చకాయల ఎల్లయ్య, పండ్ర నారాయణ, ఎం వినోద్, ఎస్పీ మహేష్ బి గితే, వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి,వేములవాడ ఇన్చార్జి ఆర్డీవో రాధాబాయి, అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్ అండ్ బీ ఈఈ వెంకట రమణయ్య, హౌసింగ్ పీడీ శంకర్, డీఆర్డీఓ శేషాద్రి, ఇందిరమ్మ ఇండ్ల మండల ప్రత్యేక అధికారి, కార్మిక శాఖ అధికారి నజీర్ అహ్మద్, తహసిల్దార్ శ్రీ లత, ఎంపీడీఓ నటరాజ్, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page