దేశం కోసం, ధర్మం కోసం వడ్లు కొనాలి

  • కేంద్రం కొనే వరకు ఉద్యమం ఆగదు
  • రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్‌ఎస్‌ ‌రైతు మహాధర్నాలు
  • రైతులతో చెలగాటం వొద్దని కేంద్రానికి హితవు
  • పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు

వడ్ల కొనుగోళ్ల విషయంలో కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైన టీఆర్‌ఎస్‌ ‌తన ఆందోళనలో భాగంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, సమావేశాలతో నిరసనలు తెలిపింది. రైతుల ఇండ్లపై నల్లజెండాలు ఎగురేసింది. తెలంగాణ రైతులు పండించిన వడ్లను కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. ఇప్పటికే అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టిన టీఆర్‌ఎస్‌ ఇదే క్రమంలో గురువారం అన్ని జిల్లాల్లో రైతు మహాధర్నాలను చేపట్టింది. టీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌పిలుపు మేరకు రైతులు, టీఆర్‌ఎస్‌ ‌శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనల్లో పాల్గొన్నారు.

కేంద్రంలోని మోదీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలుచోట్ల మోదీ దిష్టి బొమ్మలను దహనం చేశారు. కేంద్రం వడ్లను కొనుగోలు చేసే వరకు ఉద్యమం ఆగదని నేతలు నినదించారు. ఈ ఆందోళనలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన తెలిపారు. అయితే ధర్నాల్లో కేవలం టిఆర్‌ఎస్‌ ‌నేతలు, కార్యకర్తలే కనిపించారు. ఎక్కడా రైతులు కానరాలేదు. రైతుల కోసం టీఆర్‌ఎస్‌ ‌నేతలు పోరాడుతున్నా..వారి నుంచి మద్దతు రాకపోవడంపై పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. టీఆర్‌ఎస్‌ ఆం‌దోళనల్లో రైతులు కనబడకపోవడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఇక కేంద్రం తెలంగాణపై కక్ష్య పూరితంగా వ్యవహరిస్తుందని మంత్రులు ఆరోపణలు గుప్పించారు. కేంద్రం దిగివచ్చేంతవరకు తమ నిరసనలు కొనసాగుతాయని హెచ్చరించారు. ఇదే క్రమంలో తెలంగాణలో పండిన యాసంగి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనని టీఆర్‌ఎస్‌ ‌డిమాండ్‌ ‌చేసింది. వడ్లు కొనకుండా రైతులను ఆగం చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. కొన్ని చోట్ల వడ్ల కుప్పలు, వరి గొలుసులతో రైతులు తరలివచ్చి కేంద్రం తీరుపై ధ్వజమెత్తారు. అనేక చోట్ల టీఆర్‌ఎస్‌ ‌శ్రేణులు, రైతులు స్వచ్ఛందంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ‘రైతు బతుకులతో చెలగాటం, దేశం కోసం ధర్మం కోసం వడ్లు కొనాలి’ అంటూ నినదించారు. రైతులు ఎడ్లబండ్లపై ర్యాలీగా వొచ్చి హైవేలను ముట్టడించారు.

తెలంగాణ రైతు బతుకుల్లో చీకటి నింపేలా కుట్రలు చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ‌కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై గులాబీ శ్రేణులు నిప్పులు చెరిగాయి. ధాన్యం

కొనబోమన్న కేంద్రంపై ఉద్యమ కార్యాచరణలో భాగంగా గురువారం హైదరాబాద్‌ ‌మినహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో టీఆర్‌ఎస్‌ ‌మహా ధర్నా కార్యక్రమాలు చేపట్టింది. మంత్రి హరీష్‌ ‌రావు సిద్ధిపేటలో, మంత్రి కేటీఆర్‌ ‌సిరిసిల్లలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇతర మంత్రులు కూడా తమ జిల్లాల్లో పాల్గొన్నారు. పార్టీ శ్రేణులు, అనుబంధ సంఘాల బాధ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆగమైన తెలంగాణ రైతన్న, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ‌హయాంలో ఉచిత నిరంతర విద్యుత్తు, పుష్కలంగా సాగునీటితో మంచి పంటలు పండిస్తుంటే, కేంద్రం మాత్రం రైతుల ధాన్యం కొనబోమంటూ వారికి అన్యాయం చేస్తున్నదని మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ ఉచిత విద్యుత్తు ఇస్తుంటే.. మోదీ మాత్రం మోటర్లకు టర్లు బిగించాలంటున్నారు.

దేశమంతా కేసీఆర్‌ను కోరుకొంటే తమ గతి ఏం కావాలని బీజేపీ నేతలు భయప డుతున్నారు. తెలంగాణ పట్ల ప్రధాని మోదీ ఆది నుంచి నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని మంత్రి అన్నారు.  కేంద్ర మంత్రి గోయల్‌ ‌రాష్ట్ర ప్రజలను అవమానించేలా నూకలు తినడం అలవాటు చేయమని చెప్పడం ఆయన అహంకారం ధోరణికి నిదర్శనమని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో రెండు పంటలు కొనుగోలు చేస్తున్న కేంద్రం, తెలంగాణ విషయంలో అన్యాయం చేస్తున్నది. రైతులను వరి సాగు చేయాలని చెప్పిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌దమ్ముంటే కేంద్రం చేత వడ్లు కొనుగోలు చేయించాలన్నారు. వడ్ల కొనుగోళ్ల విషయంలో కేంద్ర మంత్రి పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు. బాయిల్డ్ ‌రైస్‌ను విదేశాలకు ఎగుమతి చేస్తూ ఈ బియ్యం ఎవరూ కొనడం లేదని దగాకోరు మాటలు మాట్లాడుతున్నారు. కేంద్రం మెడలు వంచి వడ్లను కొనిపిస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *